మాజీ మంత్రి చెరుకు ముత్యంరెడ్డి కన్నుమూత

2 Sep, 2019 08:56 IST|Sakshi

రాష్ట్ర రాజకీయాల్లో ముత్యంరెడ్డిది ప్రత్యేక ముద్ర

ఎమ్మెల్యే, మంత్రి, శాసనసభ అంచనాల కమిటీ చైర్మన్‌ గుర్తింపు

అవినీతి ఎరుగని గొప్పనేతగా పేరొందిన నాయకుడు

ఉన్నత పదవుల్లో ఉన్నా ఎవుసం మరువని ముత్తన్న

దుబ్బాక నియోజకవర్గం అభివృద్ధిలో కీలకపాత్ర

ఆయన మరణంతో శోకసంద్రమైన తొగుట

సాక్షి, దుబ్బాక: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనే మాజీ మంత్రి చెరుకు ముత్యంరెడ్డి గురించి తెలియని వారుండరంటే అతశయోక్తి కాదు. రాజకీయాల్లో  గొప్పనేతగా.. మంత్రిగా.. నాలుగు పర్యాయాలు శాసనసభ్యుడిగా.. రెండు పర్యాయాలు శాసనసభ అంచనాల కమిటీ చైర్మన్‌గా.. టీటీడీ బోర్డు మెంబర్‌గా వెలుగు వెలిగిన  ముత్యంరెడ్డి మరణం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల ప్రజలను తీవ్రంగా కలచివేసింది. ముక్కుసూటి తనం.. అవినీతికి ఆమడ దూరం.. నమ్ముకున్న ప్రజలకు సేవచేయడం.. నిస్వార్థపరుడు.. మంత్రిగా ఉన్నా ఎవసం మరువని గొప్పనేతగా దేశ రాజకీయాల్లోనే ముత్యంరెడ్డి ప్రత్యేక గుర్తింపు పొందాడు. ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలిస్తే తరాలుగా కూర్చొని తిన్నా తరగని ఆస్తులు సంపాదించుకునే ఈ రోజుల్లో సైతం నాలుగు పర్యాయాలు ఎమ్మెల్యేగా.. రాష్ట్ర పౌరసరఫరాల శాఖమంత్రిగా పనిచేసినా సాదాసీదాగా జీవితం గడిపాడు.  లగ్జరీలకు చాలా దూరంగా ఉన్నాడు.

తాను మంత్రిగా ఉన్నా ఆయన భార్య విజయలక్ష్మి ఎప్పుడూ వ్యవసాయ క్షేత్రంలోనే పనిచేస్తూ ఉండేది.  తొగుట మండలం తుక్కాపూర్‌లో 1945 జనవరి 1 న బాలమ్మ, బాలకృష్ణారెడ్డిలకు పదమూడో సంతానంలో రెండోవాడు. ముత్యంరెడ్డి సర్పంచ్‌ స్థాయి నుంచి ఎమ్మెల్యేగా, మంత్రిగా ఎదిగాడు. తన రాజకీయ జీవితంలో ఇసుమంతైనా అవినీతి ఎరుగని గొప్పనేత ముత్యంరెడ్డి. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా, చంద్రబాబు ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన ఆయన ఎన్నో ఉన్నత పదవులు అనుభవించినా నయాపైసా అవినీతి ఎరుగని మేలిమి ముత్యంగా రాష్ట్ర రాజకీయాల్లో గొప్ప పేరు సంపాదించాడు. తనను నమ్ముకున్న ప్రజలకు సేవ చేయడమే తప్పా తాను ఇతరుల నుంచి నయాపైసా కూడా  ఆశించని నిస్వార్థపరుడు.

ఎవసం మరువని నేత...
ఎమ్మెల్యేగా, మంత్రి పదవులు అనుభవించినా ఏనాడు ఆయన నమ్ముకున్న ఎవసం మరువలేదు. ఆయనకు వ్యవసాయం అంటే ప్రాణం. తొగుట మండలం తుక్కాపూర్‌లోని తన వ్యవసాయ క్షేత్రంలో విభిన్న రీతిలో అధునాతన పద్ధతుల్లో వ్యవసాయం చేస్తూ పాడి, గొర్రెల పెంపకం, కూరగాయలతో పాటు రకరకాల పంటలు సాగు చేసి చాలమంది రైతులకు స్ఫూర్తినిచ్చాడు. మంత్రిగా ఉన్న సమయంలో చాల బిజీగా ఉన్నప్పటికీ తొగుటలో ఉన్న సమయంలో ఉదయం నాలుగు గంటలకు లేచి పొలం వద్దకు వెళ్లి పనులు చేసేవాడు. పంటలకు సంబంధించి పలు మెళుకువలు చెప్పేవాడు.
ప్రజాసేవకే అంకితం..
తాను తుది శ్వాసవిడిచే వరకు ప్రజాసేవకే అంకితమవుతానని ఎప్పుడూ చెప్పే ముత్యంరెడ్డి, తాను చెప్పినట్లుగానే ప్రజాజీవితంలోనే ఉంటూ తుది శ్వాస విడిచాడు. తన 74 ఏళ్ల జీవన ప్రయాణంలో 55 ఏళ్లు రాజకీయాల్లోనే ఉన్నాడు. ఆయన 1989 లో తొలిసారిగా అప్పటి దొమ్మాట నియోజకవర్గం నుంచి టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత వరుసగా 1994, 1999 లో ఎమ్మెల్యేగా గెలుపొంది హ్యాట్రిక్‌ గెలుపు సాధించారు. 1999లో ఎమ్మెల్యేగా గెలుపొందిన ముత్యంరెడ్డి చంద్రబాబు ప్రభుత్వంలో ఆహార మంత్రిగా సేవలందించాడు. ఆ తర్వాత 2009 ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీలో దివంగత నేత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి నేతృత్వంలో చేరి దుబ్బాక నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా కాంగ్రెస్‌ పార్టీ నుంచి గెలుపొంది రాష్ట్ర శాసనసభ అంచనాల కమిటీ చైర్మన్‌గా, టీటీడీ బోర్డు సభ్యులుగా పనిచేశారు.

