ఖాకీల్లో దడ..

29 May, 2020 09:19 IST|Sakshi

సైబరాబాద్‌ పరిధిలో నలుగురు ట్రాఫిక్‌ కానిస్టేబుళ్లకు పాజిటివ్‌

సిటీ కమిషనరేట్‌లో 8 మంది కరోనా బాధితులు కంటైన్మెంట్‌

ప్రాంతాల్లో విధులు నిర్వర్తించిన ఫలితం  

పోలీస్‌ శాఖలో కోవిడ్‌ దడ పుట్టిస్తోంది. ఆ శాఖలో పెరుగుతున్న పాజిటివ్‌ కేసులు వణుకు పుట్టిస్తున్నాయి. కరోనా కట్టడికి విధులు నిర్వర్తించేవారే ఇప్పుడు దాని బాధితులుగా మారుతుండటం కలవరానికి గురి చేస్తోంది. మొన్నటి దాకా హైదరాబాద్, రాచకొండ పోలీసు కమిషనరేట్ల సిబ్బందికే పరిమితమైన ఈ వైరస్‌.. ఇప్పుడు సైబరాబాద్‌ కమిషనరేట్‌ను కూడా తాకింది. మదీనాగూడ, మియాపూర్, మణికొండ, నార్సింగి ప్రాంతాల్లోని ట్రాఫిక్‌ కానిస్టేబుళ్లకు కరోనా పాజిటివ్‌ వచ్చినట్లు రంగారెడ్డి జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారులు ధ్రువీకరించారు. సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో నలుగురు, నగర పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో ఎనిమిది మందిలో కరోనా లక్షణాలు కనిపించాయి.

సాక్షి, సిటీబ్యూరో: కరోనా మహమ్మారి పోలీసు శాఖను వెంటాడుతోంది. మొన్నటివరకు హైదరాబాద్, రాచకొండ పోలీసు కమిషనరేట్ల పోలీసు సిబ్బందికి పరిమితమైన ఈ  ఇప్పుడు సైబరాబాద్‌ కమిషనరేట్‌ను తాకింది. కరోనా నియంత్రణకు ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌ నిబంధనలు అమలు చేస్తున్న సిబ్బందినే ఇప్పుడు కలవరపాటుకు గురిచేస్తోంది. ఇప్పటికే బాలాపూర్‌ నుంచి గచ్చిబౌలిలోని సైబరాబాద్‌ పోలీసు కమిషనరేట్‌కు వచ్చే ఓ ట్రాఫిక్‌ సీఐకి జ్వరం రావడంతో హోం క్వారంటైన్‌కు పరిమితం కావాలని సూచించిన కొన్ని రోజుల్లోనే వివిధ ప్రాంతాల్లో నివాసముంటున్న ట్రాఫిక్‌ కానిస్టేబుళ్లకు బుధవారం కరోనా పాజిటివ్‌ నిర్ధారణ కావడం సిబ్బందిని కలవరపాటుకు గురిచేస్తోంది. మదీనాగూడ, మియాపూర్, మణికొండ, నార్సింగి ప్రాంతాల్లో ఉంటున్న ట్రాఫిక్‌ కానిస్టేబుళ్లకు కరోనా పాజిటివ్‌ వచ్చినట్లు రంగారెడ్డి జిల్లా వైద్యఆరోగ్య శాఖ అధికారులు ధ్రువీకరించారు. దీంతో గత గచ్చిబౌలిలోని సైబరాబాద్‌ పోలీసు కమిషనరేట్‌ను శానిటైజ్‌ చేశారు. అయితే గురువారం మాత్రం కొందరు సిబ్బంది విధులకు హాజరయ్యారు.  ఇదిలాఉండగా హైదరాబాద్‌ నగర పోలీసు కమిషనరేట్‌ పరిధిలోని వివిధ ఠాణాల్లో పనిచేస్తున్న ఎనిమిది మందికి కరోనా పాజిటివ్‌ రావడంతో మరింత ఆందోళన మొదలైంది.(గ్రేటర్‌లో 58 కేసులు.. అదే స్థాయిలో మరణాలు)

లాక్‌ డౌన్‌ విధుల్లో ఉన్నవారికే..
లాక్‌డౌన్‌ సమయంలో  ఏర్పాటు చేసిన కోవిడ్‌ కంట్రోల్‌ రూమ్‌లో లా అండ్‌ అర్డర్‌ విభాగంతో పాటు ట్రాఫిక్‌ విభాగ సిబ్బంది కూడా విధులు నిర్వర్తించారు. ఆంధ్రప్రదేశ్, బీహర్, చత్తీస్‌గఢ్‌ , ఉత్తరప్రదేశ్, ఒడిశా, అస్సాం, మణిపూర్‌ తదితర రాష్ట్రాలకు చెందిన వలస కార్మికులకు పాసులు జారీ చేయడం మొదలు రైలులో పంపించే వరకు కొందరు సిబ్బంది చురుగ్గా పనిచేశారు. అయితే కోవిడ్‌ కంట్రోల్‌ రూమ్‌లో విధులు నిర్వర్తించిన ఓ సీఐ బాలాపూర్‌ నుంచి సైబరాబాద్‌ పోలీసు కమిషనరేట్‌కు వచ్చేవారు. అతనికి జ్వరం, దగ్గు లక్షణాలు కనిపించడంతో హోం క్వారంటైన్‌లో ఉండాలని ఉన్నతాధికారులు సూచించారు. ఇక అంతా సమసినట్టే అనుకుంటున్న తరుణంలో నలుగురు ట్రాఫిక్‌ కానిస్టేబుళ్లకు కరోనా పాజిటివ్‌ రావడంతో సిబ్బందిలో ఆందోళన మొదలైంది. అయితే విధులకు హాజరయ్యే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్క్‌ ధరించడంతో పాటు చేతులను ఎప్పటికప్పుడు శానిటైజ్‌ చేసుకోవాలని, భౌతిక దూరం పాటించాలని ఉన్నతాధికారులు సూచిస్తున్నారు. నలుగురికి చెప్పాల్సిన మనమే కోవిడ్‌ జాగ్రత్తలు పాటించడంలో నిర్లక్ష్యం చేయకూడదని కోరారు.(ఆ కవలలకు కరోనా లేదు)

కింగ్‌కోఠి క్వారంటైన్‌ వైపు...
హైదరాబాద్‌ నగర పోలీసు కమిషనరేట్‌ పరిధిలోని ఓ జోన్‌లోని కొందరు పోలీసులు కరోనా పాజిటివ్‌ వచ్చిన పోలీసు సిబ్బందితో క్లోజ్‌ కాంటాక్టులో ఉన్నందున పరీక్షలు చేయమని కింగ్‌కోఠి క్వారంటైన్‌ కేంద్రానికి వెళుతున్నారు. కాగా ఇప్పటికే దయాకర్‌రెడ్డి అనే కానిస్టేబుల్‌ కరోనాతో మృతి చెందడం, మరికొంత మందికి పాజిటివ్‌ వచ్చి డిశ్చార్జి అయిన విషయం తెలిసిందే. 

ఓయూ పీఎస్‌లో ఒకరికి..
కుషాయిగూడ: మీర్‌పేట్‌–హెచ్‌బీకాలనీ డివిజన్‌ , కృష్ణానగర్‌ కాలనీలో ఉంటున్న ఓ కానిస్టేబుల్‌కు గురువారం కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. ఓయూ  పోలీస్‌ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న ఆయన బుధవారం గాంధీ ఆసుపత్రికి  పరీక్షలు చేయించుకోగా పాజిటివ్‌గా ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో అధికారులు అతడిని ఆసుపత్రికి తరలించారు. అతడి కుటుంబ భార్య, ఇద్దరు పిల్లలను కింగ్‌కోఠి ఆసుపత్రి క్వారంటైన్‌కు తరలించారు.

