మాజీ ఎమ్మెల్యే దేశిని కన్నుమూత

12 Nov, 2017 02:40 IST|Sakshi
దేశిని చినమల్లయ్య(ఫైల్‌)

ఇందుర్తి నుంచి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నిక

సర్పంచ్‌గా మొదలైన రాజకీయ ప్రస్థానం 

సాయుధ పోరాటం నుంచి తెలంగాణ ఉద్యమం వరకు పాత్ర 

ప్రజాప్రతినిధిగా నిరాడంబర జీవితం 

సాక్షి ప్రతినిధి, కరీంనగర్‌/హైదరాబాద్‌: తెలంగాణ సాయుధ పోరాట యోధుడు, ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ నేత, మాజీ ఎమ్మెల్యే దేశిని చినమల్లయ్య (86) శనివారం తెల్లవారుజామున కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శుక్రవారం రాత్రి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే నిమ్స్‌ ఆసుపత్రికి తరలించినా కొద్దిసేపటికే మృతి చెందారు. కరీంనగర్‌ జిల్లా చిగురుమామిడి మండలం బొమ్మనపల్లికి చెందిన చిన్న మల్లయ్య హైదరాబాద్‌లోని ఎమ్మెల్యే కాలనీలో నివాసం ఉంటున్నారు. ఆయనకు భార్య రాజేశ్వరి, నలుగురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు. 

సర్పంచ్‌ నుంచి ఎమ్మెల్యే .. 
గీతవృత్తి కార్మికుడి నుంచి దేశిని అంచెలంచెలుగా ఎదిగారు. సీపీఐ నుంచి సర్పంచ్‌ నుంచి ఎమ్మెల్యే వరకు రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగించారు. పటేల్, పట్వారీ, ఆగడాలకు వ్యతిరేకంగా ప్రజలను చైతన్యపర్చి 1957లో తొలిసారి బొమ్మనపల్లి సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. ఆ గ్రామానికి ఏకంగా 21 ఏళ్లు సర్పంచ్‌గా, హుస్నాబాద్‌ సమితి వైస్‌ ప్రెసిడెంట్‌గా పనిచేశారు. 1978 సాధారణ ఎన్నికల్లో తొలిసారి ఇందుర్తి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1985, 1989, 1994 అసెంబ్లీ ఎన్నికల్లో నెగ్గారు. 2001లో టీఆర్‌ఎస్‌లో చేరి పార్టీలో వివిధ హోదాల్లో పనిచేశారు. 2003లో ఆవిర్భవించిన తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘానికి (టీబీజీకేఎస్‌) గౌరవాధ్యక్షుడిగా వ్యవహరించారు. 2006లో టీఆర్‌ఎస్‌ను వీడి తెలంగాణ రైతాంగ సమితి ఏర్పాటు చేసిన దేశిని చినమల్లయ్య ఐదు జిల్లాల్లో కమిటీలు ఏర్పాటు చేసి రైతు సమస్యలపై ప్రత్యేక ఉద్యమాలు నిర్వహించారు. ఏడాది క్రితం వరకు వామపక్ష ఉద్యమాలు, ‘టఫ్‌’లలో పనిచేశారు. అనారోగ్యం కారణంగా కొద్దిరోజులుగా ఇంటి వద్దే ఉంటున్నారు. 

లెఫ్ట్‌ పార్టీల సంతాపం 
దేశిని మృతికి సీపీఐ, సీపీఎం సంతాపం ప్రకటించాయి. ఆయన బడుగు, బలహీన వర్గాల పక్షపాతిగా పేరు తెచ్చుకున్నారని సీపీఐ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, సుదీర్ఘ కాలం కమ్యూనిస్టు ఉద్యమంలో పనిచేశారని సీపీఎం  రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. ఈ మేరకు వేర్వేరు ప్రకటనల్లో వెల్లడించారు. ఎంపీ బి.వినోద్‌ కుమార్‌ హైదరాబాద్‌లోని దేశిని ఇంటికి వెళ్లి భౌతికకాయానికి నివాళులర్పించారు. 

ఆర్టీసీ బస్సుల్లో పయనం 
ప్రజాప్రతినిధిగా దేశిని చినమల్లయ్య నిరాడంబర జీవితం గడిపారు. నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజాసమస్యల పరిష్కారం కోసం తపించేవారు. ఎమ్మెల్యేగా ఉన్న సమయంలోనూ హైదరాబాద్‌ నుంచి కరీంనగర్‌కు, నియోజకవర్గ కేంద్రానికి ఆర్టీసీ బస్సులోనే ప్రయాణించేవారు. నియోజకవర్గం నుంచి వచ్చే ప్రజలకు అందుబాటులో కరీంనగర్‌ గణేశ్‌నగర్‌లోని బద్దం ఎల్లారెడ్డి భవన్‌లో ఉంటూ కలెక్టరేట్‌తోపాటు వివిధ కార్యాలయాలకు ఆటో రిక్షా, సైకిల్‌ రిక్షాలు, ద్విచక్ర వాహనాలపై వచ్చిన సందర్భాలు అనేకం. పీఏలు, అసిస్టెంట్లు లేకుండా స్వదసూర్తితో లేఖలు, వినతిపత్రాలు రాసేవారు.

సీఎం కేసీఆర్‌ సంతాపం..
దేశిని చిన్నమల్లయ్య మృతి పట్ల సీఎం కేసీఆర్‌ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమంలో తొలినాళ్ల నుంచి దేశిని క్రియాశీలక పాత్ర పోషించారంటూ ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

మరిన్ని వార్తలు