ఆరుగురు ముఖ్యమంత్రులతో సాన్నిహిత్యం
దివంగత నేత ముత్యంరెడ్డికి ఆరుగురు ముఖ్యమంత్రులతో సాన్నిహిత్యం ఉంది..  ప్రస్తుత తెలంగాణ సీఎం కేసీఆర్‌తో మాజీ మంత్రి చెరుకు ముత్యంరెడ్డికి చాల అనుబంధం ఉంది. ఎన్‌టీఆర్, చంద్రబాబు ప్రభుత్వాల్లో ఇద్దరు ఎమ్మెల్యేలుగా సిద్దిపేట నుంచి కేసీఆర్, దొమ్మాట నుంచి ముత్యం రెడ్డి పనిచేశారు. కేసీఆర్‌ ముత్యంరెడ్డి ముత్తన్నా అంటూ ఆత్మీయతతో పిలుచుకుంటారు. కేసీఆర్‌ ఆహ్వానం మేరకు 2018 నవంబర్‌లో ముత్యంరెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరారు. క్యాన్సర్‌తో తీవ్ర ఆనారోగ్యంకు గురైన ముత్యంరెడ్డికి కేసీఆర్‌ అమెరికా పంపించి వైద్యం చేయించారు.

ఇద్దరు రైతు బాంధవులు ఒకేరోజు మృతి
రైతుల పక్షపాతులు.. రైతు బాంధవులు.. ఎవసం అంటే ప్రాణం అయిన దివంగత మహానేత సీఎం వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి 2009 సెప్టెంబర్‌ 2వ తేదీన మరణించగా, సరిగ్గా పదేళ్ల తర్వాత సెప్టెంబర్‌ 2 వ తేదీనే  ముత్యంరెడ్డి మృతి చెందారు.

అభివృద్ధిలో రాష్ట్రంలోనే సాటిలేని ముత్యంరెడ్డి...
అభివృద్ధిలో ముత్యంరెడ్డి రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలిచాడు. రాష్ట్ర చరిత్రలోనే దుబ్బాక నియోజకవర్గంలో ఐదు మార్కెట్‌ కమిటీలు దుబ్బాక, తొగుట, మిరుదొడ్డి, దౌల్తాబాద్, చేగుంటల్లో ఏర్పాటు చేసిన ఘనత ముత్యంరెడ్డిదే. అలాగే ఎంఎల్‌ఎస్‌ పాయింట్లు నియోజకవర్గంలో 5, నియోజకవర్గాల్లో 5 టీటీడీ కల్యాణ మండపాలు ఏర్పాటు చేశారు. కూడవెల్లి వాగుపై చెక్‌డ్యాంలు నిర్మించి భూగర్భజలాలు పెంపొందించేందుకు కృషి చేశారు. నియోజకవర్గంలో మారుమూల గ్రామాలకు తారురోడ్లు, దుబ్బాకలో బస్‌డిపో, మోడల్‌ స్కూల్స్, ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలతో పాటు అనేక అభివృద్ధి పనులు చేసిన ఘనత ముత్యంరెడ్డిది.నియోజకవర్గంలో  రైతుల సంక్షేమ కోసం చాల పథకాలు చేపట్టడడమే కాకుండా కూరగాయల సాగుపై ప్రధానంగా దృష్టి సారించడమే ప్రత్యేకంగా తొగుట మండలం నుంచి ప్రత్యేకంగా హైదరాబాద్‌ సెక్రటరియేట్‌కు ప్రత్యేకంగా కూరగాయలు రైతులు అమ్ముకునేందుకు బస్‌ సౌకర్యం ఏర్పాటు చేశారు.

మరిన్ని వార్తలు