20 మండలాలకు కృష్ణమ్మ పరవళ్లు!

12 Jun, 2015 00:47 IST|Sakshi

పాలమూరు ప్రాజెక్టులో 400 గ్రామాలకు చోటు  
ఆరు నియోజకవర్గాలకు సాగు, తాగునీరు
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి:
‘పాలమూరు-రంగారెడి’ బహుళార్థ సాధక ప్రాజెక్టు రాకతో 20 మండలాలకు మహర్దశ పట్టనుంది. సాగు, తాగునీటి అవసరాలను తీర్చడమే కాకుండా... పారిశ్రామిక అవసరాలకు కూడా ఈ నీరు అందనుంది. శ్రీశైలం ఎగువ నుంచి 70 టీఎంసీల కృష్ణా జలాలను నల్గొండ, మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాలకు తరలించే ఈ పథకంతో జిల్లాలో 2.70 లక్షల ఎకరాల ఆయకట్టు సస్యశ్యామలం కానుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఈ ప్రాజెక్టు పనులకు ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం శంకుస్థాపన చేసిన సంగతి తెలిసిందే.

తొలుత జూరాల నుంచి నీటిని తీసుకురావాలని యోచించినప్పటికీ, ముంపు గ్రామాల ప్రజలను దృష్టిలో ఉంచుకొని ప్రాజెక్టు డిజైన్‌లో మార్పులు చేర్పులు చేశారు. ఆయకట్టు విస్తీర్ణంలో మార్పులు లేనప్పటికీ, గండేడ్ రిజర్వాయర్ నిర్మాణ ప్రతిపాదనను విరమించుకున్నారు. తాజా డిజైన్‌తో కుల్కచర్ల మండలం అగ్రహారం, తంగళ్లపల్లి గ్రామాలు ముం పుబారిన పడుతున్నాయి. లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్‌తో పాటు రావులపల్లి ముం పునకు గురి కానున్నాయి. జిల్లా సరిహద్దులోని కేపీ లక్ష్మీదేవిపల్లి, లోకిరేవులలో నిర్మించే జలాశయాల నుంచి జిల్లాలోని తాండూరు, వికారాబాద్, పరిగి, చేవెళ్ల, మహేశ్వరం, ఇబ్రహీంపట్నం సెగ్మెంట్లలోని 400 గ్రామాలకు పాలమూరు జలాలు రానున్నాయి.

ఎకరాకు రూ.3.5 లక్షల వ్యయం!
పాలమూరు (కురుమూర్తి) ప్రాజెక్టు కార్యరూపం దాల్చాలంటే ప్రస్తుత అంచనాల ప్రకారం ఎకరాకు రూ.3.5 లక్షలు ఖర్చవుతుందని నీటిపారుదల శాఖ నిపుణులు లెక్క వేశారు. ఈ లెక్కన జిల్లాలో ఈ ప్రా జెక్టు వ్యయం దాదాపు రూ.9,500 కోట్లు దాటనుంది. భారీ అంచనా వ్యయంతో కూడిన ఈ పథకానికి బడ్జెట్‌లో నయాపైసా కేటాయించకుండా ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయడం హాస్యాస్పదంగా ఉందని పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి అన్నారు. దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలోనే ఈ ప్రాజెక్టుకు అంకురార్పణ జరిగిందని ఆయన పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు