అడవిలో అన్నలు

29 Jun, 2014 00:35 IST|Sakshi
అడవిలో అన్నలు

దేశంలో పదహారు రాష్ట్రాలకు విస్తరించి, ఆయా రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న మావోయిస్టు పార్టీని నడుపుతున్నది మన జిల్లావాసులే. వీరిలో సారంగాపూర్ మండలం బీర్‌పూర్ గ్రామానికి చెందిన ముపాళ్ల లక్ష్మణ్‌రావు అలియాస్ గణపతి మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. ఈయనపై కేంద్రం రూ.25 లక్షల రివార్డును ప్రకటించగా, ఆయా రాష్ట్రాలు ప్రకటించిన దానితో కలిపి రూ.కోటి రివార్డు ఉంది. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీతో పాటు ఇతర ముఖ్య విభాగాల్లో మన జిల్లాకు చెందిన వారే పది మంది వరకు ఉన్నారు. మొత్తంగా కరీంనగర్ జిల్లా నుంచి 31 మంది మావోయిస్టులు ప్రాతినిధ్యం వహిస్తున్నట్టు పోలీస్ రికార్డులు వెల్లడిస్తున్నాయి.
 
- మనోళ్లు 31 మంది  
- కేంద్ర కమిటీ కార్యదర్శి సహా కీలక నేతలు జిల్లావాసులే

 పెద్దపల్లి/కరీంనగర్ క్రైం : మావోయిస్టు పార్టీ చీఫ్ సెక్రెటరీ గణపతి సొంత గడ్డ కరీంనగర్ జిల్లాలోనే ఆ పార్టీ తీవ్ర సంక్షోభంలో పడింది. నూతన ప్రజాస్వామిక విప్లవ సాధన కోసం సాయుధ పోరాటం నడుపుతున్న మావోయిస్టు పార్టీకి వివిధ రాష్ట్రాల్లో రాష్ట్ర కమిటీ కార్యదర్శులుగా పనిచేసిన వారు కరీంనగర్ జిల్లాకు చెందిన వారే . కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌ల కు కార్యదర్శిగా పనిచేసిన బుర్ర చిన్నన్న, గూడెం ప్రసాద్, వడ్కాపూర్ చంద్రమౌళి ఐదేళ్ల క్రితం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఆర్నెల్ల వ్యవధిలోనే ఈ ముగ్గురు నేతలు హతమయ్యారు.

కేంద్ర కమిటీలో కీలక బాధ్యతలు నిర్వహించిన మల్లోజుల కోటేశ్వరరావు ఎన్‌కౌంటర్ పార్టీని తీవ్రంగా కుంగతీసింది. అజ్ఞాతవాసం వెళ్లిన తొలితరం నాయకులు ఎత్తిన తుపాకీ దించకుండా మూడు దశాబ్దాలుగా పార్టీలోనే కొనసాగుతున్నారు. వారిలో మన జిల్లాకు చెందిన వారు ఇంకా 31 మంది మాత్రమే మిగిలిఉన్నారని పోలీస్ రికార్డులు తెలుపుతున్నాయి. పార్టీ తొలినాళ్ల నుంచి నేటి వరకు పది మంది వరకు కేంద్ర, రాష్ట్ర కమిటీల్లో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

1992లో ప్రభుత్వం మావోయిస్టు పార్టీని నిషేధించిన సమయంలో ఇదే జిల్లాకు చెందిన 300 మందిని పోలీసులు గుర్తిం చి.. అందులో 89 మందికి రివార్డులు సైతం ప్రకటించారు. నిషేధానికి గురై రివార్డుల్లో ప్రకటించబడ్డ వారు చాలామంది ఎన్‌కౌంటర్‌లో మరణించారు. మరో వందమంది వరకు ప్రభుత్వానికి లొంగిపోయారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తరువాత రాష్ట్రంలో తమకు వెసులుబాటు లభిస్తుందని ఆశపడ్డ మావోయిస్టులకు నిరాశే ఎదురైంది. కేసీఆర్ పలు సందర్భాల్లో ‘మావోయిస్టు పార్టీది తమ ఉద్యమ పార్టీది ఒకే సిద్ధాంతమని’ ప్రకటించండం తెలిసిందే.
 
