సీఈఓకి ఫోరం ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్ లేఖ

13 Nov, 2019 14:52 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఎన్నికల ప్రచారం సందర్భంగా పెద్ద ఎత్తున డబ్బు దొరికిన వాళ్లపై కేసులు పెట్టడం లేదని ఫోరం ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ కార్యదర్శి పద్మనాభరెడ్డి మండిపడ్డారు. డిసెంబర్‌లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కోడ్‌ అమల్లో ఉన్న సమయంలో పలు పార్టీల నాయకులు, కార్యకర్తల వద్ద పట్టుకున్న డబ్బు వివరాలపై ఫోరం ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ పరిశీలన చేసిందన్నారు. అదేవిధంగా డబ్బు ఎన్నికలను శాసిస్తోందన్నారు. తెలుగు రాష్ట్రాల్లో డబ్బు విపరీతంగా పంచుతున్నారని.. డబ్బు నియంత్రణ కోసం ఎన్నికల కమిషన్ ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. ఎన్నికల సమయంలో తెలంగాణలో 640 కేసులు, సుమారు రూ. 84 కోట్ల 34 లక్షలు పట్టుకున్నారని తెలిపారు. రూ.28 కోట్లకు 159 కేసులను మాత్రమే నమోదు చేశారని పేర్కొన్నారు. కేవలం 24 శాతం మాత్రమే కేసులు పెట్టారని తెలిపారు. నమోదైన కేసుల్లో దాదాపు రూ. 56 కోట్లు వదిలేశారని ఆగ్రహించారు. ఎన్నికల నిబంధనలను సరిగా అమలు చేయటం లేదని.. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు.

ఎన్నికలు సక్రమంగా నిర్వహిస్తున్నప్పటికి.. అమలు చేస్తున్న విధానం సరిగా లేదన్నారు. ఎన్నికలు పూర్తయ్యాక ప్రతి ఆరు నెలలకు ఎన్నికల కమిషనర్‌ జిల్లా ఎస్పీలతో సమీక్ష నిర్వహించాలని సూచించారు. ఎన్నికల సమయంలో పట్టుబడిన డబ్బు, కేసులపై చర్చించాలని పద్మనాభరెడ్డి అన్నారు. ఓటర్లను ప్రలోభ పెట్టడానికి తెచ్చిన డబ్బును ఐటీకి బదిలీ చేయటం సరికాదన్నారు. భారీగా డబ్బు పట్టుబడినప్పటికీ ఎన్నికల్లో పోటీ చేసిన ఏ అభ్యర్థిపై కేసులు నమోదు చేయకపోవటంపై ప్రశ్నించారు. ఎన్నికల సందర్భంగా డబ్బు పాత్రను తగ్గించుటకు ఎన్నికల కమిషన్‌ చేపట్టిన చర్యలు తెలంగాణ రాష్ట్రలో సరైన ఫలితాలు ఇవ్వలేదని ఫోరం ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ విశ్లేషణలో తేలిందన్నారు. 

ఇప్పటికైనా ఎన్నికల్లో పట్టుకున్న డబ్బుపై విచారణ పూర్తి చేసి కేసు నమోదు చేయాలన్నారు. కేసు నమోదు చేసిన వివరాలను మీడియాలో తెలిపాలని ఆయన అభిప్రాయపడ్డారు. నమోదు చేసిన కేసులను రాష్ట్ర చీఫ్ ఎలక్షన్ కమిషనర్ తరచుగా పోలీసు అధికారులతో విశ్లేషించి.. ఆ కేసులన్నింటికి త్వరగా తీర్పు వచ్చేటట్టు చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఈ మేరకు ఫోరం ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌  కార్యదర్శి పద్మనాభరెడ్డి ఎన్నికల కమిషనర్‌కి లేఖ రాశారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు