ఇక రజినీ కనిపించదు

25 Apr, 2019 02:00 IST|Sakshi

మొహర్రం, బోనాల వేడుకల్లో ఏనుగుకు అనుమతి నిరాకరణ

హైకోర్టు తీర్పు నేపథ్యంలో అటవీ శాఖ నిర్ణయం  

సాక్షి, హైదరాబాద్‌: నగరంలో జరిగే మొహర్రం, బోనాల వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా ప్రసిద్ధి. నగరవాసులేగాక, దేశవిదేశాల నుంచి భక్తులు ఈ వేడుకలను చూసేందుకు నగరానికి వస్తుంటారు. అది మొహర్రం అయినా బోనాల పండుగ అయినా.. ఒక ప్రత్యేక అతిథి మాత్రం సాధారణంగా సందడి చేస్తుంటుంది. అదే రజినీ ఏనుగు. ఈ ఏనుగు వయసు 54 ఏళ్లు. ప్రస్తుతం నెహ్రూ జూపార్కులోనే ఉంది. గత 17 ఏళ్లుగా ఇది నగరంలో జరిగే మతపరమైన వేడుకల్లో కనువిందు చేస్తోంది.  

న్యాయస్థానం ఆదేశాలతో..
తాజాగా హైకోర్టు ఆదేశాల ప్రకారం ఇక ముందు బోనాలు, మొహర్రం లాంటి వేడుకలకు జూపార్క్‌ నుంచి ఏనుగును ఇవ్వబోమని అటవీ శాఖ స్పష్టం చేసింది. మతపరమైన ప్రదర్శనల్లో రజినీ పాల్గొనటం ఆనవాయితీగా వస్తోంది. అయితే జంతువులను ఇలాంటి ప్రదర్శనల్లో ఉపయోగించటాన్ని ఇకపై అను మతించబోమని ఇటీవల హైకోర్టు తెలిపింది. ఏనుగులను నియంత్రించే నిపుణులు (మహావత్‌) లేకపోవటం, ప్రదర్శన సమయంలో ప్రజల భద్రతను కూడా దృష్టిలో పెట్టుకుని కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. హైకోర్టు ఆదేశాలతో ఇకపై ఎలాంటి ప్రదర్శనలకూ ఏనుగును పంపబోమని అటవీ శాఖ ఉన్నతాధికారులు తెలిపారు. మతపరమైన ఉత్సవాల్లో జంతువుల వినియోగాన్ని నిషేధించాలని గతంలోనే సుప్రీంకోర్టు, మహారాష్ట్ర హైకోర్టు కూడా ఆదేశాలిచ్చాయి.

ఈ ఆదేశాలనే బలపరుస్తూ తాజాగా ఇక్కడి హైకోర్టు కూడా ఇదే తీర్పునిచ్చింది. ఉత్సవాల్లో జంతు వులను కట్టేయడంతో వాటికి గాయాలవుతున్నాయని, ఇది హింస కిందకే వస్తుందని జంతుప్రేమికులు వాదిస్తున్నారు. పైగా భారీ శబ్దాలు, జన సందోహాన్ని చూసి ఇవి బెదిరినపుడు ప్రజల ప్రాణాలకే నష్టం వాటిల్లుతున్నదని వారు వాదిస్తున్నారు. ప్రజలు, జంతువుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని కోర్టు ఈ మేరకు తీర్పు ఇచ్చింది.

మరిన్ని వార్తలు