‘ఆహారభద్రత’కు మోక్షమెప్పుడో!

14 Aug, 2018 12:51 IST|Sakshi

కరీంనగర్‌ సిటీ: ఆహారభద్రత కార్డుల జారీ విషయంలో జిల్లా యంత్రాంగం అలసత్వం ప్రదర్శిస్తోంది. ఫలితంగా కొత్త లబ్ధిదారులు వచ్చే నెల నుంచి రేషన్‌ సరుకులు తీసుకునే వీలు లేకుండాపోతోంది. ఆగస్టు 15 నుంచి ఆహారభద్రత కార్డు లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేయాలన్న పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ అకున్‌ సబర్వాల్‌ ఆదేశాలు బేఖాతరవుతున్నాయి. గడువు దగ్గర పడుతున్నా లబ్ధిదారులు పెట్టుకున్న దరఖాస్తులు సమగ్ర విచారణ పేరుతో రెవెన్యూ అధికారుల జాప్యం.. హార్డ్‌కాపీలు అందకపోవడంతో సంబంధిత పౌరసరఫరాల శాఖ ఆన్‌లైన్‌ మంజూరు చేయకపోవడం వెరసి ఎక్కడి గొంగలి అక్కడే అన్న చందంగా మారింది. జిల్లాలో మొత్తంగా 13,000 మంది కొత్త రేషన్‌కార్డుల మంజూరుతోపాటు మార్పులు చేర్పుల కోసం దరఖాస్తు చేసుకోగా 8,900 దరఖాస్తులు పెండింగ్‌లో ఉండడం గమనార్హం.

ఆహారభద్రత కార్డులపై అదిగో ఇదిగో అంటూ రాష్ట్ర ఆవిర్భావం నుంచి హడావుడి చేసిన ప్రభుత్వం ఆ ఊసే మరిచింది. కేవలం కార్డుల లబ్ధిదారుల వివరాలను కంప్యూటర్లలో నిక్షిప్తం చేసిన డేటా, వినియోగదారుని ఆధార్‌ సంఖ్య ఆధారంగానే రేషన్‌ దుకాణాల్లో సరుకులు ఇస్తున్నారు. ఆహారభద్రత కార్డుల జారీకి ప్రభుత్వం నూతన విధానాన్ని చేపట్టి సులభతరంగా చేసినా కుప్పలు తెప్పలుగా వచ్చిన దరఖాస్తుల విచారణ వివిధ కారణాలతో ముందుకు సాగడం లేదు. రాష్ట్రస్థాయిలో మంజూరు విధానాన్ని పక్కనపెట్టి జిల్లా స్థాయిలోనే దరఖాస్తులను పరిశీలించి అనుమతి జారీ చేయాలని పౌరసరఫరాల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే.. క్షేత్రస్థాయిలోనే ఈ దరఖాస్తులు పెండింగ్‌లో ఉంటున్నాయి. కొత్తగా రేషన్‌కార్డు కావాల్సిన వారు దరఖాస్తు చేసుకోవాలని మూడు నెలల కిందట ప్రభుత్వం సూచించింది.

13,400 దరఖాస్తులు.. 
జిల్లావ్యాప్తంగా కొత్తగా ఆహారభద్రత కార్డులకు 13,400 దరఖాస్తులు వచ్చాయి. వీటిని రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి అర్హులను గుర్తించి కార్డు మంజూరుకు పౌరసరఫరాలశాఖకు సిఫారసు చేయాల్సి ఉంటుంది. ఆగస్టు 15 నుంచి కొత్తరేషన్‌ కార్డులు జారీకి అర్హులను గుర్తించి, వచ్చే నెల నుంచి వారికి రేషన్‌ సరుకులు పొందే అవకాశం కల్పించాలని ప్రభుత్వం యోచిస్తోంది. మొత్తంగా 7,200 కొత్త కార్డుల కోసం దరఖాస్తులు రాగా 6,200 మ్యుటేషన్లు (మార్పులు, చేర్పుల) కోసం వచ్చాయి. జిల్లాలో రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించాల్సిన దరఖాస్తులు 7 వేలకు పైగానే ఉన్నాయి. రెవెన్యూ అధికారులు పరిశీలించిన దరఖాస్తులు పౌరసరఫరాల శాఖ కార్యాలయంలో ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది.

పౌరసరఫరాలశాఖకు 6 వేల దరఖాస్తులు హార్డ్‌కాపీల రూపంలో అందగా అందులో 1,500 పెండింగ్‌లో ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. వీటిని ఆన్‌లైన్‌లో అనుమతించాల్సి ఉంది. 4,500 దరఖాస్తులను ఆన్‌లైన్‌ అప్‌లోడ్‌ పూర్తి చేశారు. జిల్లా స్థాయి లాగిన్‌లోనే అనుమతివ్వాలని ప్రభుత్వం తాజా మార్పులతో కొత్తకార్డుల లబ్ధిదారుల ఎంపిక చేయనున్నారు. ఇంకా 8,500 దరఖాస్తులు వివిధ దశల్లో విచారణలో ఉన్నాయి. గత జనవరి నుంచి దరఖాస్తులు సమర్పించిన వారు కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. జిల్లా స్థాయిలో త్వరితగతిన అనుమతినిచ్చే అవకాశమున్నా ఆచరణలో సాధ్యం కావడం లేదు.
 
