పాములకు పాలు పట్టించడం జంతుహింసే!

23 Jul, 2019 02:34 IST|Sakshi

ఎన్జీవోలతో భేటీలో అటవీశాఖ అధికారులు

సాక్షి, హైదరాబాద్‌: ఆగస్టు 5న నాగపంచమి నేపథ్యంలో అటవీశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. పాములు పాలు తాగుతాయనే ప్రచారం చేస్తే, అలాంటి వాటిని నమ్మొద్దని స్పష్టం చేశారు. వివిధ ప్రచార మాధ్యమాల ద్వారా ప్రజల్లో  అవగాహన పెంచేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సోమవారం వివిధ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో అధికారులు అరణ్యభవన్‌లో సమావేశమయ్యారు. నాగపంచమిరోజు దేవాలయాల దగ్గరకు ఎవరైనా పాములతో వస్తే వెంటనే అటవీ శాఖకు, స్థానిక పోలీసులకు సమాచారమివ్వాలని కోరారు.

పాములను పట్టుకుని ఆడించటం, పాలు పట్టడం వంటివి వన్యప్రాణి చట్టాల ప్రకారం జంతుహింస కిందకు వస్తాయని తెలిపారు. పాములను పట్టుకుని హింసించే వారి వివరాలు అటవీశాఖ టోల్‌ ఫ్రీ నంబర్‌ 1800 425 5364 కు తెలపాలని అధికారులు కోరారు. ఈ నెల 29న ప్రపంచ పులుల దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌తోపాటు అన్ని జిల్లాల్లో పులుల సంరక్షణ మీద ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు అధికారులు తెలిపారు. కార్యక్రమంలో అటవీ సంరక్షణ ప్రధానాధికారి పీకే ఝా, పీసీసీఎఫ్‌ ఆర్‌.శోభ  అదనపు పీసీసీఎఫ్‌ మునీంద్ర, హైదరాబాద్‌ చీఫ్‌ కన్జర్వేటర్‌ చంద్రశేఖరరెడ్డి, డీఎఫ్‌వో పూజారి వెంకటేశ్వర్లు, ఓఎస్డీ శంకరన్, ఫ్రెండ్స్‌ ఆఫ్‌ స్నేక్స్‌ సొసైటీ అవినాష్, డబ్ల్యూడబ్ల్యూఎఫ్‌ నుంచి ఫరిదా తంపాల్, ఇతర స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు  పాల్గొన్నారు.    

మరిన్ని వార్తలు