బాటసారీ.. లేదు దారి

29 May, 2019 06:29 IST|Sakshi

రోడ్డు ప్రమాదాల్లో పాదచారులే అధికం  

బాధితుల్లో వీరిదే రెండో స్థానం   

గతేడాది 36 శాతం బాధితులు వీరే..  

నగరంలో నడిచే దారి కరువైంది. ఫలితంగా పాదచారులు ప్రమాదాలకు గురవుతున్నారు. గ్రేటర్‌లో ఏటా జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో పాదచారులే అధికంగా ఉండడం ఆందోళన కలిగిస్తోంది. గతేడాది జరిగిన ప్రమాదాల్లో 36శాతం మంది బాధితులు వీరే కావడం గమనార్హం.

సాక్షి, సిటీబ్యూరో :ఎన్నో అంశాల్లో ప్రగతి పథంలో దూసుకెళుతున్న హైదరాబాద్‌ మహానగరం పాదచారులకు రోడ్డుపై నడిచే అవకాశం మాత్రం ఇవ్వడం లేదు. ఇక్కడ జరుగుతున్న ప్రమాదాలే ఈ అంశాన్ని చెబుతున్నాయి. ఎన్నో దశాబ్దాలుగా కనీస మౌలిక వసతులు కల్పించకపోవడం మరింత ఊతమిస్తున్నాయి. నగరంలో ఏటా రోడ్డు ప్రమాదాల్లో మరణించే వారిలో ద్విచక్రవాహన దారులు (50 శాతం)మొదటి స్థానంలో ఉంటే పాదచారులు రెండోస్థానంలో ఉన్నారు. గత ఏడాది జరిగిన ప్రమాదాల్లో బాధితులుగా మారిన వారిలో వీరు 36 శాతానికి పైగా ఉన్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. కారణాలు ఏమైన్నప్పటికీ ప్రాథమిక అంశాలైన ఫుట్‌పాత్‌ల ఆక్రమణ, అవసరమైన అన్ని ప్రాంతాల్లోనూ పెలికాన్‌ సిగ్నల్స్‌తో పాటు జీబ్రా క్రాసింగ్స్, ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జిలు లేకపోవడం..ఉన్న వాటిని సరిగా పట్టించుకోక పోవడం వల్లనేఈ పరిస్థితి తలెత్తింది. 

మృతుల్లో పాదచారులూ ఎక్కువే..
నగర ట్రాఫిక్‌ పోలీసులు ఏటా ప్రమాదాలపై విశ్లేషణ నిర్వహిస్తారు. ప్రమాదాలకు కారణమవుతున్న వాహనాలు, బాధితులుగా/మృతులుగా మారుతున్న వారు ఎవరనేది గణాంకాల ప్రకారం జాబితాలు రూపొందిస్తుంటారు. 2018కి సంబంధించి హైదరాబాద్‌ పోలీసులు రూపొందించిన రికార్డుల ప్రకారం సిటీలో జరుగుతున్న ప్రమాదాలు రెండు వేలకు పైనే ఉన్నాయి. వీటిలో అనేక మంది మృత్యువాత పడుతున్నారు. ఇలా రోడ్డు ప్రమాదాల్లో బాధితులుగా మారుతున్న వారిలో ద్విచక్ర వాహనచోదకులు తొలిస్థానంలో ఉండగా.. రెండో స్థానం పాదచారులదే. కొన్నేళ్ల గణాంకాలను లెక్కతీస్తే రోడ్డు ప్రమాద బాధితుల్లో పాదచారులే ఎక్కువగా ఉన్నారు. సిటీలో గత ఏడాది మొత్తం 2,540 ప్రమాదాలు జరగ్గా.. 2,550 మంది బాధితులుగా మారారు. వీటిలో ప్రమాదాల బారిన పడిన పాదచారుల సంఖ్య 924 మంది ఉన్నారు. మొత్తమ్మీద రోడ్డు ప్రమాద బాధితుల్లో 36 శాతం, మృతుల్లో 43 శాతం పాదచారులే ఉన్నట్టు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.  

