..ఇలా దరఖాస్తు చేసుకోండి

15 Oct, 2014 02:12 IST|Sakshi
..ఇలా దరఖాస్తు చేసుకోండి

 పింఛన్లు, ఆహార భద్రత కార్డులు, ఫాస్ట్ పథకం కోసం అర్హులైన ప్రజలందరూ కొత్తగా దరఖాస్తు చేసుకోవాలని
 ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా, దరఖాస్తుల స్వీకరణ బాధ్యతలను
 గ్రామస్థాయిలో వీఆర్‌ఓ, పంచాయతీ కార్యదర్శులు, అర్బన్ పరిధిలో మునిసిపాలిటీలు, కార్పొరేషన్ సిబ్బందికి
 అప్పగించారు. అయితే దరఖాస్తులను తెల్లకాగితంపై మాత్రమే రాసి ఇవ్వాలని అధికారులు చెబుతుండడంతో
 ప్రజలు కొంత అయోమయానికి గురవుతున్నారు. అర్జీలు ఇచ్చే విషయంపై ప్రభుత్వం ప్రజలకు స్పష్టమైన
 అవగాహన కల్పించకపోవడంతో కేంద్రాల వద్ద ఇబ్బందులు పడుతున్నారు.  అసలు దరఖాస్తులు
 వేటికోసం చేయాలి... ఎవరు చేయాలి... ఎలా చేయాలి.. అనే విషయాలను ఓసారి పరిశీలిస్తే..
  నల్లగొండ
 
 అర్జీలు ఎందుకోసం...
 ప్రభుత్వం అందజేస్తున్న పింఛన్లు, ఆహార భద్రతకార్డులు, నిరుపేద విద్యార్థులు ‘ఫాస్ట్’ పథకం కింద ఆర్థికసాయం పొందేందుకు ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అయితే వీటిలో ప్రతి పథకం కోసం కుటుంబయజమాని స్వయ ంగా.. లేకుంటే కుటుంబసభ్యుల ద్వారా ద రఖాస్తులు అందజేయవచ్చు. ఒక్కో పథకానికి కుటుంబసభ్యులు వేర్వేరుగా అర్జీలు ఇవ్వాల్సి ఉంటుంది. ఉదాహరణకు ఒక కుటుంబానికి ఆహార భద్రతకార్డు, ఇంట్లో ఒకరికి పింఛన్ కావాలంటే రెండింటి కోసం వేర్వేరుగా దరఖాస్తులు ఇవ్వాలి. అలాగే ఫాస్ట్ పథకం కోసం కులం, నివాసం సర్టిఫికెట్‌కు ఒకటి, ఆదాయం ధ్రువీకరణ పత్రంకోసం మరొకటి ఇవ్వాలి.
 
 తెల్లకాగితం... ఆధార్ నంబర్
 పింఛన్లు, ఆహార భద్రతకార్డు, ఆదాయ ధ్రువీకరణ పత్రాల కోసం ప్రత్యేకంగా నమూనా అవసరంలేదు. తెల్లకాగితంపై య జమాని కుటుంబవివరాలు రాసి దరఖాస్తు ఇస్తే సరిపోతుంది. అయితే కుటుంబంలో ఎంతమందికి ఆహార భద్రతకార్డు కావా లో.. వారి పేర్లు, ఆధార్ నంబర్లు దరఖాస్తులో రాయాల్సి ఉంటుంది. ఆధార్ నంబర్ విషయంలో ఈ- ఆధార్ నంబర్ కాకుండా శాశ్వత ఆధార్ నంబర్ ఇవ్వాలని అధికారులు చెబుతున్నారు. ఫొటోలు, ఇతర జిరాక్స్‌లు అవసరంలేదు.
 
