‘పాలమూరు’కు పచ్చతోరణం

26 Jan, 2019 03:08 IST|Sakshi

పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు పూర్తిస్థాయిలో అటవీశాఖ అనుమతి 

సాక్షి, హైదరాబాద్‌/జడ్చర్ల: ఉమ్మడి మహబూబ్‌నగర్, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాలో సుమారు పన్నెండున్నర లక్షల ఎకరాలకు సాగు నీరు, వెయ్యికి పైగా గ్రామాలకు తాగు నీరు అందించే పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో కీలక ముందడుగు పడింది. ప్రాజెక్టుకు కేంద్ర పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖ పూర్తిస్థాయిలో అనుమతులు మంజూరు చేసింది. ఈ మేరకు రాష్ట్ర పర్యావరణ, అటవీ శాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రెటరీకి అటవీ శాఖ డిప్యూటీ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ శ్రవణ్‌ కుమార్‌ వర్మ శుక్రవారం లేఖ రాశారు. ఈ అనుమతులతో ప్రాజెక్టు పరిధిలోని పంప్‌హౌస్, రిజర్వాయర్, టన్నెల్‌ నిర్మాణానికి మార్గం సుగమం అయింది.  

కీలక ముందడుగు.. 
ప్రాజెక్టు నిర్మాణానికి నాగర్‌ కుర్నూల్‌ జిల్లా అచ్చంపేట అటవీ డివిజన్‌లో ఉన్న 205.48 హెక్టార్ల అటవీ భూమిని సాగునీటి శాఖకు అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి 2017 మే నెలలో లేఖ రాసింది. ఆ అభ్యర్థనని ఫారెస్ట్‌ అడ్వైజరీ కమిటీ (ఎఫ్‌ఏసీ) పరిశీలించి 2018 ఏప్రిల్‌ నెలలో తొలి దశ అనుమతిని మంజూరు చేసింది. కేంద్రం విధించిన విధి విధానాలను ప్రభుత్వం సంపూర్ణంగా అమలు చేసిన కారణంగా కేంద్ర పర్యావరణ అటవీ శాఖ శుక్రవారం ప్రాజెక్టుకు పూర్తిస్థాయి అనుమతిని మంజూరు చేసింది. ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న మొదటి స్టేజి పంప్‌ హౌస్, నార్లపూర్‌ వద్ద అంజనగిరి రిజర్వాయర్, నార్లపూర్‌ –అంజనగిరి – ఏదుల వీరాంజనేయ రిజర్వాయర్‌ల మధ్య టన్నెల్‌ తవ్వకపు పనులకు అటవీ భూముల బదిలీ అవసరమైంది. ప్రస్తుత అనుమతితో 205.48 హెక్టార్ల అటవీ భూమి పాలమూరు ప్రాజెక్టు సీఈ అధీనంలోకి వస్తుంది.దీంతో పనులన్నీ సులువుగా సాగనున్నాయి.

ఇక పర్యావరణ పరంగా ఇప్పటికే స్టేజ్‌ –1 అనుమతి పొందిన సంగతి తెలిసిందే. పూర్థి స్థాయి పర్యావరణ అనుమతి కోసం ఆ నివేదికను సాగు నీటి శాఖ తయారు చేస్తోంది. త్వరలోనే దీన్ని కేంద్ర పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖకు సమర్పించనుంది. ఈ ప్రాజెక్టుకు గాను ఇప్పటికే అటవీ పర్యావరణ అనుమతులు లేకుండా ప్రాజెక్టు పనులను కొనసాగిస్తున్నారని, ఈ దృష్ట్యా పనులను వెంటనే ఆపాలని కోరుతూ నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌లో కేసులు దాఖలైన సంగతి తెలిసిందే.రాష్ట్ర ప్రభుత్వం కేవలం తాగునీటి సరఫరా కోసమే పనులను చేపట్టిందని, పర్యావరణ, అటవీ అనుమతులు పొందిన తర్వాతనే సాగు నీటి పనులను చేపడుతుందని ప్రభుత్వం ఇదివరకు ఎన్‌జీటీకి తెలిపింది.ఈ కేసుల నేపథ్యంలో ప్రస్తుతం మంజూరైన అటవీ అనుమతి కీలకమైన ముందడుగుగా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.  

సీఎం కేసీఆర్‌ హర్షం... 
పాలమూరుకు అటవీ అనుమతులపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ హర్షం వ్యక్తం చేశారు. సహస్ర చండీయాగం ముగింపు రోజున ఈ సమాచారం తెలిసిన సీఎం తన హర్షాన్ని వెలిబుచ్చారు. కేంద్ర అటవీ శాఖ మంత్రి హర్షవర్ధన్‌కు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కృషిలో పాలు పంచుకున్న నీటి పారుదల ప్రాజెక్టు సీఈ రమేశ్, ఈఈ విజయ్‌కుమార్‌లను అభినందించారు. తాజా అనుమతులతో పనులు వేగం పుంజుకునే అవకాశం ఉంది. ప్రభుత్వం కూడా దీనికి ఎంతో ప్రాధాన్యం మిచ్చి పనులను వేగిరపరుస్తున్న సంగతి తెలిసిందే.  

రెండేళ్లలో పూర్తి చేస్తాం: లక్ష్మారెడ్డి 
పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని రెండేళ్లలో పూర్తిచేస్తామని మాజీమంత్రి, జడ్చర్ల ఎమ్మెల్యే సి.లక్ష్మారెడ్డి తెలిపారు. ఆయన ‘సాక్షి‘తో మాట్లాడుతూ ఈ ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు కేంద్రంనుంచి లభించాయని వెల్లడించారు. ఇందుకు కృషిచేసిన సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.త్వరితగతిన పూర్తి చేసి రైతులకు సాగునీరందిస్తామన్నారు.

మరిన్ని వార్తలు