వెళ్తోంది లక్షల్లో.. వస్తోంది వేలల్లో

6 Aug, 2018 01:14 IST|Sakshi

భారత్‌కు వస్తున్న విదేశీ విద్యార్థులు అంతంతే

కర్ణాటకలో అత్యధికంగా 13,903 స్టూడెంట్స్‌

సాక్షి, హైదరాబాద్‌: ఐఐటీలు.. ఐఐఎంలు.. ఇంకా ఎన్నో ప్రతిష్టాత్మక యూనివర్సిటీలు! అయినా విదేశీ విద్యార్థులను ఆకర్షించడంలో భారత్‌ వెనుకబడే ఉంది. విదేశాల్లో చదువుకునేందుకు మన దేశం నుంచి ఏటా లక్షల మంది వెళ్తుంటే.. విదేశాల నుంచి మాత్రం వేలల్లోనే వస్తున్నారు. ప్రపంచంలోని దాదాపు 90 దేశాల్లో 7.5 లక్షల మందికి పైగా భారతీయ విద్యార్థులు చదువుతుంటే మన దేశంలో మాత్రం విదేశీ విద్యార్థులు కేవలం 46,144 మందే చదువుకుంటున్నారు.

ఏటా కొత్తగా వస్తున్న విదేశీ విద్యార్థుల సంఖ్యలో పెరుగుదల వేయి మాత్రమే ఉంది. రాష్ట్రాల వారీగా చూస్తే విదేశీ విద్యార్థులు ఎక్కువగా కర్ణాటకలో చదువుతుండగా.. ఆ తర్వాతి స్థానంలో ఉత్తరప్రదేశ్‌ ఉంది. తెలంగాణ ఆరో స్థానంలో ఉండగా, ఆంధ్రప్రదేశ్‌ 8వ స్థానంలో ఉంది. ఆరు రాష్టాల్లో అయితే విదేశీ విద్యార్థులు కేవలం పది మంది లోపే ఉన్నట్టు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ లెక్కలు స్పష్టం చేస్తున్నాయి.

ఐదేళ్లతో పోలిస్తే కాస్త మెరుగు..
తక్కువ స్థాయిలోనే ఉన్నా గడచిన ఐదేళ్లుగా విదేశీ విద్యార్థుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. 2013–14 విద్యా సంవత్సరంలో భారత్‌లో 39,517 మంది విదేశీ విద్యార్థులు చదివితే 2017–18 నాటికి ఆ సంఖ్య 46,144కు పెరిగింది. రాష్ట్రాల వారీగా చూస్తే 2013–14లో కర్ణాటకలో 13,903 మంది చదవగా.. ప్రస్తుతం వారి సంఖ్య కాస్త తగ్గింది. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం 2013–14తో పోలిస్తే ప్రస్తుతం విద్యార్థుల సంఖ్య పెరిగింది. 2013–14లో తెలంగాణలో 2,103 మంది ఉండగా, ప్రస్తుతం ఆ సంఖ్య 2,877కు పెరిగింది. ఆంధ్రప్రదేశ్‌లో అప్పట్లో 862 మంది విదేశీ విద్యార్థులు ఉండగా.. ఇప్పుడు వారి సంఖ్య 2,092కు పెరిగింది.

నేపాల్‌ విద్యార్థులే అధికం
విదేశాల నుంచి భారత్‌కు వస్తున్నవారిలో ఎక్కువ మంది నేపాల్‌కు చెందిన వారే ఉన్నారు. చదువుల కోసం మన దేశం నుంచి విద్యార్థులు 166 దేశాలకు వెళ్తుండగా.. భారత్‌కు మాత్రం 10 దేశాల నుంచే ఎక్కువగా వస్తున్నారు. మొత్తం విదేశీ విద్యార్థుల్లో 24.9 శాతం మంది నేపాల్‌కు చెందినవారు కాగా, అఫ్గాన్‌ విద్యార్థులు 9.5 శాతం, సుడాన్‌ విద్యార్థులు 4.8 శాతం, భూటాన్‌ విద్యార్థులు 4.8 శాతం మంది, నైజీరియా విద్యార్థులు 4.3 శాతం, బంగ్లాదేశ్, ఇరాన్‌ విద్యార్థులు 4 శాతం మంది, యెమన్‌ విద్యార్థులు 3.2 శాతం మంది, అమెరికా విద్యార్థులు 3.1 శాతం, శ్రీలంక విద్యార్థులు 2.7 శాతం ఉన్నారు.

బీటెక్, బీబీఏ వైపే ఎక్కువ..
భారత్‌కు వస్తున్న విదేశీ విద్యార్థుల్లో ఎక్కువ మంది బీటెక్‌ వైపు చూస్తున్నారు. గడచిన ఐదేళ్లలో ఎక్కువ మంది బీటెక్‌ చదివిన వారే ఉన్నారు. 2013–14లో 4,135 మంది బీటెక్‌ చదవగా.. ప్రస్తుతం ఆ కోర్సును 7,610 మంది చదువుతున్నారు. బీటెక్‌ తర్వాత బీబీఏ కోర్సును ఎక్కువ మంది చదువుతున్నారు.

ఉత్తరప్రదేశ్‌లోనే అత్యధికంగా పీహెచ్‌డీలు
విదేశీ విద్యార్థుల్లో అత్యధికంగా పీహెచ్‌డీలను (412 మంది) ఉత్తరప్రదేశ్‌లో చేస్తున్నారు. కర్ణాటకలో ఎక్కువ మంది(897) ఎం.ఫిల్‌ చేస్తున్నారు. డిగ్రీ (10,051 మంది), పీజీ (1,533), ఇంటిగ్రేటెడ్‌ కోర్సులు (7181) చేస్తున్న వారు కూడా కర్ణాటకలోనే ఉన్నారు.  

మరిన్ని వార్తలు