‘జువ్వాడి’ కన్నుమూత

11 May, 2020 03:24 IST|Sakshi

ప్రభుత్వ లాంఛనాలతో స్వగ్రామంలో అంత్యక్రియలు

హరీశ్, ఈటల, కొప్పుల, జానా, జీవన్‌రెడ్డి నివాళులు

సాక్షి, జగిత్యాల: కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ మంత్రి జువ్వాడి రత్నాకర్‌రావు (92) కన్నుమూశారు. అనారోగ్యంతో కరీంనగర్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో కొంతకాలంగా చికిత్స పొందుతున్న ఆయన ఆదివారం ఉదయం తుదిశ్వాస విడిచారు. జువ్వాడి అంత్యక్రియలను ఆయన స్వస్థలం జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం తిమ్మాపూర్‌లో ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించారు. గోదావరి నది తీరంలో సాయంత్రం 5.30 గంటలకు అంత్యక్రియలు జరిగాయి. జువ్వాడి పార్థివ దేహం వద్ద మంత్రులు టి.హరీశ్‌రావు, ఈట ల రాజేందర్, కొప్పుల ఈశ్వర్, ఎర్రబెల్లి దయాకర్‌ టీఆర్‌ఎస్‌ పార్టీ పార్లమెంటరీ నేత కె.కేశవరావు, మాజీ హోం మంత్రి జానారెడ్డి, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్‌ చైర్మన్‌ బోయినపల్లి వినోద్‌కుమార్, కలెక్టర్‌ రవి, ఎమ్మెల్యేలు సంజయ్‌కుమార్, విద్యాసాగర్‌రావు, శ్రీధర్‌బాబు తదితరులు నివాళులర్పించారు.
సర్పంచ్‌ నుంచి మంత్రి దాకా..:జువ్వాడి రత్నాకర్‌రావు మొదట సర్పంచ్‌గా రాజకీయ రంగ ప్రవేశం చేశారు. 1967 నుం చి తిమ్మాపూర్‌ సర్పంచ్‌గా 12 ఏళ్లు పని చేశా రు. 1979లో జగిత్యాల బ్లాక్‌ సమితి అధ్యక్షుడిగా పని చేశారు. 1983లో జగిత్యాల నుంచి కాంగ్రెస్‌ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి టీడీ పీ అభ్యర్థి జీవన్‌రెడ్డి చేతిలో ఓటమిపాలయ్యారు. 1989లో బుగ్గారం సెగ్మెంట్‌ నుంచి కాంగ్రెస్‌ టికెట్‌ కోసం ప్రయత్నించి స్వతం త్ర అభ్యర్థిగా పోటీ చేసి రెండాకుల గుర్తుపై ఎమ్మెల్యేగా గెలిచారు. మళ్లీ 1994 ఎన్నికల్లో ఓటమి పాలైన జువ్వాడి.. 1999, 2004లో అసెంబ్లీ ఎన్నికల్లో బుగ్గారం నుంచి గెలుపొందారు. వైఎస్‌.రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్నప్పుడు 2007–09 వరకు దేవాదాయ, స్టాంప్‌ రిజిస్ట్రేషన్‌ శాఖ మంత్రిగా కొనసాగారు. ఆ తరువాత 2009లో అసెంబ్లీ సెగ్మెంట్ల పునర్విభజన తరువాత 2009, 2010 అసెంబ్లీ ఎన్నికల్లో కోరుట్ల సెగ్మెంట్‌ నుంచి పోటీ చేసి ఓటమిపాలయ్యారు. 
సీఎం కేసీఆర్‌ సంతాపం: మాజీ మంత్రి రత్నాకర్‌రావు మృతి పట్ల సీఎం కేసీఆర్‌ సంతాపం వ్యక్తంచేశారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. రత్నాకర్‌రావు అంత్యక్రియలు అధికారిక లాంచనాలతో నిర్వహించాలని ప్రభుత్వ సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ను సీఎం ఆదేశించారు. 
టీపీసీసీ నేతల సంతాపం:  రత్నాకర్‌రావు మృతి పట్ల రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలు సంతాపం ప్రకటించారు. సంతాపం తెలిపిన వారిలో  టీపీసీసీ అధ్యక్షుడు ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మల్లు భట్టి విక్రమార్క, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, ఎమ్మెల్యే జగ్గారెడ్డి, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య, టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పొన్నం ప్రభాకర్‌ తదితరులు ఉన్నారు.

రత్నాకర్‌రావు పార్థివ దేహం వద్ద 
మంత్రి హరీశ్‌ రావు తదితరులు  

మరిన్ని వార్తలు