వీటికి మోక్షమెప్పుడో?
రాజధానిలో ఉన్న రహదారులపై పాదచారులు భద్రంగా తిరిగేందుకు అవసరమైన మౌలిక సదుపాయాలు లేవు. పురాతన నగరమైన పాతబస్తీతో పాటు ఇటీవల రూపుదిద్దుకుని, అభివృద్ధి చెందుతున్న హైటెక్‌ సిటీ పరిసరాల్లోనూ ఇవి మచ్చుకైనా కనిపించవు. ట్రాఫిక్‌ సిగ్నలింగ్‌ వ్యవస్థలోనూ పాదచారులకు అవసరమైన స్థాయిలో ప్రాధ్యానం లేదు. ప్రణాళిక లోపం వల్ల నగరంలో ఉన్న ఫుట్‌పాత్‌ల్లో సగం ఆక్రమణకు గురికాగా.. మిగిలిన చోట్ల అనేక అడ్డంకులు వస్తున్నాయి. జంక్షన్స్‌ వద్ద ‘పెడస్ట్రియన్స్‌ క్రాసింగ్‌’ కోసం ప్రత్యేక చర్యలు, అందుకు అనుగుణంగా ‘ఆల్‌ రెడ్స్‌’ అనే సాంకేతిక అంశం ఏర్పాటు ఆమడదూరంలో ఉన్నాయి. వీటికి పరిష్కారంగా ట్రాఫిక్‌ విభాగం అధికారులు పంపిన ప్రతిపాదనలకు కూడా ‘గ్రేటర్‌’లో మోక్షం లభించడం లేదు. నగరంలో కీలక ప్రాంతాల్లో కనీసం రెండడుగుల వెడల్పుతో ఫుట్‌పాత్‌ ఏర్పాటు చేయాలని, దీనికి బారికేడింగ్, అవసరమైన ప్రాంతాల్లో క్రాస్‌ చేసేందుకు ఓపెనింగ్స్‌ అవసరమని చేసిన ప్రతిపాదనలు బల్దియా ఫైళ్లల్లో కొన్నేళ్లుగా మగ్గిపోతున్నాయి.  

మూలనపడ్డ ‘పెలికాన్స్‌’ ప్రతిపాదన
పాదచారుల భద్రత కోసం సిటీలో నిత్యం బిజీగా ఉండే 60 ప్రాంతాల్లో పెలికాన్‌ సిగ్నల్స్‌ ఏర్పాటు చేయాలని కొన్నేళ్ల క్రితమే ట్రాఫిక్‌ అధికారులు నిర్ణయించారు. ట్రాఫిక్‌కు సంబంధించిన మౌలిక వసతుల కల్పన జీహెచ్‌ఎంసీ ఆధీనంలో ఉంటుంది. ఈ నేపథ్యంలో వీటి ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేసి 2010 మార్చిలో జీహెచ్‌ఎంసీకి పంపారు. ఒక్కో సిగ్నల్‌ ఏర్పాటుకు రూ.40 వేల వరకు ఖర్చవుతుందని అంచనా వేసిన ‘గ్రేటర్‌’ అధికారులు.. కేవలం 30 సిగ్నల్స్‌ ఏర్పాటుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. వీటిని దశల వారీగా ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. ప్రాథమికంగా ఎగ్జిబిషన్‌ గ్రౌండ్స్‌ వద్ద నాలుగింటిని అందుబాటులోకి తెచ్చారు. ఏడాది తరక్కుండానే అవి పాడైపోయినా పట్టించుకునేవారు కరవయ్యారు. మిగిలిన చోట ఏర్పాటు ప్రతిపాదనను దాదాపు మర్చిపోయారు. బంజారాహిల్స్‌ రోడ్‌ నెం.1లోని కేర్‌ ఆస్పత్రి సమీపంలో మరో పెలికాన్‌ సిగ్నల్‌ ఏర్పాటు చేయాలని భావించి ప్రాథమిక కసరత్తు చేసినా అది అమలు కాలేదు.

