చట్టం తెచ్చిన తంటా..!

14 Feb, 2019 11:54 IST|Sakshi

నర్సంపేట: ఆసాములంతా కూర్చొనే వడ్రంగుల వాకిలి నేడు పొక్కిలి లేచి దుఃఖిస్తోంది.. అరకల పనికి ఆకలిదీరక  ఫర్నీచర్‌ పనులు చేసుకొని బతుకుదామనుకుంటే  వారిపై చట్టాల పేరుతో వేధింపులు పెరుగుతున్నాయి. వడ్రంగుల వెతలు వర్ణనాతీతం. వేరే వృత్తిలోకి వెళ్లలేక జీవనోపాధి కోసం నమ్ముకున్న వృత్తినే ఆధారం చేసుకోగా కర్ర పనులపై నమ్మకం పెంచుకోని జీవితాలను వెల్లదీస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం అటవీ సంరక్షణకు ప్రత్యేకంగా నూతన ఒరవడులకు శ్రీకారం చుట్టింది. వీటిని అమలు చేసే విధానంలో కిందిస్థాయి అధికారుల దుందుడుకుడుతనం  విశ్వకర్మలపై పెనుభారం పడుతుంది. ఇటీవల కాలంలో ఫారెస్ట్‌ అధికారులు దాడులు తీవ్రతరం చేశారు.బతుకుపై భారంపడుతుండటంతో ప్రభుత్వ తీరు, అధికారుల పద్ధతిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

జిల్లాలో 5650 వడ్రంగులు.. 
జిల్లా వ్యాప్తంగా 5650 వడ్రంగుల కుటుంబాలు ఉండగా 12500 జనాభా నివసిస్తున్నారు. వీరిలో 8720 మంది కులవృత్తులపై ఆధారపడి పనులు చేసుకుంటున్నారు. నేటి కంప్యూటర్‌ యుగంలో యాంత్రీకరణతో పనులు ఎక్కువగా సాగుతున్నప్పటికీ వడ్రంగులు తమ కష్టాన్ని నమ్ముకొని జీవనం కొనసాగిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో నివసించే వడ్రంగులు తమ వద్దకు కర్రను తీసుకువచ్చే వారికి ఇండ్లకు, ఇంట్లోకి కావాల్సిన పర్నిచర్‌ను తయారు చేస్తుంటారు.

కేవలం ఫర్మిషన్‌ ఉన్న కర్రను మాత్రమే తీసుకువస్తే ఇంటి ధర నిర్ణయించి పనులు చేస్తారు. ఇలా అనేక సంవత్సరాలుగా కులవృత్తులను నమ్ముకొని జీవనం సాగిస్తున్నారు  గ్రామాల్లో వారు చేసే పనులు ఫారెస్ట్‌ అధికారులకు పూర్తిస్థాయిలో నిత్యం తెలుస్తూనే ఉండేది. ఉన్నతాధికారుల నుంచి వచ్చే ఆదేశాలతో తనిఖీలు నిర్వహించినా ఎలాంటి అక్రమ కలప లభించని సందర్భాలు అనేకంగా ఉన్నాయి. అధికారుల అడపాదడపా తనిఖీలను తట్టుకొని సైతం పనులు సాగిస్తున్నారు.  ఇటీవల ఫారెస్ట్‌ అధికారుల దాడులతో పర్మిట్‌ కర్రను సైతం కొనుగోలు చేసుకోలేని స్థితులు రావడంతో వారి జీవనంపై పెను భారం పడుతోంది
 
నూతన చట్టాలతో తప్పని తలపోటు..
తెలంగాణ ప్రభుత్వం అడవులను రక్షించాలనే మంచి ఉద్దేశంతో మార్పులు తీసుకువచ్చింది. ఆ మార్పులే వడ్రంగుల పాలిట శాపంగా మారుతున్నాయి. ఇటీవల ఫారెస్ట్‌ చట్టాల్లో వచ్చిన మార్పులు వడ్రంగులకు తలపోటు తప్పడంలేదు. వడ్రంగులపై గత వారం రోజులుగా ఫారెస్ట్‌ అధికారులు తీవ్ర వేధింపులకు పాల్పడుతున్నారు. ఇంటి నిర్మాణానికి కావాల్సిన కలప, ఫర్నిచర్‌కు కావాల్సిన కలపను తయారు చేయించుకోవడానికి వినియోగదారులు వడ్రం గుల వద్దకు తీసుకెళ్లగా వారిపై ఫారెస్ట్‌ అధికారులు దాడులు నిర్వహించి అక్రమ కేసులు బనాయిస్తున్నారు. ఎలాంటి తప్పులు చేయకున్నా అక్రమంగా కేసులు నమోదు చేస్తుండడంతో బతుకుపై భారం పడుతుందని వడ్రంగులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అందని ప్రభుత్వ చేయూత..
గత ప్రభుత్వాలు ఏనాడు విశ్వకర్మలకు ఆర్థిక ఎదుగుదలకు సహకరించలేదు. కేవలం తాత్కాలిక పనిముట్లు అందించి చేతులు దులుపుకున్న పరిస్థితి ఉండేది. ఆయా కులాల వారీగా ప్రభుత్వాలు ప్రత్యేక సొసైటీలు ఏర్పాటు చేసి ఆర్థిక రుణాలు అందించారు. కానీ విశ్వకర్మలకు ఎలాంటి రుణ, ఆర్థిక సహాయాలు అందని పరిస్థితి ఉంది. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడితే విశ్వకర్మల బ్రతుకులు మారతాయనుకున్నారు. తెలంగాణ కోసం విశ్వకర్మలైన తెలంగాణ సిద్ధాంతకర్త కొత్తపల్లి జయశంకర్, శ్రీకాంతచారి, మారోజు వీరన్నలతో పాటు పలువురు తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించారు. వారి తాగ్యాలతో ఏర్పడిన తెలంగాణ ప్రభుత్వంలో విశ్వకర్మలకు తీవ్ర ఆటంకాలు ఎదురవుతున్నాయి.

దాడులకు నిరసనగా చలో హైదరాబాద్‌...
ఫారెస్ట్‌ అధికారులు విశ్వకర్మలపై దాడులను నిరసిస్తూ ఈ నెల 16, 17 తేదీల్లో ఛలో హైదరాబాద్‌ కార్యక్రమాన్ని చేపట్టారు. తెలంగాణ ప్రభుత్వం ఫ్లాంటేషన్‌ కర్రను ప్రభుత్వమే ఖరీదు చేసి విశ్వకర్మ వడ్రంగులకు పంపిణీ చేయాలని, విశ్వకర్మ కార్పొరేషన్‌ను 600 కోట్లతో ఏర్పాటు చేసి వడ్రంగుల కుటీర పరిశ్రమలుగా ఏర్పాటు చేయాలని, జీవన అభివృద్ధి కోసం ముడి కలపను పంపిణీ చేయాలని, ఇంటి వద్ద ఫర్నిచర్‌ను 20 ఫీట్ల వరకు రాయితీ కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తున్నారు. ఇందులో భాగంగానే తలపెట్టిన  ఛలో హైదరాబాద్‌ కార్యక్రమం కోసం సిద్ధమవుతున్న వడ్రంగులను ఎక్కడికక్కడ అరెస్ట్‌లు చేయడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఛలో హైదరాబాద్‌ను భగ్నం చేసేందుకు ఉన్నతాధికారులు పోలీసులతో వారిని అరెస్ట్‌ చేస్తుండడంపై ప్రభుత్వంపై తీవ్ర అసహనం చేస్తున్నారు.

వడ్రంగులపై దాడులను ఆపాలి
కులవృత్తిపై ఆధారపడి జీవిస్తున్న వడ్రంగులపై ఫారెస్ట్‌ అధికారుల దాడులను ఆపాలి. అనేక సంవత్సరాలుగా పనులు చేసుకొని జీవనం సాగిస్తున్నం. ఎన్నడూ లేని విధంగా ఒక్కసారిగా చట్టాలు మారాయంటూ ఇళ్ల మీదకు వచ్చి దాడులు నిర్వహించడం సరికాదు. దాడులతో కుటుంబాలు చిన్నాభిన్నమయ్యే పరిస్థితులు ఏర్పడుతున్నాయి.– దేవోజు సదానందం, నర్సంపేట

కుటీర పరిశ్రమలుగా గుర్తించాలి 
ఇంటి వద్ద పని చేస్తూ జీవనం గడుపుతున్న వడ్రంగి వృత్తులను కుటీర పరిశ్రమలుగా గుర్తించాలి. 20 ఫీట్ల ఫర్నిచర్‌కు రాయితీలు కల్పించాలి.విశ్వకర్మ కార్పొరేషన్‌ ఏర్పాటు చేసి ఆదుకోవాలి.అనేక సంవత్సరాలుగా కులవృత్తులపైనే ఆధారపడి జీవిస్తున్నాం. ఫారెస్ట్‌ దాడులతో రోడ్డున పడుతున్నాం. దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నం. – కురిమిల్ల సుదర్శనచారి,నర్సంపేట  

మరిన్ని వార్తలు