రూ.3.08 కోట్ల రివార్డు
పలు రాష్ట్రాల్లో అయా ప్రభుత్వాలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న మావోయిస్టుల్లో అగ్ర నాయకులు అత్యధికంగా జిల్లాకు చెందినవారే. మావోయిస్టు పార్టీకి కీలకమైన కేంద్ర కమిటీ కార్యదర్శి గణపతితోపాటు మరో ఆరుగురు ఇదే జిల్లాకు చెందినవారున్నారు. ప్రస్తుతం జిల్లాకు చెందిన అంతా కలిసి 31 మంది మావోయిస్టులుండగా వీరు వివిధ ప్రాంతాల్లో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. తాజాగా పోలీసు రికార్డుల ప్రకారం వారి తలలపై సుమారు రూ.3.08 కోట్ల రివార్డ్ ఉంది. కొన్నేళ్ల క్రితం తెలంగాణ జిల్లాలో తీవ్ర ప్రభావం చూపిన మావోయిస్టు పార్టీ.. తాజాగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్ర కమిటీని ఏర్పాటు చేసినట్లు ప్రకటించింది.
 
‘వేట’కే సై..!
మావోయిస్టుల పట్ల కఠినంగా వ్యవహరిస్తామని, వారి వేటకు కావాల్సిన పోలీస్ బలగాలకు అధునాతనమైన ఆయుధాలు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోందని హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ శుక్రవారం ఢిల్లీలో జరిగిన వివిధ రాష్ట్రాల అధికారుల సమావేశంలో ప్రకటించారు. మావోయిస్టులతో చర్చలు ఉండవు, అణచివేత కొనసాగుతుందని కేంద్ర హోంశాఖ ప్రకటించడంతో దేశవ్యాప్తంగా మావోయిస్టుపార్టీ పట్ల కఠినవైఖరి కొనసాగుతుందనే విషయం స్పష్టమైంది.

మావోయిస్టులతో పాటు అభ్యుదయవాదులు, సంఘాలు కోరుకున్న తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తరువాత కూడా కేంద్ర ప్రభుత్వ విధానమే ఇక్కడ అమలు కాబోతోంది. స్వయంగా తెలంగాణ రాష్ట్ర హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి సైతం నక్సల్స్ వ్యవహారం కేంద్రమే చూసుకుంటుందని వ్యూహాత్మకంగా ప్రకటించిన నేపథ్యంలో నక్సలైట్లపై నిషేధం కొనసాగుతుందని తేటతెల్లమైంది.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరితో మావోయిస్టులకు లీగల్ అవకాశాల వెసులుబాటుకు తెరపడింది. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్‌టీ.రామారావు, మర్రి చెన్నారెడ్డి సీఎంలుగా పదవీ బాధ్యతలు చేపట్టిన తరువాత అప్పటి పీపుల్స్‌వార్ పార్టీకి లీగల్ అవకాశాలు కల్పించారు. వైఎస్.రాజశేఖరరెడ్డి కాలంలో ఏకంగా మావోయిస్టులను శాంతిచర్చలకు ఆహ్వానించారు.

మావోయిస్టు పార్టీ.. పోలీసుల మధ్య ఘర్షణలతో శాంతిచర్చలకు విఘాతం కలిగింది. ఐదారేళ్లుగా రాష్ట్రంలోనున్న ప్రధాన నాయకులు ఎన్‌కౌంటర్లలో మరణించడంతో ఆ పార్టీకి కోలుకోని దెబ్బలు తగిలాయి. మావోయిస్టు పార్టీకి అగ్రనేతల పుట్టినిల్లు కరీంనగర్ జిల్లాలోనే తన ఉనికిని కోల్పోయింది. కేవలం తూర్పు డివిజన్‌లోని అటవీ ప్రాంతంలోనే మావోయిస్టు పార్టీ ఒక దళం... అది కూడా దండకార ణ్యం ప్రాంతంతో కలసి కార్యకలాపాలు నిర్వహిస్తోంది.
 