అప్రమత్తతే శ్రీరామ రక్ష...
నగరంతో పాటు శివారు ప్రాంతాల్లో లా అండ్‌ అర్డర్, ట్రాఫిక్‌ సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్న సమయంలో వాహనదారులను ఆపి అతి దగ్గరగా మాట్లాడడం వారి పాలిట శాపంగా మారుతోంది. కొందరు సిబ్బంది మాస్క్‌లు ధరించడంలో కూడా నిర్లక్ష్యం ఉండటం వారిని ప్రమాదంలోకి నెడుతోంది. ఉన్నతస్థాయి అధికారులు పదేపదే చెబుతున్నా పట్టించుకోకపోవడం పోలీసుశాఖనే ప్రమాదంలోకి నెడుతుందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా రోడ్లతో పాటు ఎక్కడా విధులు నిర్వర్తించినా కరోనా జాగ్రత్తలు పాటించాలని నగరవాసులు కోరుతున్నారు.  

అఫ్జల్‌గంజ్‌ పీఎస్‌లో ముగ్గురు పోలీసులకు ..
అఫ్జల్‌గంజ్‌: అఫ్జల్‌గంజ్‌ పోలీస్‌ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న ముగ్గురు పోలీసులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. పోలీస్‌ స్టేషన్‌లో పని చేస్తున్న ఓ హెడ్‌ కానిస్టేబుల్‌తో పాటు మరో ఇద్దరు కానిస్టేబుళ్లు జనరల్‌ డ్యూటీలు చేస్తున్నారు. ఇటీవల వారు అనారోగ్యం పాలవడంతో వారి నమూనాలు సేకరించి పరీక్షించగా కరోనా పాజిటివ్‌ వచ్చింది. దీంతో వారిని    గాంధీ ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నట్లు అఫ్జల్‌గంజ్‌ ఎస్సై (అడ్మిన్‌) లచ్చిరెడ్డి తెలిపారు.

‘గాంధీ’ సెక్యురిటీ కానిస్టేబుల్‌కు..
రామంతాపూర్‌: సికింద్రాబాద్‌ గాంధీ ఆస్పత్రిలోని సెక్యూరిటీ వింగ్‌లో కానిస్టేబుల్‌గా పనిచేసే వ్యక్తికి గురువారం కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. కరోనా లక్షణాలు కనిపించడంతో ఆయన నేరుగా గాంధీ ఆస్పత్రికి  వెళ్లి చికిత్స చేయించుకుంటున్నట్లు సమాచారం. జీహెచ్‌ఎంసీ సిబ్బంది వెంకట్‌రెడ్డినగర్‌లోని అతడి ఇంటి పరిసరాలను కంటైన్మెంట్‌గా ప్రకటించారు.

శాలిబండ పీఎస్‌లో ఒకరికి..
దూద్‌బౌలి: పురానాపూల్‌ డివిజన్, గల్భవీధిలో ఉంటున్న వ్యక్తి శాలిబండ పీఎస్‌లో కానిస్టేబుల్‌గా పని చేస్తున్నాడు. గురువారం అతడికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో  వైద్య సిబ్బంది అతడి  కుటుంబ సభ్యుల ను పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

మంగళ్‌హాట్‌ పీఎస్‌లో కానిస్టేబుల్‌కు..
అబిడ్స్‌: మంగళ్‌హాట్‌ పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వహించే కానిస్టేబుల్‌(27)కు కరోనా పాజిటీవ్‌ నిర్ధారణ అయ్యింది. చుడిబజార్‌ నగర్‌ఖానా ప్రాంతంలో నివసించే అతను గత  కొన్ని రోజులుగా కంటైన్మెట్‌ ప్రాంతాల్లో విధులు నిర్వహించాడు. ఇటీవల జ్వరంతో బాధపడుతున్న అతడికి   వైద్య పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో అతడిని గాంధీ ఆసుపత్రికి తరలించారు.

మరిన్ని వార్తలు