నిజామాబాద్‌ మాజీ ఎంపీ కన్నుమూత

2 Feb, 2020 14:11 IST|Sakshi

సాక్షి, నిజామాబాద్ : తెలంగాణ ఉద్యమం తొలితరం నాయకుడు, నిజామాబాద్ మాజీ ఎంపీ ఎం.నారాయణరెడ్డి కన్నుమూశారు. గత 10 రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మెడికవర్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం తుదిశ్వాస విడిచారు. నారాయణ రెడ్డి మృతి పట్ల పలువురు నేతలు సంతాపం ప్రకటించారు.  ముఖ్యమంత్రి కేసీఆర్‌ నారాయణరెడ్డి మృతి పట్ల దిగ్భాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ఆయన పార్థీవ దేహానికి నివాళులర్పించారు. 

పౌర సన్మానం ఏర్పాట్లు... అంతలోనే..!
ప్రముఖ తెలంగాణవాది నారాయణరెడ్డికి ఇవాళ పౌర సన్మానం చేసేందుకు ఏర్పాట్లు జరుగుతుండగా ఆయన మరణవార్త విషాదాన్ని నింపింది. న్యాయవాదిగా కెరీర్‌ ప్రారంభించిన నారాయణరెడ్డి 1967లో నిజామాబాద్‌ నుంచి ఇండిపెండెంట్‌గా గెలిచారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఆవశ్యకత గురించి పార్లమెంట్‌లో ఏకధాటిగా 45 నిముషాలు ప్రసంగించారు. 1972లో నిజామబాద్‌ ఎమ్మెల్యేగా సేవలందించారు. నిజామాబాద్‌లో మొట్టమొదటి మహిళా కళాశాలను ఏర్పాటు చేశారు. 1969 నుంచి 2001 వరకు తెలంగాణ ఉద్యమంలో పనిచేశారు. నారాయణరెడ్డి టీఆర్‌ఎస్‌ ఉపాధ్యక్షుడిగా కూడా సేవలందించారు.

మరిన్ని వార్తలు