ఒక్కో మొక్కకు రూ.5,000

11 Mar, 2020 02:11 IST|Sakshi

‘చెట్ల దత్తత’పేరిట వినూత్న కార్యక్రమం  శ్రీకారం చుట్టిన అటవీ అభివృద్ధి సంస్థ 

సాక్షి, హైదరాబాద్‌: ‘చెట్ల దత్తత’ పేరిట ఓ వినూత్న కార్యక్రమానికి తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థ శ్రీకారం చుట్టింది. దీనిలో భాగంగా ఒక్కో పెద్ద మొక్క/చెట్టును రూ.5 వేలు చెల్లించి దత్తత తీసుకునే అవకాశాన్ని కల్పిస్తోంది. ప్రస్తుతం నగరంలోని నెహ్రూ జూలాజికల్‌ పార్కులోని ఏనుగులు మొదలుకుని చిన్న జంతువుల వరకు కార్పొరేట్‌ కంపెనీలు జంతు ప్రేమికులు, దత్తత తీసుకునే వెసులుబాటు ఉంది. ఇందులో భాగంగా ఆయా జంతువులను ఏడాది పాటే దత్తత తీసుకునే వీలుంది. ఒక సంవత్సరం పాటు ఆ జంతువులæ ఆహారం, పరిరక్షణకు అయ్యే ఖర్చును దత్తత తీసుకునే వారు భరించాల్సి ఉంటుంది. దీనికి భిన్నంగా చెట్లను దత్తత తీసుకునే వారి పేరిట ఒక పెద్ద మొక్కను నాటి, అది పెరిగి పెద్దదయ్యే వరకు సంరక్షించే బాధ్యతను ఈ సంస్థ తీసుకుంటుంది.

ఆ చెట్టుకు వారి పేరు పెట్టి, ఎప్పుడైనా సందర్శించి దానిని చూసుకునే వీలు కల్పిస్తోంది. ఈ మొక్కలను దత్తత ప్రక్రియ పూర్తయ్యాక తమ నర్సరీల్లో 12 నుంచి 15 అడుగుల ఎత్తున్న పెద్ద మొక్కలను నాటుతారు. ప్రస్తుతం ఈ కార్యక్ర మం కింద కొత్తగూడలోని పాలపిట్ట సైక్లింగ్‌ పార్కు, కొండాపూర్‌లోని బొటానికల్‌ గార్డెన్‌లో మొక్కలు నాటి, సంరక్షించే కార్యక్రమాన్ని ఈ సంస్థ కొనసాగిస్తోంది. ఈ కార్యక్రమంలో భాగంగా నగరంలోని కెనరా బ్యాంక్‌ మాసబ్‌ట్యాంక్‌ బ్రాంచ్‌ 200 పెద్ద మొక్కలను దత్తత తీసుకుంది. ఈ మొక్కల నిర్వహణ, పరిరక్షణ కోసం రూ.5 లక్షల మొత్తాన్ని కూడా విడుదల చేసింది. ఐటీ రంగానికి చెందిన పలువురు ఉద్యోగులు ఈ మొక్కలను దత్తత తీసుకునేందుకు ఈ సంస్థకు హామీ (ప్లెడ్జ్‌లు) పత్రాలిచ్చినట్టు అధికారులు తెలిపారు.  

దత్తతకు 3,500 అందుబాటులో.. 
‘‘ప్రస్తుతం 3,500 మొక్కలు వెంటనే దత్తత తీసుకునేందుకు అందుబాటులో ఉన్నాయి. దత్తత తీసుకున్న మొక్కలను ఎంపిక చేసిన పార్కుల్లో నాటుతాం. ఒక క్యూబిక్‌ మీటర్‌ లోతులో ఎరువులు, ఎర్రమట్టి, ఇతర జాగ్రత్తలు తీసుకుని మొక్కలు నాటుతాం. దత్తత తీసుకున్న వారు అప్పుడప్పుడు వచ్చి మొక్కలను చూసుకోవచ్చు. 12 నుంచి 15 అడుగుల ఎత్తున పెద్ద మొక్కలు నాటుతున్నందున త్వరగా అవి పెరగడంతో పాటు మంచి ఫలితాలొచ్చే అవకాశాలున్నాయి.  
– ‘సాక్షి’తో అటవీ అభివృద్ధి సంస్థ వీసీ, ఎండీ పి.రఘువీర్‌ 

మరిన్ని వార్తలు