అడవి బిడ్డలపై ఆంక్షలు

25 Mar, 2018 11:18 IST|Sakshi
ఆంక్షలు ఎత్తివేయాలని ఫర్హాబాద్‌ వద్ద ఆందోళన చేస్తున్న చెంచులు (ఫైల్‌)

అటవీశాఖ నిబంధనలు మరింత కఠినం

ఇంటికి వెళ్లాలంటే అనుమతి తీసుకోవాల్సిందే..

ఆందోళనకు గురవుతున్న చెంచులు

మన్ననూర్‌ (అచ్చంపేట): అడవి బిడ్డలపై ఆంక్షలు విధిస్తున్నారు.. తమ గూడాలకు వెళ్లాలన్నా.. అవసరాలకు అడవి వీడి మన్ననూర్, అమ్రాబాద్‌ తదితర ప్రాంతాలకు రావాలన్నా.. ఇతర ప్రాంతాల్లో చదివే పిల్లలను పలకరించడానికి వెళ్లాలన్నా అటవీశాఖ నిబంధనలు అడ్డొస్తున్నాయి. అధికారుల అనుమతి లేనిదే మన్యం దాటే పరిస్థితులు లేకుండా పోతున్నాయి. దీంతో వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.   

అడవి తల్లికి ద్రోహమా..
అడవిలోనే ఆవాసాలు ఏర్పాటు చేసుకుని తాత ముత్తాతల కాలం నుంచి అక్కడే నివసిస్తున్నామని.. ఏ నాడూ అడవి తల్లికి ద్రోహం తలపెట్టని తమపై ఎందుకు అనుమానం అంటూ చెంచులు వాపోతున్నారు. తమ ఇళ్లకు వెళ్లాలంటే కూడా అధికారుల అనుమతి తీసుకోవాలా.. అంటూ వాపోతున్నారు. అటవీ లోతట్టు ప్రాంతంలోని మల్లాపూర్,  పుల్లాయిపల్లి, అప్పాపూర్, రాంపూర్, భౌరాపూర్, ఈర్లపెంట, మేడిమల్కల, సంగిడిగుండాలు తదితర పెంటలో చెంచులు తమ జీవనం సాగిస్తున్నారు. గతంలో చెంచులు కాయలు, పండ్లను అడవిలో దొరికే దుంపలతో ఆకలి తీర్చుకునే వారు. రోగమోస్తే ఆకు పసర్లతోనే సర్దుకునేవారు. కాలానుగుణంగా మారుతున్న పరిస్థితులకు అలవాటు పడిన చెంచులు మైదాన ప్రాంతాల్లో ఉండే ప్రజలతో సంబందాలు  ఏర్పరచుకుంటున్నారు.   

నిబంధనలు కఠినతరం
కేంద్ర ప్రభుత్వం ఇటీవలే వన్యప్రాణి సంరక్షణ చట్టాలను సవరిస్తూ అమ్రాబాద్‌ను పులుల రక్షిత ప్రాంతంగా గుర్తించింది. వన్యప్రాణుల మనుగడకు ఆటంకం కలుగకుండా ఉండేందుకు చట్టాల్లో అనేక సవరణలు తీసుకొచ్చింది. అదేవిధంగా అటవీ ప్రాంతంలో ముమ్మరంగా నిఘా ఏర్పాటు చేయడంతో పాటు హద్దులు నిర్ణయించింది. అయితే ఎప్పటిలాగే చెంచులు అడవిని వదిలి అవసరాలకు వస్తుండగా అధికారులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. చెంచులతోపాటు ఇతరులు అభయారణ్యంలోకి అనుమతి లేకుండా రాకపోకలు చేస్తున్నారనే అనుమానంతో చెంచులకు సైతం అనుమతి తీసుకోవాలని కోరుతున్నట్లు తెలుస్తోంది.  

ఫర్హాబాద్‌ వద్ద చెకింగ్‌
చెంచు పెంటలకు వెళ్లాలన్నా.. బయటికి రావాలన్నా ఫరహాబాద్‌ వద్ద అటవీశాఖ వారు ఏర్పాటు చేసిన చెక్‌పోస్టు నుంచి వెళ్లాల్సిందే. ఈ క్రమంలో అనేకసార్లు చెంచులు, అటవీశాఖ అధికారులు, సిబ్బందికి వాగ్వివాదం, ఘర్షనలు చోటు చేసుకున్నాయి. అధికారులు, చెంచులు తరుచూ ఒకరినొకరు చూసుకుంటూనే ఆంక్షలు విధించడంపై విమర్శలు వస్తున్నాయి. ఉన్నతాధికారులు స్పందించి అడవి బిడ్డలపై విధిస్తున్న ఆంక్షలను ఎత్తివేయాలని డిమాండ్‌ చేస్తున్నారు.  

కావాలనే చేస్తున్నరు..  
మా ఇళ్లకు వెళ్లకుండా ఫారెస్టోళ్లు ఇబ్బందులకు గురి చేస్తున్నరు. జబ్బు చేసినా, దవాఖానకు వెళ్లాలన్నా, పిల్లలను చదువులకు పంపించాలన్న ప్రతిసారి పర్మీషన్‌ తీసుకోవాలంటే ఎట్లా.. చెకింగ్‌ చేసేటోళ్లు కూడా మా చెంచు బంధువులే కదా. మా గురించి వాళ్లకు తెల్వదా.. మా నుంచి నుంచి ఎవరికి ముప్పు వస్తది.                       – చిర్ర రాములు, చెంచుల హక్కుల సాధన కమిటీ జిల్లా అధ్యక్షుడు   

ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే..
చెంచులను ఏనాడూ ఇబ్బంది పెట్టలేదు. వారివెంట వచ్చే అనుమానితులు, ఇతరులు తారసపడినప్పుడు మాత్రమే చెక్‌పోస్టు వద్ద మా సిబ్బంది అడ్డుకుంటున్నారు. వన్యప్రాణి సంరక్షణ చట్టాన్ని అనుసరిస్తూ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే తాము నడుచుకుంటున్నాం.  చెంచులతో మాకు ఎలాంటి వివక్ష లేదు.           – శ్రీదేవి, ఫారెస్టు రేంజ్‌ అధికారి, మన్ననూర్‌

 

మరిన్ని వార్తలు