ఆహారధాన్యాల ఉత్పత్తి  28 కోట్ల టన్నులు

7 Apr, 2019 04:24 IST|Sakshi

దేశవ్యాప్తంగా 2018–19 ఖరీఫ్, రబీ అంచనాలు విడుదల చేసిన కేంద్రం

రికార్డు స్థాయిలో 11.56 కోట్ల టన్నుల వరి ఉత్పత్తి

పడిపోయిన పత్తి దిగుబడి... గత ఏడాది కంటే 39 లక్షల బేళ్లు తక్కువ

పప్పు ధాన్యాల ఉత్పత్తి 2.40 కోట్ల టన్నులు... గతం కంటే కాస్తంత ఎక్కువ 

సాక్షి, హైదరాబాద్‌: దేశంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి గణనీయంగా పెరిగింది. 2018–19 ఖరీఫ్, రబీ సీజన్ల ఉత్పత్తి రెండో ముందస్తు అంచనాల నివేదికను కేంద్ర వ్యవసాయశాఖ తాజాగా విడుదల చేసింది. దాని ప్రకారం 2017–18 ఆర్థిక సంవత్సరంలో ఆహారధాన్యాల ఉత్పత్తి 27.74 కోట్ల టన్నులు కాగా, 2018–19 ఆర్థిక సంవత్సరంలో ఏకంగా 28.13 కోట్ల టన్నులకు పెరిగింది. అంటే అంతకుముందు ఏడాది కంటే 3.88 కోట్ల టన్నులు అధికంగా ఉత్పత్తి కావడం గమనార్హం. అందులో కీలకమైన వరి 2017–18 ఖరీఫ్, రబీ సీజన్లలో 11.10 కోట్ల టన్నులు కాగా, 2018–19లో ఏకంగా 11.56 కోట్ల టన్నులకు చేరింది. ఏకంగా 45.9 లక్షల టన్నులు పెరగడం గమనార్హం. ఇక కీలకమైన పత్తి దిగుబడి మాత్రం పడిపోయింది. 2017–18లో 3.39 కోట్ల బేళ్ల పత్తి ఉత్పత్తి కాగా, 2018–19లో 3 కోట్ల బేళ్లకు పడిపోయింది. ఏకంగా 39 లక్షల బేళ్ల ఉత్పత్తి తగ్గినట్లు నివేదిక తెలిపింది. ఇక పప్పు ధాన్యాల ఉత్పత్తి మాత్రం స్వల్పంగా పెరిగింది. 2017–18 ఆర్థిక సంవత్సరంలో 2.39 కోట్ల టన్నులు ఉత్పత్తి కాగా, 2018–19 ఆర్థిక సంవత్సరంలో మాత్రం 2.40 కోట్ల టన్నులు ఉత్పత్తి అవుతుందని అంచనా వేసింది. నూనె గింజల ఉత్పత్తి 2017–18 ఆర్థిక సంవత్సరంలో 2.98 కోట్ల టన్నులు కాగా, 2018–19లో 3.15 కోట్ల టన్నులకు పెరుగుతుందని అంచనా వేసింది.  

రాష్ట్రంలో దిగుబడి ఢమాల్‌.. 
తెలంగాణలో పత్తి, పప్పుధాన్యాల ఉత్పత్తి గణనీయంగా పడిపోయింది. 2018–19 ఆర్థిక సంవత్సరంలో పత్తి 48.71 లక్షల బేళ్లు ఉత్పత్తి అయిందని తెలిపింది. 2017–18లో 51.95 లక్షల బేళ్లు ఉత్పత్తి కాగా ఈసారి 3.24 లక్షల బేళ్లు తగ్గింది. గతం కంటే ఈసారి సాగు తగ్గడం, 10 జిల్లాల్లో గులాబీ పురుగు కారణంగా దిగుబడి పడిపోయింది. ఇదిలా ఉండగా పప్పుధాన్యాల ఉత్పత్తి కూడా గణనీయంగా తగ్గింది. 2017–18 సంవత్సరంలో 5.15 లక్షల టన్నులు ఉత్పత్తి కాగా, ఈ ఏడాది 3.85 లక్షల టన్నుల మేర ఉత్పత్తి అయింది. ఖరీఫ్‌లో పప్పు ధాన్యాల ఉత్పత్తి 2.58 లక్షల మెట్రిక్‌ టన్నులు రాగా రబీలో 3.85 లక్షల టన్నులు ఉత్పత్తి కానున్నట్లు తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి పంపిన నివేదికలో పేర్కొంది. ఇక 2018–19 ఖరీఫ్‌లో వరి ఉత్పత్తి 20 ఏళ్ల రికార్డును బ్రేక్‌ చేసింది. వరి ధాన్యం ఉత్పత్తి ఖరీఫ్‌లో ఏకంగా 61 లక్షల మెట్రిక్‌ టన్నులు వచ్చినట్లు అంచనా వేశారు. ఇరవై ఏళ్లలో ఇంతటి స్థాయి ఉత్పత్తి ఎన్నడూ రాలేదని అధికారులు కేంద్రానికి నివేదించారు. ఇక ఈ రబీలో 34.25 లక్షల మెట్రిక్‌ టన్నుల ఉత్పత్తి వస్తుందని అంచనా వేశారు.  

మరిన్ని వార్తలు