పంట పండుగ.. రైతుకు అండగా

17 Feb, 2018 03:51 IST|Sakshi

నియోజకవర్గానికో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌

వ్యవసాయ రంగంలో కొత్త మార్పులకు సర్కారు చర్యలు

ఐదు కీలక అంశాలపై కేబినెట్‌ సబ్‌ కమిటీ

కనీస మద్దతు ధర, మార్కెటింగ్, పంట మార్పిడి దిశగా చర్యలు

నెల రోజుల్లో నివేదిక ఇవ్వాలని ముఖ్యమంత్రి ఆదేశం

సాక్షి, హైదరాబాద్‌ : ఫుడ్‌ ప్రాసెసింగ్‌ విధానంలో భాగంగా వచ్చే ఏడాది నుంచి వ్యవసాయ రంగంలో కొత్త మార్పులు తీసుకువచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. రైతులకు ప్రయోజనం కల్పించే కీలక అంశాలపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. అన్ని పంటలకు కనీస మద్దతు ధర, మార్కెటింగ్‌ సదుపాయాలు, క్రాప్‌ కాలనీలు, పంట మార్పిడి, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్ల స్థాపన తదితర అంశాల్లో రైతులకు మేలు చేసే విధానాలు, కార్యాచరణను రూపొందించేందుకు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో మంత్రులు కేటీఆర్,ఈటల, హరీశ్‌రావు, జూపల్లి కృష్ణారావులు సభ్యులుగా మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించింది. దీనికి వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి మెంబర్‌ కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. ప్రధానంగా ఐదు అంశాలపై చర్చించి.. వాటి సాధ్యాసాధ్యాలు, తీసుకోవాల్సిన చర్యలపై నెల రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని కమిటీని ముఖ్యమంత్రి కె,చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. ఈ మేరకు కమిటీకి మార్గదర్శకాలను నిర్దేశిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ఐదు అంశాలివీ..
– రాష్ట్రంలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో ఒక ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌ నెలకొల్పాలని ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్రంలో మొత్తం 119 నియోజకవర్గాలు ఉన్నాయి. ఇందులో గ్రామీణ ప్రాంతాల్లోని వంద నియోజకవర్గాల్లో ఆయా ప్రాంతాలకు అనువైన ఆహార శుద్ధి పరిశ్రమలను నెలకొల్పాలన్నది ప్రభుత్వ యోచన. ఇందుకు సాధ్యాసాధ్యాలు, ప్రాంతాలవారీగా అనువైన యూనిట్లను సిఫారసు చేయాలని ప్రభుత్వం కమిటీకి సూచించింది.

– పంట ఉత్పత్తులన్నింటికీ కనీస మద్దతు ధర అమలుకు సిఫారసు చేయాలని, ఇప్పుడున్న కనీస మద్దతు ధరలను సమీక్షించాలని కమిటీకి నిర్దేశించింది. దీంతో పాటు ఆహార భద్రతా ప్రమాణాలను నిర్ణయించటం, అందులో ప్రభుత్వ జోక్యం, విధాన రూపకల్పనను సమీక్షించాలని సూచించింది.

– రాష్ట్రంలో కొత్త నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణం దృష్ట్యా సాగయ్యే ఆయకట్టు పెరుగుతుందని, ఈ నేపథ్యంలో ఏయే చోట్ల ఏయే పంటలు వేయాలన్న దానిపై ప్రణాళికను రూపొందించాలని సూచించింది.

– కొత్త ప్రాజెక్టులకు తోడుగా 24 గంటల విద్యుత్‌ సరఫరాతో నీటి వసతి పెరుగుతుందని, దానివల్ల వరి సాగు భారీగా పెరిగే అవకాశముందని ప్రభుత్వం భావిస్తోంది. అదే జరిగితే మార్కెట్లో ధర పడిపోతుందని.. ఈ నేపథ్యంలో వచ్చే సీజన్‌లో వరికి బదులుగా ఇతర పంటలు సాగు చేసేలా పంట మార్పిడి, కొత్త సాగు ప్రణాళికను రూపొందించాలని ప్రభుత్వం కమిటీని ఆదేశించింది. దీనిపై తగినంత ప్రచారం కల్పించే దిశగా సిఫారసులు చేయాలని పేర్కొంది.

– ఇక చివరిగా రాష్ట్రంలో రైతులకు చేరువలో పంట ఉత్పత్తుల మార్కెటింగ్‌ సదుపాయాలు ఉండేలా ప్రణాళిక రూపొందించాలని సూచించింది. పంటలతోపాటు ఫుడ్‌ ప్రాసెసింగ్‌ పరిశ్రమల ఉత్పత్తులకు మార్కెటింగ్‌ సదుపాయాలను కల్పించాలని నిర్ణయించింది. 

>
మరిన్ని వార్తలు