మన జూకు విదేశీ వన్యప్రాణులు!

14 Oct, 2019 09:54 IST|Sakshi

బహదూర్‌పురా: నెహ్రూ జూలాజికల్‌ పార్కుకు కొత్త జీవులు రానున్నాయి. ఇక్కడి అధికారులు ఇతర దేశాల నుంచి వన్యప్రాణులను తీసుకొచ్చేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నారు. జూపార్కు ఆవిర్భావ దినోత్సవంలో భాగంగా జపాన్‌ జూ నుంచి రెండు జతల కంగారూలను, ఒక జత మిర్కట్స్‌ (ముంగీసలు)ను తీసుకురానున్నామని జూ అధికారులు పేర్కొన్నారు. సౌతాఫ్రికా నుంచి జీబ్రాలను తీసుకొస్తామని గతంలో పేర్కొన్నారు. జూపార్కులో లేని వన్యప్రాణులన్నింటినీ తీసుకొచ్చేందుకు విదేశాల్లోని జూ పార్కుల అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నారు.

అందుకనుగుణంగా తాజాగా జపాన్‌ నుంచి రెండు జతల కంగారూలు, జత ముంగీసలను జంతువు మార్పిడిలో భాగంగా తీసుకొచ్చేందుకు ప్రణాళికలను రూపొందించారు. జూ అధికారుల ప్రణాళికలు సఫలమైతే విదేశీ వన్యప్రాణులై కంగారూలు, ముంగీసలు, జీబ్రాలు సందర్శకులను అలరించే అవకాశముంది. జూ పార్కుకు ఇవి ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. సౌతాఫ్రికా నుంచి జిబ్రాలను తీసుకొస్తామని పేర్కొన్న జూ అధికారులు సంవత్సరాలు గడుస్తున్నా సఫలీకృతులు కాలేకపోయారు. ఈసారి అలా కాకుండా జపాన్, సౌతాఫిక్రాల నుంచి కొత్త వన్యప్రాణులను తీసుకొచ్చి జూకు మరింత శోభ తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. 

మరిన్ని వార్తలు