‘ఇంటిపంట’లతోనే ఆహార భద్రత

3 Mar, 2015 03:23 IST|Sakshi
‘ఇంటిపంట’లతోనే ఆహార భద్రత

హైదరాబాద్: నగరాలు, పట్టణాల్లో ఇంటిపంటలను ఉద్యమ స్థాయిలో చేపడితే తప్ప మున్ముందు ఆహార కొరతను ఎదుర్కోక తప్పదని సేంద్రియ ఇంటిపంటల ఉద్యమ పితామహుడు, విశ్రాంత వ్యవసాయ శాస్త్రవేత్త డా. బి.ఎన్. విశ్వనాథ్ (బెంగళూరు) హెచ్చరించారు. సాగు భూముల విస్తీర్ణం కుంచించుకుపోవటం, నగరాలకు గ్రామీణుల వలసలు పెరుగుతున్న నేపథ్యంలో ఇంటిపంటల ప్రాధాన్యం పెరుగుతోందన్నారు. సోమవారం హైదరాబాద్‌లో జాతీయ వ్యవసాయ విస్తరణ యాజమాన్య సంస్థ(మేనేజ్)లో ‘అర్బన్ అగ్రికల్చర్ అండ్ ఎడిబుల్ గ్రీనింగ్’ పేరిట ప్రారంభమైన రెండు రోజుల జాతీయ సదస్సులో ఆయన కీలకోపన్యాసం చేశారు. నగరాల్లో మేడలపై ఇంటిపంటలు పండించకపోతే భవిష్యత్తులో మాత్రలు మింగి ఆకలి తీర్చుకోవాల్సిన దుస్థితి వస్తుందన్నారు.

చైనా, క్యూబా వంటి దేశాల్లో ఆర్గానిక్ సిటీ ఫార్మింగ్ చాలా విస్తారంగా సాగుతోందని...అందువల్ల మన దేశంలోనూ ప్రజలకు శిక్షణ ఇచ్చి ఇంటిపంటల సాగును విస్తృతంగా చేపట్టాలన్నారు. ఇందుకోసం ప్రత్యేక విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని, ప్రభుత్వాలు శ్రద్ధతో ఇంటిపంటలను ప్రోత్సహించాలని కోరారు. సదస్సు నిర్వాహకురాలు డా. కె. ఉమారాణి మాట్లాడుతూ ప్రభుత్వ విధానాల రూపకల్పనకు ఈ సదస్సు నిర్మాణాత్మక సూచనలు చేస్తుందన్నారు. అంతర్జాతీయ నీటి యాజమాన్య సంస్థ(ఇమి)కు చెందిన డా. అమరసింఘె ప్రియానీ మాట్లాడుతూ నగరాల్లో, పరిసర ప్రాంతాల్లో పంటల సాగు పోషకాహార భద్రత సాధనకెంతో ముఖ్యమన్నారు. ఇక్రిశాట్‌లోని ప్రపంచ కూరగాయల కేంద్రం డెరైక్టర్ డా. వావ్రిక్ ఈస్‌డన్ మాట్లాడుతూ బెట్టను తట్టుకునే, దీర్ఘకాలం దిగుబడినిచ్చే వంగడాల రూపకల్పనకు కృషి చేస్తున్నామన్నారు.

ఇంటిపంటలపై ‘సాక్షి’ కృషికి జేజేలు
సదస్సులో ప్రసంగించిన పలువురు వక్తలు సాక్షి దినపత్రిక గత కొన్నేళ్లుగా ఇంటిపంటల వ్యాప్తికి చేస్తున్న కృషిని కొనియాడారు. ట్రిపుల్‌ఐటీకి చెందిన వ్యవసాయ నిపుణుడు డా. శ్యాంసుందర్‌రెడ్డి మాట్లాడుతూ ఇంటిపంటల సాగును ప్రోత్సహించడంలో ‘సాక్షి’ ప్రశంసనీయమైన కృషి చేస్తోందని, ఇంటిపంటలపై ఆసక్తిగల వారి మధ్య వారధిగా ‘ఇంటిపంట’ కాలమ్ పనిచేస్తోందన్నారు. డా. విశ్వనాధ్, డా. అమరసింఘె ప్రియానీతోపాటు హైడ్రోపోనిక్స్ నిపుణుడు ప్రతాప్ గౌడ్, మొలక గడ్డి నిపుణుడు డా. వెంకటరమణ తదితరులు ‘సాక్షి’ కృషిని ప్రశంసించారు. సాక్షి ప్రతినిధి పంతంగి రాంబాబు మాట్లాడుతూ ప్రతి నగరం, పట్టణం, మేజర్ పంచాయతీల్లో ఇంటిపంటల సాగును ప్రభుత్వం సబ్సిడీ కిట్లతో ప్రోత్సహించాలని సూచించారు. కర్ణాటక, తమిళనాడు, కేరళ తదితర రాష్ట్రాలకు చెందిన శాస్త్రవేత్తలు, ఉద్యాన, వ్యవసాయాధికారులు ఈ సదస్సులో పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు