జంగల్‌లో జల సవ్వడి

21 May, 2019 02:13 IST|Sakshi

అడవుల్లో మూగజీవాల వేసవి తాపాన్ని తీరుస్తున్న అటవీ శాఖ

సాసర్‌ పిట్స్, ఇతర ఏర్పాట్లతో దాహం తీర్చుకుంటున్న వన్యప్రాణులు

నీటి వసతి కరువైన చోట్ల ట్యాంకర్ల ద్వారా సరఫరా

మంచి ఫలితాలు వచ్చాయంటున్న ఉన్నతాధికారులు

సాక్షి, హైదరాబాద్‌: మండుతున్న ఎండలకు నోరులేని మూగజీవాలు, అరణ్యాల్లో బతుకుతున్న జంతుజాలం, పక్షిజాతులు, వన్యప్రాణులు అల్లాడుతున్నాయి. నీటి జాడ కోసం వెతుక్కుంటూ జనాల మధ్యకు వస్తుండటంతో మానవులకు, మృగాలకు మధ్య సంఘర్షణ వాతావరణం ఏర్పడుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో అటవీ శాఖ చేపడుతున్న చర్యలు మంచి ఫలితాలు ఇస్తోంది. అడవుల్లో జంతువులకు నీరు అందుబాటులో ఉంచేందుకు ఏర్పాట్లు చేస్తోంది. నీటి తొట్ల నిర్మాణం, వాటిల్లో నిత్యం నీరుండేలా ట్యాంకర్ల ద్వారా సరఫరా, అవసరమైన చోట సోలార్‌ బోర్‌వెల్స్‌ ఏర్పాటు చేసి వన్య ప్రాణుల దాహార్తి తీరుస్తోంది. వాగులు, వంకల పరిసరాల్లో చెలిమెలు తీయగా, సహజ నీటివనరులు లేనిచోట సిమెంట్‌ తొట్టెలు, సోలార్‌ ప్యానెళ్లు, బోర్‌పంపుల్ని అటవీ అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. కీకారణ్యాల్లో చెరువులు, కుంటల్లో పూడిక తీత, ఇసుక నేలలు తోడడం వంటి చర్యలు చేపట్టారు. ఇక రోడ్డు మార్గాలున్న చోట సాసర్‌పిట్స్‌ ఏర్పాట్లు చేస్తున్నారు. నీరు త్వరగా ఇంకిపోకుండా అడుగుభాగాన టార్పిలిన్‌ ఉంచుతున్నారు.

గ్రిడ్‌ల ద్వారా కొత్త వ్యూహం..
అటవీ ప్రాంతాల్లోని అడవుల్లోపల, రక్షిత ప్రాంతాల వెలుపల అందుబాటులో ఉన్న నీటి వనరుల పర్యవేక్షణకు గ్రిడ్‌ వ్యవస్థను అమలుచేస్తోంది. రక్షిత ప్రాంతాల వెలుపల ఉన్న చోట్లలో 9 చదరపు కి.మీ. పరిధిలో గ్రిడ్‌లు ఏర్పాటు చేసింది. 4,576 గ్రిడ్‌లను ఏర్పాటు చేసింది. వీటిలో 2,290 గ్రిడ్‌లలో నీటి లభ్యత ఉన్నట్లు అధికారులు గుర్తించారు. నీరు అందుబాటులో లేని గ్రిడ్స్‌లలో 584ను అత్యంత ప్రాధాన్యత గలవిగా గుర్తించి వాటి పరిధిలో నీటి ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని నిర్ణయించింది.
ఫలించిన క్షేత్రస్థాయి పరిశీలన..
అడవుల్లో జంతువుల కోసం తాము ఏర్పాటు చేసిన నీటివనరులతో పాటు, క్షేత్రస్థాయిలో నెలకొన్న పరిస్థితి సమీక్షకు ఈ నెల 11, 12 తేదీల్లో ఫ్రెండ్స్‌ ఆఫ్‌ స్నేక్స్‌ సొసైటీ, డబ్ల్యూడబ్ల్యూఎఫ్, డెక్కన్‌ బర్డర్స్, హైటికోస్, ఎఫ్‌డబ్ల్యూపీఎస్‌ స్వచ్ఛంద సంస్థలకు చెందిన 110 వాలంటీర్లు అమ్రాబాద్, కవ్వాల్‌ టైగర్‌ రిజర్వ్‌లు, ఏటూరునాగరం వన్యప్రాణి అభయారణ్యాల పరిధిలో ‘వాటర్‌హోల్‌’ సెన్సెస్‌ నిర్వహించారు. వీరందరిని 43 బృందాలుగా విభజించి అటవీశాఖ అధికారుల పర్యవేక్షణలో ఈ అడవుల్లోని 241 నీటి వనరులను పరిశీలించారు. ఈ అడవుల్లో అందుబాటులో ఉన్న నీటివనరులతో పాటు, ఇవి లేనిచోట అటవీశాఖ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు, అవి ఏ మేరకు జంతువులకు ఉపయోగపడుతున్నాయన్న తీరును పరిశీలించారు.

మంచి ఫలితాలు వచ్చాయి..
గతంతో పోలిస్తే వేసవిలో నీటిజాడను వెతుక్కుంటూ వ్యవసాయ భూముల్లోకి వస్తున్న వన్యప్రాణుల సంఖ్య గణనీయంగా తగ్గిందని అడ్మిన్, వైల్డ్‌లైఫ్‌ ఇన్‌చార్జి అడిషనల్‌ పీసీసీఎఫ్‌ మునీంద్ర ‘సాక్షి’కి తెలిపారు. కొన్నిచోట్ల అడవి దున్నలు, జింకలు, ఇతర జంతువులు తమ సంతతితో కనిపించడాన్ని బట్టి ఆయా జంతు జాతులు ఆరోగ్యకరంగా అభివృద్ధి చెందడానికి సంకేతంగా భావిస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం చేపడుతున్న చర్యలతో రాష్ట్రంలోని అడవుల్లో 70–75 శాతం గ్రిడ్‌లలో నీరు అందుబాటులోకి వచ్చిందని ఫారెస్ట్‌ ఓఎస్డీ శంకరన్‌ చెప్పారు. 

మరిన్ని వార్తలు