ఈ లోపాలు సరిచేయాల్సిందే..
ఫుట్‌పాత్‌లపై చిరు వ్యాపారాలు, కాలిబాటలను మింగేసిన బడా మాల్స్‌ ఒక ఎత్తయితే ప్రభుత్వ విభాగాల అనాలోచిత చర్యలు మరో ఎత్తు. వీటివల్ల మరికొన్ని ఇబ్బందులు తలెత్తి కాలిబాటలు అక్కరకు రావడం లేదు. ఫుట్‌పాత్‌ల మధ్యలో ఉన్న చెట్లకు తోడు అధికారులు ఉద్దేశ పూర్వకంగా, అనాలోచి ధోరణిలో ఏర్పాటు చేసిన/చేస్తున్న విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్లు, స్తంభాలు, మూత్రశాలలు ఆ కొద్ది స్థలాన్నీ ఆక్రమించేస్తూ పాదచారులకు నడిచే దారి లేకుండా చేస్తున్నాయి.  
రోడ్లకు అనుసంధానంగా ఉన్న క్యారేజ్‌వే ఆధారంగా కాలిబాటలు కనిష్టంగా 4–5 అడుగుల వెడల్పు ఉండాలి. ప్రస్తుతం ఉన్న వాటిపై అడ్డదిడ్డంగా ఉన్న చెట్లు, ట్రాన్స్‌ఫార్మర్లు వంటివి తొలగించాలి. ఈ తొలగింపు ప్రక్రియ సాధ్యం కాని ప్రాంతాల్లో ఉన్న ఫుట్‌పాత్‌ వెడల్పు కనీసం 2 నుంచి మూడు అడుగులు అదనంగా విస్తరించాలి.  
ఈ ఫుట్‌పాత్‌లు కేవలం పాదచారులు నడవడానికి మాత్రమే అన్నది అందరికీ అవగాహన కల్పించడంతో పాటు అది కచ్చితంగా అమలయ్యేలా చేయాలి. ఆక్రమణలు నిరోధించడానికి జీహెచ్‌ఎంసీ, ట్రాఫిక్‌ పోలీసులతో సంయుక్త ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బృందాలను ఏర్పాటు చేయాలి.  
నిత్యం రోడ్డుపై నడుస్తున్న పాదచారుల కంటే వాటిని దాటేందుకు ప్రయత్నిస్తున్న వారే ఎక్కువగా ప్రమాదాలకు గురై ప్రాణాలు కోల్పోతున్నారని ట్రాఫిక్‌ పోలీసుల అధ్యయనంలో తేలింది. పెడస్ట్రియన్లు సైతం ఎక్కడపడితే అక్కడ రోడ్డు దాటకుండా అడ్డగించేందుకు కాలిబాటలకు కచ్చితంగా బారికేడ్లు ఉండాలి.  పటిష్టమైన స్టీలుతో వీటిని ఏర్పాటు చేసి కేవలం రోడ్డు దాటేందుకు అవకాశం ఇచ్చిన చోట మాత్రమే ఓపెనింగ్‌ ఉంచాలి.
