టీఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్యే సంచలన ఆరోపణలు

13 Oct, 2019 14:40 IST|Sakshi

సాక్షి, కరీంనగర్‌ : తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు చేస్తోన్న సమ్మె పట్ల ప్రభుత్వ వైఖరిని ఎండగడుతూ చొప్పదండి టీఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత బొడిగె శోభ తీవ్ర ఆరోపణలు చేశారు. ఆదివారం జిల్లా కేంద్రంలో జరుగుతున్న ఆర్టీసీ ధర్నాలో పాల్గొంటూ.. ఆర్టీసీని ఉత్తర, దక్షిణ తెలంగాణగా విడగొట్టి ఉత్తర తెలంగాణను పారిశ్రామికవేత్త జూపూడి రామేశ్వరరావుకు, దక్షిణ తెలంగాణను మేఘా ఇంజనీరింగ్‌ అధినేత కృష్ణారెడ్డికి అప్పగించే కుట్ర జరుగుతోందని సంచలన వ్యాఖ్యలు చేశారు. కార్మికుల సమస్యలు పరిష్కరించకుంటే మంత్రుల ఇళ్లను ముట్టడిస్తామని హెచ్చరించారు.

ఇందులో భాగంగా 11వ రోజు మంత్రుల ఇళ్ల ముందు పిండం పెడతామని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సమస్యను పరిష్కరించని మంత్రులైనా, ముఖ్యమంత్రి అయినా మనోళ్లు కాదని తేల్చి చెప్పారు. సమస్యను  సామరస్యంగా పరిష‍్కరించాలని, బెదిరింపులతో కార్మికులను రెచ్చగొట్టవద్దని ప్రభుత్వానికి హితవు పలికారు. కాగా, 2014 ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ తరపున చొప్పదండి నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన బొడిగె శోభ 2018 ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ టిక్కెట్‌ రాకపోవడంతో ఎన్నికల ముందు బీజెపీలో చేరారు.   

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు