నెత్తుటి దారిపై శాంతియాత్ర

1 Oct, 2018 08:27 IST|Sakshi
జెండా ఊపి పాదయాత్ర ప్రారంభిస్తున్న మాజీ ఎమ్మెల్యే కోవ లక్ష్మి (ఫైల్‌)

సాక్షి, ఆసిఫాబాద్‌: అడవిలో తుపాకీ పట్టి ఉద్యమిస్తున్న మావోయిస్టులను జన జీవన స్రవంతిలోకి ఆహ్వానిస్తూ వారిని శాంతి వైపు మళ్లిస్తూ ఉద్యమ ప్రభావంతో నష్టపోతున్న ఆదివాసీలకు అవగాహన కల్పించేందుకు గాంధేయవాదులు ఓ పాదయాత్ర నిర్వహిస్తున్నారు. ఈ నెల 2న మహాత్మాగాంధీ 150వ జయంతి సందర్భంగా మావోయిస్టు కంచుకోట అయిన ఛత్తీస్‌గఢ్‌లోని జగదల్‌పూర్‌కు కాలినడకన ‘సంవిదాన్‌ యాత్ర’ పేరిట అవగాహన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత చేపడుతున్న ఈ శాంతియుత పాదయాత్రలో ముఖ్యంగా ఆదివాసీ తెగల్లో అధికంగా నలిగిపోతున్న గోండు తెగ వారు ఇందులో అధికంగా భాగస్వాములు అవుతున్నారు.

ఈ యాత్ర ఈ నెల 2న గాంధీ జయంతిని పురస్కరించుకుని ఆంధ్ర, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌ మూడు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతమైన తూర్పుగోదావరి జిల్లా చట్టి అనే ఆదివాసీ గ్రామం నుంచి ఈ పాదయాత్ర మొదలుకానుంది. ఈ యాత్రలో సెంట్రల్‌ గోండ్వానా నెట్‌ (సీజీ నెట్‌), రాజ్‌గోండ్‌ సేవా సమితి, మహాత్మాగాంధీ శబరి ఆశ్రమం, ప్రయోగ్‌ సమాజ్‌ సేవా సంస్థ తదితర సంస్థల ఆధ్వర్యంలో ఈ పాదయాత్ర కొనసాగనుంది. ఇప్పటికే ఈ యాత్రకు సంబంధించి సన్నాహాక సభలు డిల్లీ, రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్, తెలంగాణలో ఆదిలాబాద్‌ జిల్లా ఉట్నూర్‌లో జరిగాయి.

తెలంగాణ నుంచి 100 మంది ఆదివాసీలు
తెలంగాణ నుంచి 100 మంది వరకు గోండు, కోయ, కొలాం, మన్నేవార్‌ తదితర తెగల గిరిజనులు ఈ పాదయాత్రలో పాలుపంచుకొన్నారని నిర్వాహకులు చెబుతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్‌ నుంచి దాదాపు 20 మంది పాల్గొననున్నారు. శనివారం కుమురంభీం జిల్లా కేంద్రం నుంచి బయలుదేరి భద్రాచలం చేరుకుని అక్కడ ఖమ్మం, కొత్తగూడెం తదితర ప్రాంతాల నుంచి ఆదివాసీలను కలుపుకుంటూ ఈ నెల 2 వరకు తూర్పుగోదావరి జిల్లా చట్టికి చేరుకుంటారు.

అక్కడి గాంధీ ఆశ్రమంలో ఆదివాసీ సంప్రదాయాలైన కోయ కోయతూర్, డోల్‌ పేప్రె కాళి తుడుం వాయిద్యాలతో అదే రోజున యాత్ర ప్రారంభమవుతుంది. దాదాపు 200 కిలోమీటర్ల సాగనున్న ఈ పాదయాత్రలో మార్గమధ్యంలో పలు గిరిజన ఆవాసాల గుండా ప్రయాణిస్తూ ఆదివాసీలను భాగస్వామ్యం చేస్తూ ముందుకు సాగనున్నారు. 1980లో మావోయిస్టులు దండకారణ్యంలో ప్రవేశించిన దారిగుండానే ఈ పాదయాత్ర కొనసాగడం విశేషం. మొత్తం పది రోజుల పాటు సాగే ఈ పాదయాత్రలో రోజుకు 20 కిలోమీటర్ల చొప్పున ప్రయాణిస్తూ వచ్చే నెల 12న చత్తీస్‌గఢ్‌లోని బస్తర్‌ జిల్లాలోని జగదల్‌పూర్‌కు చేరుకుంటుంది. అనంతరం జిల్లా కేంద్రం బస్తర్‌లో బహిరంగ సభ ఏర్పాటు చేయనున్నారు.

మధ్య భారతంలో వామపక్ష భావజాలంతో అనేక మంది అమాయక గిరిజనులు అటు భద్రతా దళాలు, ఇటు మావోల ఉద్యమ ప్రభావంతో ప్రాణాలు పోగొట్టుకుంటున్నారని ఇరువర్గాల మధ్య నలిగిపోతున్న గిరిజనులను అవగాహన కల్పించేందుకు, మావోస్టులను జనజీవన స్రవంతిలోకి ఆహ్వానిస్తూ శాంతిబాట పట్టాలని కార్యక్రమం చేపట్టామని చెబుతున్నారు. ముఖ్యంగా ఛత్తీస్‌గఢ్‌లో పోలీసు సల్వార్‌జుడుం, మావోయిస్టులు జన్‌«థన్‌ సర్కారు పేరుతో ఇరు వర్గాల మధ్య గిరిజనులు నలిగిపోతున్నారని వారి గొంతుగా ఈ యాత్ర చేపట్టినట్లు పేర్కొంటున్నారు. అయితే ఇటీవల మావోయిస్టులు విశాఖపట్నం జిల్లా అరుకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమను కాల్చిచంపిన ఘటనతోపాటు మరికొద్ది రోజుల్లో మావోయిస్టు వారోత్సవాలు కూడా జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఈ శాంతియాత్ర ప్రాధాన్యం సంతరించుకుంది.

ఏర్పాట్లు పూర్తి
మావోయిస్తు ప్రభావిత ప్రాంతాల్లో శాంతి నెలకొల్పడానికి గాంధీ జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లోని చట్టి నుంచి ఛత్తీస్‌గఢ్‌లోని జగదల్‌పూర్‌ వరకు చేపట్టిన ఈ శాంతియాత్రకు అన్ని ఏర్పాట్లు చేశాం. ఇటీవల ఛత్తీస్‌గఢ్‌లోని తిడ్లాలో ఓ సన్నాహాక సభ కూడా నిర్వహించాం. – సుభారాన్షు చౌదరి, బస్తర్, పాదయాత్ర కమిటీ సభ్యుడు  

శాంతి నెలకొల్పేందుకే...
ఏళ్లుగా అటు భద్రతాదళాలు, ఇటు మావోయిస్టు దళాల మధ్య ఆదివాసీలు నలిగిపోతున్నారు. ఇరువర్గాల మధ్య ప్రాణాలు కోల్పోతున్నది గిరిజనులు. ఈ హింస ఇక నుంచి ఆగిపోవాలని, దండకారణ్యంలో శాంతియుత వాతావరణం నెలకొల్పేందుకే ఈ పాదయాత్ర చేపట్టాం. దీనికి అందరూ సహకరిస్తారని ఆశిస్తున్నాం. – సిడాం అర్జు, తెలంగాణ రాష్ట్ర కన్వీనర్, రాజ్‌గోండ్‌ సేవా సమితి 

మరిన్ని వార్తలు