వీరి ‘తల’పై రూ.25 లక్షలు

- సారంగపూర్ మండలం బీర్‌పూర్‌కు చెందిన ముప్పాళ్ల లక్ష్మణ్‌రావు అలియాస్ గణపతి అలియాస్ రమణ మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. ఆయనపై రూ.25 లక్షల రివార్డు ఉంది. వివిధ రాష్ట్రాల రివార్డ్ కలిపితే రూ.కోటి వరకు చేరింది.
- సిరిసిల్ల మండలం గోపాల్‌రావుపల్లికి చెందిన కడారి సత్యనారాయణరెడ్డి అలియాస్ సాదు అలియాస్ గోపన్న, వినోద్, కోసా బుచ్చన్న. మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు, సెంట్రల్ రిజర్వ్ బెటాలియన్ ఇన్‌చార్జి.
- ముత్తారం మండలం ఎగ్లాస్‌పూర్ పరిధిలోని శాస్త్రులపల్లికి చెందిన మల్లా రాజిరెడ్డి అలియాస్ సత్తెన్న, సాయన్న, మీసాల సాయన్న, సాగర్, అశోక్, దేశ్‌పాండే. కేంద్ర కమిటీ సభ్యుడు.
- పెద్దపల్లి పట్టణం శివాలయం వీధికి చెందిన మల్లోజుల వేణుగోపాల్‌రావు అలియాస్ వివేక్, భూపతి, సోను. మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు, మావోయిస్టు అధికార ప్రతినిధి.
- జూలపల్లి మండలం వడ్కాపూర్ గ్రామానికి చెందిన పుల్లూరి ప్రసాద్‌రావు అలియాస్ శంకరన్న, చంద్రన్న. మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు, నార్త్ తెలంగాణ స్పెషల్ కమిటీ సభ్యుడు.
- కోరుట్లలోని అంబేద్కర్‌నగర్‌కు చెందిన తిప్పరి తిరుపతి అలియాస్ సంజీవ్, సుదర్శన్.. మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు.
 
రూ.20 లక్షల రివార్డు
- సారంగాపూర్ మండలం బీర్‌పూర్‌కు చెందిన బల్మూరి నారాయణరావు అలియాస్ నారాయణ, వెంకన్న మావోయిస్టు రాష్ట్ర కమిటీ సభ్యుడిగా ఉన్నారు.
- పెద్దపల్లి మండలం సబ్బితంకు చెందిన గంగిడి సత్యనారాయణరెడ్డి అలియాస్ విజయ్ మావోయిస్టు పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడిగా వ్యవహరిస్తున్నారు.
- కోహెడ మండలం తీగలగుట్టపల్లికి చెందిన కె.రాంచంద్రారెడ్డి అలియాస్ విజయ్, గుడిసె ఉసెండి, రాజుదాదా. ఇంతకుముందు ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేశారు. మావోయిస్టు పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడు, దక్షిణ కోస్తా స్పెషల్ జోన్ కమిటి సభ్యుడు.

 రూ.8 లక్షల రివార్డు
- పెద్దపల్లి మండలం పాలితం గ్రామానికి చెందిన అలేటి రామలచ్చులు అలియాస్ రాయలచ్చు, దక్షిణ బస్తర్ స్పెషల్ జోన్ కమిటీ సభ్యుడు.
- కమాన్‌పూర్ మండలంలోని రాణాపూర్ గ్రామానికి చెందిన వేగోలపు మల్లయ్య అలియాస్ మల్లేశం, కమలాకర్, మాన్‌పూర్ జిల్లా కమిటీ సభ్యుడు.

