ఇంటి స్థలం కోసం మాజీ నక్సలైట్‌ దీక్ష

4 Jul, 2018 11:07 IST|Sakshi
 పుష్ప కుమారికి మద్దతు తెలుపుతున్న నాయకులు   

మణుగూరురూరల్‌ : తనకు ప్రభుత్వం ఇచ్చిన ఇంటి స్థలాన్ని అప్పగించాలని కోరుతూ మాజీ నక్సలైట్‌ ఈట్ల పుష్పకుమారి స్థానిక అంబెడ్కర్‌ సెంటర్‌లో దీక్ష ప్రారంభించారు. మంగళవారం రెండో రోజు ఆమె దీక్షకు పలు రాజకీయపార్టీల నేతలు మద్దుతు తెలిపారు. మూడు సంవత్సరాలు నక్సల్స్‌ గ్రూప్‌లో దళ సభ్యురాలిగా పనిచేశారు.

ఆమె భర్త నవీన్‌ సైతం అదే దళంలో పనిచేసి మృతి చెందాడు. ఆరోగ్య సరిగాలేని పుష్పకుమారి ప్రభుత్వం ముందు లొంగిపోయారు. ఆమె లొంగిపోయిన సమయంలో మణుగూరు మండల కేంద్రంలోని రాజీవ్‌గాంధీనగర్‌ ప్రాంతంలోని 138 సర్వే నంబర్‌లో 3 సెంట్ల ఇంటి స్థలం కేటాయించారు. ఆమె అక్కడ ఇల్లు నిర్మిచుకోకపోవడంతో స్థానికులు కొందరు అక్కడ సమ్మక్క ఆలయం ఏర్పాటు చేశారు.

బాధితురాలు అనేక మార్లు కలెక్టర్‌ ఇతర ఉన్నతాధికారులకు విన్నవించినా పట్టించుకోకపోవడంతో దీక్షకు దిగింది. తనకు న్యాయం జరిగే వరకు ఈ దీక్షలు కొనసాగిస్తానని బాధితురాలు తెలిపారు. పుష్పకుమారి చేపట్టిన దీక్షకు మణుగూరు మండలంలోని సీపీఎం, సీపీఐ (ఎంఎల్‌) న్యూడెమోక్రసీ నేతలు సంఘీభావం తెలిపారు. పుష్ఫకుమారికి న్యాయం జరిగేవరకు తాము అండగా నిలుస్తామన్నారు.

సంఘీభావం తెలిపిన వారిలో సీపీఎం నాయకులు కాటిబోయిన నాగేశ్వరరావు, నెల్లూరి నాగేశ్వరరావు, బండి రాజేష్, నైనారు నాగేశ్వరరావు, వంకాల రాజు, నర్సింహారావు, ఎన్డీ నాయకుడు ఆర్‌ మధుసూదన్‌రెడ్డిలు ఉన్నారు.

మరిన్ని వార్తలు