గుట్టలు..గుట్టలుగా!

8 Sep, 2014 03:11 IST|Sakshi
గుట్టలు..గుట్టలుగా!
  •      సాగర్ ఫుట్‌పాత్‌పై విగ్రహాల శకలాలు!
  •      జెహెచ్‌ఎంసీ,హెచ్‌ఎండీఏల మధ్య సమన్వయ లోపం
  •      సాగని పనులు
  •      అవస్థలు పడుతున్న సందర్శకులు
  • సాక్షి, సిటీబ్యూరో: హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనమవుతున్న వినాయక విగ్రహాల శకలాలు, ఇతర వ్యర్థాలను వెలికి తీసే విషయంలో జీహెచ్‌ఎంసీ- హెచ్‌ఎండీఏ అధికారుల మధ్య సమన్వయలోపం సందర్శకులకు శాపంగా మారింది.  గణనాథుని జలప్రవేశాన్ని కనులారా వీక్షించి తరిద్దామని వచ్చిన భక్తులు, సందర్శకులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు.

    సాగర్ గట్టున నిల్చొని నిమజ్జనోత్సవాన్ని తిలకించాలనుకొన్న వారికి ఆ కోరిక తీరకుండా పోతోంది.  ఫుట్ పాత్‌పై గుట్టలు గుట్టలుగా  వ్యర్థాలు పడిఉండడమే ఇందుకు కారంణం. ఆదివారం ఉదయం నుంచీ విరామం లేకుండా వినాయక విగ్రహాలు నిమజ్జనానికి వస్తుండడంతో సాగర్ పరిసరాలు రద్దీగా మారాయి. ఈ నేపథ్యంలో  హుస్సేన్‌సాగర్ నుంచి  గట్టుకు చేర్చిన విగ్రహాల వ్యర్థాలను అక్కడినుంచి కవాడీగూడలోని జీహెచ్‌ఎంసీ డంపింగ్ యార్డుకు తరలించలేని పరిస్థితి హెచ్‌ఎండీఏ  సిబ్బందికి ఎదురైంది.

    దీనికితోడు ఎన్టీఆర్ మార్గ్‌లోని 9 ఫ్లాట్‌ఫారాల వద్ద ఏర్పాటు చేసిన భారీ క్రేన్లను పక్కకు జరిపే అవకాశం లేదు. దీంతో ఆయా ఫ్లాట్‌ఫారాల వద్ద నిమజ్జనమైన విగ్రహాలను బయటకు తరలించడం అసాధ్యంగా మారింది. అయినా హెచ్‌ఎండీఏ సిబ్బంది డీయూసీలను వినియోగంచి సాధ్యమైనన్ని విగ్రహాలను పక్కకు జరపగలిగారు. ఆ వ్యర్థాలను జేసీబీ ద్వారా టిప్పర్‌లోకి లోడ్ చేయడానికి  గట్టు వెంట బిగించిన ఇనుప గ్రిల్స్ అడ్డుగా ఉండడంతో వాటినిఫుట్‌పాత్‌పైనే కుప్పులుగా పోశారు.

    ఈ విషయంలో సహకరించాల్సిన జీహెచ్‌ఎంసీ సిబ్బంది హెచ్‌ఎండీఏ సిబ్బందిపై విరుచుకుపడ్డారు. ఇరువర్గాల మధ్య మాటల యుద్ధం జరిగింది. సాగర్ నిమజ్జన పూడికతీత పనులను ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్న ఓ కిందిస్థాయి అధికారి సమయ స్ఫూర్తితో వ్యవహరించి  7, 8, 9 ఫ్లాట్‌ఫారాల వద్ద ఉన్న ఐరన్ గ్రీల్స్‌ను తొలగించారు.  అక్కడ ఉన్న వ్యర్థాలను బయటకు తరలించేందుకు మార్గం సుగమం అయింది.  సుమారు 100 మంది కూలీలు, 3 డీయూసీలు, 3 జేసీబీలు, 8 టిప్పర్లను వినియోగించి  ఆదివారం 700 టన్నుల వ్యర్థాలను బయటకు తరలించినట్లు అధికారులు తెలిపారు.
     
    ముంచేస్తున్నారు..


    ట్యాంక్‌బండ్‌వైపు నిమజ్జనమై విగ్రహాలను వెలికితీయకుండా అధికారులు నీటిలోనే ముంచే స్తున్నారు.లోతు ఎక్కువగా ఉండడంతో చాలా విగ్రహాల ఆచూకీ తెలియట్లేదు. ఈ విషయంలోనూ జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ అధికారులు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం గమనార్హం.
     
    101 నీటి క్యాంపుల ఏర్పాటు..
    వినాయక నిమజ్జన శోభాయాత్రలో పాల్గొనే భక్తుల దాహార్తిని తీర్చేందుకు జలమండలి 101 నీటి క్యాంపులను ఏర్పాటు చేసింది. శోభాయాత్ర సాగే మార్గాల్లో ఈ క్యాంపులు అందుబాటులో ఉంటాయి.  30 లక్షల నీటి ప్యాకెట్లు,ట్యాంకర్ల ద్వారా మంచినీరు అందుబాటులో ఉంటుందని బోర్డు ఆపరేషన్స్ విభాగం డెరైక్టర్ జి.రామేశ్వర్‌రావు తెలిపారు. శోభాయాత్ర జరిగే మార్గంలో డ్రైనేజీ లైన్లలో శుక్ర, శని,ఆది వారాల్లో పూడికతీత పనులు పూర్తిచేశామని తెలిపారు.                       

>
మరిన్ని వార్తలు