 ఇన్‌కమ్ సర్టిఫికెట్ కోసం..
 ఫాస్ట్ పథకం కోసం ఆదాయ ధ్రువీకరణ పత్రం పొందాలనుకునే విద్యార్థులు ప్రత్యేకంగా ప్రభుత్వం జారీ చేసిన జీఓ నంబర్-5 ప్రకారం తయారుచేసిన నూతన నమూనా పత్రంలో మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఫారాలు ప్రస్తుతం అన్ని జిరాక్స్ సెంటర్లలో అందుబాటులో ఉంచినట్లు హన్మకొండ సూపరింటెండెంట్ సత్యనారాయణ తెలిపారు. అలాగే రేషన్‌కార్డు జిరాక్స్ కాపీని కూడా దరఖాస్తుకు జతచేయాలని సూచించారు.
 
 వీరు అనర్హులు...
 సంక్షేమ పథకాలకు అర్హులను ఎలా గుర్తించాలనే విషయానికి సంబంధించిన నియమ నిబంధనలను ప్రభుత్వం ఇటీవల జారీ చేసింది. ఇందులో 5ఎకరాలకంటే ఎక్కువగా సాగుభూములున్న రైతులు, ప్రభుత్వ, ప్రైవేటు, పబ్లిక్, అవుట్‌సోర్సింగ్ రంగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, డాక్టర్లు, కాంట్రాక్టర్లు, ప్రొఫెషనల్స్, స్వయం ఉపాధి పొందుతున్నవారు, రైస్‌మిల్లులు, పెట్రోల్ పంపులు, ఇతర షాపులు ఉన్నవారు ప్రభుత్వ పథకాలకు అనర్హులని నిబంధనల్లో పేర్కొన్నారు. అలాగే ఫోర్‌వీలర్ వాహనాలు ఉన్నవారు కూడా అనర్హులు.
 
 పథకాల వర్తింపు ఇదీ..
 కుటుంబంలో భార్యాభర్తలిద్దరూ వృద్ధాప్యంలో ఉంటే భార్యకు మాత్రమే పింఛన్ ఇవ్వనున్నారు. వీరితోపాటు వికలాంగులు, వితంతువులు ఉంటే వారికి కూడా పింఛన్  ఇస్తారు. 60 ఏళ్లు దాటిన వారు మాత్రమే వృద్ధాప్య పింఛన్ కు అర్హులు. వయస్సు నిర్ధారణ విషయంలో విచారణ అధికారిదే తుది నిర్ణయం. వికలాంగులు పింఛన్ల కోసం సదరం సర్టిఫికెట్‌ను తప్పనిసరిగా ఇవ్వాలి. పైవిషయాలు అన్నింటితోపాటు కుటుంబ స్థితిగతుల ఆదారంగా అర్హతను నిర్ధారించే అధికారం విచారణ అధికారి, పర్యవేక్షణ అధికారులకు మాత్రమే ఉంటుంది.
 
 దరఖాస్తు చేసే విధానం..
 తెల్లకాగితంపై కుటుంబ వివరాలు తెలియజేయాలి.
 ఆధార్ నంబర్ తప్పనిసరిగా రాయాలి.
 ఇంటి చిరునామా, సెల్ నంబర్ ఇవ్వాలి.
 ప్రతి పథకం కోసం వే ర్వేరుగా దరఖాస్తు చేసుకోవాలి.
 ఆదాయం సర్టిఫికెట్ కోసం అధికారులు చెప్పిన నమూనా పత్రంలో వివరాలు ఇవ్వాలి. అలాగే దానివెంట రేషన్‌కార్డు జిరాక్స్ కాపీని జతచేయాలి.
 
 సర్వే సమాచారంతో లింకు..
 ప్రస్తుతం తీసుకుంటున్న దరఖాస్తులు గతంలో సమగ్ర కుటుంబ సర్వే(ఎస్‌కేఎస్) సమయంలో సేకరించిన వివరాల ఆధారంగా పరిశీలిస్తారు. వాటిలోని వివరా లు పరిశీలించి లబ్ధిదారుల అర్హతను నిర్ధారిస్తారు.
 

మరిన్ని వార్తలు