రోడ్డు మధ్యలో ఉన్న డివైడర్లపై కూడా కనిష్టంగా మూడడుగుల ఎత్తుండే బారికేడ్లు ఏర్పాటు చేయాలి. వీటివల్ల అడ్డదిడ్డంగా పాదచారులు ఎక్కడపడితే అక్కడ రోడ్డు దాటుతూ ప్రమాదాల బారిన పడే అవకాశం ఉండదు. రోడ్డు దాటే అవకాశం ఇచ్చిన చోట మాత్రమే డివైడర్లపై బారికేడ్లు లేకుండా చూడాలి. డివైడర్లపై ఉండే ఈ దారి కనిష్టంగా రెండున్నర అడుగుల కంటే ఎక్కువే ఉండాలి. ఆయా ప్రాంతాల్లో పాదచారులకు ఉపయుక్తంగా ఉండేలా పెడస్ట్రియన్‌ సిగ్నల్స్‌ను ఏర్పాటు చేయాలి.
రహదారులపై పాదచారులు రోడ్డు దాటేందుకు అవకా«శం ఇచ్చిన చోట స్పష్టమైన సూచికలు, అందరికీ కనిపించేలా జీబ్రా క్రాసింగ్స్‌తో పాటు ఇరువైపులా పాదచారుల (పెలికాన్‌) సిగ్నల్స్‌ అందుబాటులోకి తీసుకువచ్చినా నగరంలోని అన్ని ప్రాంతాల్లోనూ దాటడం అంత తేలిక కాదు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ట్రాఫిక్‌ పోలీసులు ఆయా కీలక ప్రాంతాల్లో పాదచారుల భద్రతకు బాధ్యత తీసుకోవాలి.  
అత్యాధునిక ట్రాఫిక్‌ సిగ్నల్‌ వ్యవస్థ ఐటీఎంఎస్‌ ప్రాజెక్టులో భాగంగా పాదచారుల కోసం సిగ్నలింగ్‌ వ్యవస్థలో కొత్త విధానం ఏర్పాటు చేయాలి. అన్ని దారుల్లోనూ రెడ్, గ్రీన్‌ సిగ్నల్స్‌ పడటం పూర్తయ్యాక 10 నుంచి 15 సెకండ్ల పాటు అన్ని వైపులా రెడ్‌ సిగ్నల్‌ పడేలా.. ఆ సమయంలో ప్రత్యేకమైన సైరన్‌తో పాదచారుల సురక్షితంగా జంక్షన్‌ దాటేలా రూపొందించాలి.   
రాజధానిలోని రోడ్లు అనేక ప్రాంతాల్లో చాలా వెడల్పుతో ఉంటాయి. కొన్నిచోట్ల 25 నుంచి 50 అడుగుల కంటే ఎక్కువ వెడల్పు ఉన్న రోడ్లూ ఉన్నాయి. ఇలాంటి చోట్ల క్రాస్‌ చేయాలని నడక ప్రారంభించిన పాదచారి ఒకే తడవలో రోడ్డు మొత్తం దాటడం సాధ్యం కాదు. ఇలాంటి సందర్భాల్లో డివైడర్లు లేదా రోడ్డు మధ్యలో ఆగిపోతున్న పాదచారులు అయోమయానికి గురవుతున్నారు. దీంతో ఒక్కోసారి ప్రమాదాలకు గురవుతున్నారు. అలా కాకుండా రోడ్డు మొత్తం దాటడానికి వీల్లేనపుడు మధ్యలో ఆగే సందర్భాల్లో డివైడర్‌పై ‘పెడస్ట్రియన్‌ రెఫ్యూజీలు’గా పిలిచే ప్రాంతాలను ఏర్పాటు చేయాలి.