 రూ. 5 లక్షల రివార్డు
- కాల్వశ్రీరాంపూర్ మండలం కిష్టంపేట గ్రామానికి చెందిన కంకణాల రాజిరెడ్డి అలియాస్ వెంకటేశ్, మావోయిస్టు నార్త్ తెలంగాణ స్పెషల్ కమిటీ సభ్యుడు.
- కాటారం మండలం అంకుషాపూర్ గ్రామానికి చెందిన అన్రే సంతోష్ అలియాస్ శ్రీధర్, మావోయిస్టు ఏ-ప్లాటూన్ కేంద్ర రిజినల్ కమిటీ కమాండర్, దక్షిణ బస్తర్ జోన్ కమిటీ సభ్యుడు.
- రామగుండంకు చెందిన అప్పాసి నారాయణ అలియాస్ శంకర్ జిల్లా కమిటీ సభ్యుడు, దక్షిణ బస్తర్ స్పెషల్ జోన్ కమిటీ ప్రొటక్షన్ గ్రూప్ కమాండర్.
- రాయికల్ మండలం సింగరావుపేటకు చెందిన బంతుల కాశీరాం అలియాస్ సత్యం, మావోయిస్టు టెక్నికల్ కమిటీ సభ్యుడు.
- హుస్నాబాద్‌లోని సుభాష్‌నగర్‌కు చెందిన బుర్ర భాగ్య అలియాస్ అరుణ, మావోయిస్టు గడ్చిరోలి యాక్షన్ కమిటీ సభ్యురాలు.
- రామగుండం మండలం జయ్యారం గ్రామానికి చెందిన చీమల నర్సయ్య అలియాస్ పాశం నర్సయ్య, జోగన్న. మావోయిస్టు ఉత్తర గడ్చిరోలి జిల్లా కమిటీ సభ్యుడు.
- జగిత్యాల మండలం మోరపల్లికి చెందిన గుండారం అనందం అలియాస్ భూమయ్య మావోయిస్టు జిల్లా కమిటీ సభ్యుడు.
- మల్హర్ మండలం పేట రుద్రారం గ్రామానికి చెందిన లోక సారమ్మ అలియాస్ సుజాత. మావోయిస్టు ఉత్తర జోన్ స్పెషల్ కమిటీ సభ్యురాలు.
- కథలాపూర్ మండలం చింతకుంట గ్రామానికి చెందిన మేకల మనోజ్ అలియాస్ వినోద్, వికాస్ మావోయిస్టు మహారాష్ట్ర గుండాల డివిజన్ కమాండర్, కొర్చి-కుకేడ యాక్షన్ టీం సభ్యురాలు.
- కథలాపూర్ మండలం సిరికొండ గ్రామానికి చెందిన పాసుల గంబాల అలియాస్ వసంత, మమత, మావోయిస్టు దక్షిణ బస్తర్ స్పెషల్ కమిటీ, మాడ జిల్లా కమిటీ సభ్యురాలు.
- కోరుట్ల పట్టణం ఇందిరా రోడ్‌కు చెందిన కిషన్ దక్షిణ బస్త ర్ స్పెషల్ జోన్ కమిటీ, టెక్నికల్ జిల్లా కమిటీ మెంబర్.
- ఓదెల మండలం గుంపుల గ్రామానికి చెందిన సందె గంగయ్య అలియాస్ అశోక్, దక్షిణ కోస్తా స్పెషల్ కమిటీ సభ్యుడు.
 
రూ. 4 లక్షల రివార్డు
- మహాముత్తారం మండలంలోని కనుకునూర్ గ్రామానికి చెందిన చెన్నురి స్వర్ణక్క అలియాస్ స్వరూప మావోయిస్టు పార్టీ నార్త్‌జోన్ స్పెషల్ కమిటీ సభ్యురాలు, ఖమ్మం జిల్లాలోని వెంకటాపూర్ యాక్షన్ కమిటీ డెప్యూటీ కమాండర్.
- పెద్దపల్లి మండలం గోపయ్యపల్లె గ్రామానికి చెందిన దాతు ఐలయ్య అలియాస్ గట్టయ్య, మావోయిస్టు పార్టీ యాక్షన్ కమిటీ కమాండర్.
- జూలపల్లి మండలంలోని వెంకట్రావ్‌పల్లి గ్రామానికి చెందిన దీకొండ శంకరయ్య అలియాస్ శేషన్న, పార్టీ యాక్షన్ కమిటీ కమాండర్.
- కోనరావుపేట మండలం శివంగలపల్లి గ్రామానికి చెందిన నేరళ్ల జ్యోతి అలియాస్ జ్యోతక్క, పార్టీ దక్షిణకోస్తా స్పెషల్ జోన్ కమిటీ సభ్యురాలు.
 
రూ. 2లక్షల లోపు రివార్డు ఉన్నవారు
- రాయికల్ మండలం కట్కాపూర్ గ్రామానికి చెందిన ముందం లక్ష్మణ్ అలియాస్ స్వామి, ప్లాటూన్ సభ్యుడు.
- హుజూరాబాద్ మండలం చెల్పూర్ గ్రామానికి చెందిన దేవరకొండ సత్యనారాయణ అలియాస్ సత్తన్న, దళ సభ్యుడు.
- సుల్తానాబాద్ మండలం కొదురుపాక గ్రామానికి చెందిన జువ్వాడి వెంకటేశ్వర్‌రావు అలియాస్ ధర్మన్న, పార్టీ దళ సభ్యుడు.
- కమలాపూర్ మండలం శంభునిపల్లి గ్రామానికి చెందిన కనగర్తి రజినికర్‌రెడ్డి అలియాస్ నారాయణ మావోయిస్టు పార్టీ దళ సభ్యుడు.
- హుస్నాబాద్ మండలం అక్కన్నపేట గ్రామానికి చెందిన కాసబోయిన స్వరూప దళ సభ్యురాలు.

మరిన్ని వార్తలు