ఉమాపతిరావు అంత్యక్రియలకు చిరంజీవి, రామ్‌చరణ్‌

31 May, 2020 10:10 IST|Sakshi

సాక్షి, కామారెడ్డి: దోమకొండ సంస్థాన వారసులు, రిటైర్డు ఐఏఎస్‌ అధికారి కామినేని ఉమాపతిరావు అంత్యక్రియలకు చిరంజీవి, రామ్‌చరణ్‌ తేజ్‌, ఉమాపతిరావు మనవరాలు ఉపాసన హాజరయ్యారు. కాగా.. ఆయన బుధవారం కన్నుమూసిన సంగతి  తెలిసిందే. ఆదివారం ఉదయం 9 నుంచి 11 గంటల వరకు భౌతికదేహాన్ని గడికోటలో ప్రజల సందర్శనార్థం ఉంచి ఆ మేరకు ఏర్పాట్లు చేశారు. 11 నుంచి 11:45 గంటల వరకు సంబంధిత కార్యక్రమాలు నిర్వహించారు.

అనంతరం స్థానిక లక్ష్మీబాగ్‌కు తరలించి మధ్యాహ్నం 12 గంటలకు దహన సంస్కారాలు నిర్వహిస్తున్నట్లు గడికోట ట్రస్టు సీనియర్‌ మేనేజర్‌ బాబ్జీ తెలిపారు. అంత్యక్రియలకు కామినేని కుటుంబ సభ్యులు, సినీ ప్రముఖులు, వ్యాపారవేత్తలు హాజరు అయ్యారు. అంతకు ముందు ఉమాపతిరావు పార్థివదేహానికి జిల్లా కలెక్టర్‌ శరత్ కుమార్, జాయింట్ కలెక్టర్ యాదిరెడ్డి, అసిస్టెంట్ కలెక్టర్ తేజాస్ నందన్ లాల్ పవార్, అదనపు కలెక్టర్ వెంకటేష్ దొత్రే పూలమాల వేసి నివాళులర్పించారు. 

తేనేటీగల దాడి
కాగా అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తున్న తరుణంలో చిరంజీవితో సహా పలువురిపై తేనేటీగలు దాడి చేశాయి. వెంటనే సిబ్బంది అప్రమత్తం కావడంతో ఎటువంటి ప్రమాదం జరగలేదు. ఉమాపతిరావుకు కుమారుడు అనిల్‌కుమార్‌ కామినేనితో పాటు కూతురు శోభ ఉన్నారు. అమెరికాలో స్థిరపడిన కూతురు శోభ, అల్లుడు రావడం ఆలస్యం కావడంతో అంత్యక్రియలను ఆదివారానికి వాయిదా వేసిన సంగతి తెలిసిందే. (తాతయ్య కన్నుమూత.. ఉపాసన ట్వీట్)

మరిన్ని వార్తలు