జిల్లా స్థాయిలోనే మంజూరు
మారిన నిబంధనల ప్రకారం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుంటే జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారి మంజూరు చేస్తారు. ఆన్‌లైన్‌ ప్రక్రియ అయినప్పటికీ విచారణలో తీవ్ర జాప్యం జరుగుతోంది. మీ సేవలో పూర్తి వివరాలతో చేసుకున్న దరఖాస్తు తహసీల్దార్‌ కార్యాలయ లాగిన్‌లోకి వస్తుంది. తహసీల్దార్‌ సంబంధిత ఆర్‌ఐకి విచారణ కోసం సిఫారసు చేస్తారు. క్షేత్రస్థాయిలో విచారణ చేసిన ఆర్‌ఐ ఆ నివేదికను తహసీల్దార్‌ లాగిన్‌కు పంపిస్తారు. ప్రభుత్వం రూపొందించిన ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌లో సరి చూసుకుని అర్హులైతే తన లాగిన్‌ ద్వారా జిల్లా పౌరసరఫరాల అధికారికి ఆన్‌లైన్‌లో సిఫారసు చేస్తారు. విడిగా ఒక ప్రతీని డీఎస్‌వోకు పంపించాల్సి ఉంటుంది. వీటిని పరిశీలించిన డీఎస్‌వో ఆహార భద్రత కార్డును మంజూరు చేస్తారు.

మీసేవ ద్వారా కార్డు ప్రతీని పొంది సంబంధిత రేషన్‌ షాపులో సరుకులు పొందేందుకు అవకాశం ఉంటుంది. రెండేళ్ల కిందట కొత్త రేషన్‌ కార్డులు ముద్రించి జిల్లాలకు పంపారు. అదే సమయంలో జిల్లాల విభజన చేయడంతో పాత జిల్లాల పేర్లతో ముద్రించిన కార్డులను పంపిణీ చేయకుండా నిలిపేశారు. ఇప్పుడున్న 31 జిల్లాల వారీగా ఆహారభద్రత కార్డులను ముద్రించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ప్రక్రియ ముగిసిన అనంతరం లబ్ధిదారులకు కార్డులు పంపిణీ చేయనున్నారు.
 
ఎదురుచూపులు..!
జిల్లాలో వేలాది మంది దరఖాస్తు చేసుకుని అనుమతి కోసం ఎదురుచూస్తున్నారు. నూతనంగా పెళ్లి చేసుకున్న అర్హులైన కుటుంబాలు రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. కొత్త కార్డుల జారీ ప్రక్రియలో మాత్రం ముందుకు సాగడం లేదు. క్షేత్ర స్థాయి విచారణలోనే తీవ్ర జాప్యం జరుగుతోంది. కుప్పలు, తెప్పలుగా దరఖాస్తులు పేరుకుపోతున్నాయి. తహసీల్దార్లు, రెవెన్యూ అధికారులకు భూరికార్డుల ప్రక్షాళన, రైతు బంధు తదితర పనులతో ఈ దరఖాస్తులపై దృష్టి పెట్టడం లేదు. ఇంకా డీఎస్‌వో దగ్గరకు రాని 7,400 దరఖాస్తుల్లో 5,800 వరకు విచారణకే నోచుకోలేదు. ఆర్‌ఐల స్థాయిలోనే పెండింగ్‌లో ఉన్నట్లు తెలిసింది.

1,600 వరకు దరఖాస్తుల విచారణ పూర్తయినా తహసీల్దార్‌ తుది నివేదిక హార్డ్‌కాపీ రాకపోవడంతో మంజూరుకు నోచుకోలేదు. మొత్తంగా 7,400 దరఖాస్తులకు మోక్షమే లేదు. కేవలం 4,500 దరఖాస్తులకే పూర్తి స్థాయి విచారణ జరిగి ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేశారు. వాటిని పౌరసరఫరాల శాఖ హార్డ్‌కాపీలతో సరిచూసుకుని అప్రూవల్‌ చేస్తున్నారు. 13,400 దరఖాస్తులో 8,900 దరఖాస్తులు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయి. గ్రామస్థాయిలో ఆర్‌ఐలు విచారణ వేగవంతం చేయాలని దరఖాస్తుదారులు కోరుతున్నారు.

అర్హులందరికీ ఆహార భద్రతకార్డులు
ఆహారభద్రత కార్డుల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తులకు ఆమోదం తెలిపి డీఎస్‌వో కార్యాలయానికి నివేదించాలని మండలాల అధికారులను కోరాం. మండల స్థాయి నుంచి పూర్తి స్థాయిలో విచారణ, హార్డ్‌కాపీల అందజేయడంలో జాప్యం కారణంగా కొంత ఆలస్యమవుతోంది. విచారణ వివిధ దశల్లో పూర్తి చేయడం కష్టతరమే. డీఎస్‌వో స్థాయిలోనే అనుమతి ఇవ్వొచ్చని తాజాగా ఉత్తర్వులు జారీ అయ్యాయి. మొత్తంగా 13 వేల వరకు దరఖాస్తులు వచ్చాయి. పౌరసరఫరాలశాఖకు అందిన 6 వేలల్లో కేవలం 1,500 దరఖాస్తులు మాత్రమే పెండింగ్‌లో ఉన్నాయి. అర్హత కలిగిన వారందరినీ లబ్ధిదారులుగా మంజూరు చేస్తాం. 
– గౌరీశంకర్, జిల్లా పౌరసరఫరాల అధికారి

మరిన్ని వార్తలు