ఎన్నో చర్యలు తీసుకుంటున్నాం
నగరంలో పాదచారుల భద్రతకు జీహెచ్‌ఎంసీ సహాయంతో అవసరమైన చర్యలు తీసుకుంటున్నాం. మొత్తం 27 ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జ్‌లు మంజూరు చేయించగా వీటిలో ఆరు అందుబాటులోకి వచ్చాయి. మరో నాలుగు నిర్మాణంలో ఉన్నాయి. మెట్రో స్టేషన్లను ఆధారంగా చేసుకుని రోడ్డు దాటేలా ఆ సంస్థను ఒప్పించాం. సిటీలో గుర్తించిన ప్రాంతాల్లో సెంట్రల్‌ మీడియం ఎత్తు పెంచడంతో పాటు రెయిలింగ్‌ ఏర్పాటు చేయిస్తున్నాం. పాదచారులు ఎక్కువగా రోడ్డు దాటే ప్రాంతాలైన మెట్టుగూడ, మెహదీపట్నం, రసూల్‌పురాల్లో ఉన్న సిగ్నల్స్‌ను ఆధునీకరించాం.  – ఎల్‌.ఎస్‌. చౌహాన్, ట్రాఫిక్‌ డీసీపీ  

వాహన చోదకుల నిర్లక్ష్యమూ కారణమే..
సిటీ రహదారులపై పాదచారులు రోడ్డు దాటాలంటే ఇబ్బందులు తప్పడం లేదు. దీనికి మౌలికవసతుల కొరత ఓ కారణమైతే వాహన చోదకుల వ్యవహారశైలి మరో కారణం. సాధారణంగా జంక్షన్‌లో ఆగి ఎదురుచూస్తున్న పాదచారి రెడ్‌ సిగ్నల్‌ పడి వాహనాలు ఆగినప్పుడు రోడ్డు దాటే ప్రయత్నం చేస్తాడు. అయితే, కొందరు ద్విచక్ర, తేలికపాటి వాహన చోదకులు ఆ సమయంలోనూ వాహనాలను ముందుకు ఉరిస్తూ పాదచారులను ఇబ్బంది పెట్టడంతో పాటు ప్రమాదాలకు కారణమవుతున్నారు. మరోపక్క అందుబాటులో ఉన్న మౌలిక వసతులను పాదచారులు కూడా సక్రమంగా వినియోగించుకోవాలి.– కరణ్‌జీత్‌ సింగ్, జగదీష్‌ మార్కెట్‌  

ఎఫ్‌ఓబీలు, భూగర్భ మార్గాలు కనుమరుగు
నగరంలోని రద్దీ ప్రాంతాలు, వాణిజ్య సముదాయాలు ఎక్కువగా ఉన్న చోట్ల గతంలో భూగర్భ క్రాసింగ్‌ మార్గాలు నిర్మించారు. ఆపై దిల్‌సుక్‌నగర్, సికింద్రాబాద్, బేగంపేట, మెహదీపట్నం సహా అనేక ప్రాంతాల్లో ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జిలు అందుబాటులోకి తెచ్చారు. సరైన నిర్వహణ, భద్రతా ప్రమాణాలు లేకపోవడంతో ఆర్టీసీ క్రాస్‌రోడ్స్, కోఠి ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన భూగర్భ క్రాసింగ్‌ మార్గాలు ఆదరణకు నోచుకోలేదు. దీంతో ఒకటి పూర్తిగా కనుమరుగు కాగా మరొకటి స్వరూపం మార్చుకుని పాదచారులకు పనికిరాకుండా పోయింది. ఇక ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జిలు కట్టిన జీహెచ్‌ఎంసీ అధికారులు వాటికి ఎలివేటర్‌ వంటి సౌకర్యాలు కల్పించకపోవడంతో పాదచారులకు ఉపయోగపడలేదు. ఇవి పూర్తిగా ఓ స్వరూపాన్ని సంతరించుకోకముందే ‘మెట్రో’ గండం వచ్చిపడింది. మెట్రోరైల్‌ నిర్మాణాల కోసం సిటీలోని ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జ్‌లను తొలగించారు. తర్వాత కొన్ని నిర్మిస్తున్నా అవి అవసరాలకు అనుగుణంగా మాత్రం లేవు.  

2018లో నగర పోలీస్‌ విభాగం గణాంకాలు ఇవీ..  
మొత్తం ప్రమాదాలు    :    2,540
క్షతగాత్రులు    :    2,550
మృతులు    :    303
బాధిత ద్విచక్రవాహన చోదకులు    :    1,231
బాధిత పాదచారులు    :    924

రహదారుల పరిస్థితి ఇలా...
బల్దియా ఆధీనంలోని రోడ్లు    :    6,200 కి.మీ.
ఆర్‌ అండ్‌ బీ ఆధీనంలోనివి    :    189.49 కి.మీ.

జాతీయ రహదారుల సంస్థ
ఆధీనంలోనివి    :    98.7 కి.మీ.
మొత్తం రోడ్ల పొడవు    :    6.488 కి.మీ.
ఫుట్‌పాత్‌ల పొడవు    :    2 వేల కి.మీ.  లోపుటవీటిలో సరాసరిన కనిష్టంగా ఐదు కి.మీ. అడ్డంకులు లేకుండాఉన్న ఫుట్‌పాత్‌లు లేవు. 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా