రూ. 4 కోట్ల సిగరెట్లు దోపిడీ

21 Aug, 2017 02:02 IST|Sakshi
చోరీకి గురైన కంటైనర్‌
  • సిగరెట్ల లారీని అటకాయించి బెదిరింపులు
  • డ్రైవర్‌ను కొట్టి.. సమీపంలోని గుట్టల్లోకి లారీని తీసుకెళ్లి
  • మరో లారీలోకి సరుకంతా మార్చేసుకున్న దుండగులు
  • రంగారెడ్డి జిల్లా చౌటుప్పల్‌ వద్ద ఘటన..
  • రాష్ట్రవ్యాప్తంగా సంచలనం..
  • చౌటుప్పల్, హైదరాబాద్‌: శనివారం అర్ధరాత్రి.. హైదరాబాద్‌–విజయవాడ జాతీయ రహదారి..  దారిపక్కన రెండు సుమోలు కాచుకుని ఉన్నాయి.. వాటిల్లో ఉన్న 20 మంది అటుగా వస్తున్న ఓ లారీని  అటకాయించారు.. డ్రైవర్‌ను చితకబాది లారీని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లారు.. అందులోని  రూ.4 కోట్ల విలువైన సిగరెట్లను దోచుకున్నారు.. అప్పటికే సిద్ధం చేసుకున్న మరో లారీలోకి ఆ  సిగరెట్ల పెట్టెలను వేసుకుని ఉడాయించారు.. నిత్యం రద్దీగా ఉండే రంగారెడ్డి జిల్లా పెద్దఅం బర్‌పేట వద్ద పక్కాగా సినీ ఫక్కీలో ఈ సంచలన దోపిడీ జరగడం గమనార్హం.

    పక్కా ప్రణాళికతో..
    హైదరాబాద్‌లోని ముషీరాబాద్‌లో ఉన్న ఐటీసీ కంపెనీ నుంచి శనివారం అర్ధరాత్రి ఒక లారీ సిగరెట్ల  కాటన్లను తీసుకుని.. ఆంధ్రప్రదేశ్‌లోని రేణిగుంటకు బయలుదేరింది. జాతీయ రహదారిపై పెద్ద అం బర్‌పేట వద్ద నిర్మానుష్య ప్రాంతానికి ఆ లారీ చేరుకోగానే.. అప్పటికే అక్కడ కాపుకాస్తున్న సుమారు 20 మంది దుండగులు దానిని ఆపారు. బిహార్‌కు చెందిన డ్రైవర్‌ అఖిలేశ్‌యాదవ్‌ (35)ను  చితకబాది లారీని లాక్కున్నారు. ఈ లారీతో పాటు తాము అప్పటికే సిద్ధం చేసుకున్న కంటైనర్‌ లారీని తీసుకుని చౌటుప్పల్‌ ప్రాంతం వైపు వచ్చారు. ఇంకా ముందుకు వెళ్తే టోల్‌ప్లాజా వద్ద పోలీసుల  తనిఖీలు, సీసీ కెమెరాలతో ప్రమాదం ఉంటుందని గ్రహించి... దండుమల్కాపురం గ్రామ శివార్లలోని  గుట్టల ప్రాంతం వైపు తీసుకెళ్లారు.

    సిగరెట్లన్నింటినీ వేసుకుని..
    దండుమల్కాపురం గ్రామ శివార్లలోని గుట్టల ప్రాంతంలో రెండు లారీలను నిలిపి.. సిగరెట్ల కాటన్లను  తమ కంటైనర్‌ లారీలోకి మార్చుకున్నారు. లారీ డ్రైవర్‌ కళ్లకు గంతలు కట్టి..  చేతులు, కాళ్లు కట్టేశారు. ఆ లారీని చౌటుప్పల్‌ వైపు తీసుకొచ్చి ఖైతాపురం వద్ద వదిలేశారు.  తమ కంటైనర్‌ను తీసుకుని పారిపోయారు. అయితే చివరకు ఎలాగో కట్లు విప్పుకున్న లారీ  డ్రైవర్‌ అఖిలేశ్‌యాదవ్‌.. సమీపంలోని దాబా హోటళ్ల వద్దకు చేరుకుని, వారి సాయంతో పోలీసులకు సమాచారమిచ్చాడు.


    దీంతో రాచకొండ పోలీస్‌ జాయింట్‌ కమిషనర్‌ తరుణ్‌జోషి, క్రైం డీసీపీ జానకి, భువనగిరి డీసీపీ పాలకుర్తి యాదగిరి తదిత  రులు ఘటనా స్థలాన్ని సందర్శించి..  వివరాలు సేకరించారు. వేలి ముద్రల నిపుణులు, డాగ్‌స్క్వాడ్‌తో ఆధారాలు సేకరించారు. దొంగలను పట్టుకొ నేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఈ దొంగలు పాతవారేనా? కొత్తగా  ఏదైనా ముఠా ఈ ప్రాంతానికి వచ్చిందా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

    ఇది రెండో ‘సిగరెట్‌’ దోపిడీ
    2012 అక్టోబర్‌ 18న చౌటుప్పల్‌ మండలంలోని కొయ్యలగూడెం శివారులో కూడా సిగరెట్ల లారీ చోరీకి  గురైంది. అప్పట్లో రూ.19 లక్షల విలువైన సిగరెట్లను దోచుకెళ్లారు. దీనికి పాల్పడిన 11 మంది  దొంగలను పోలీసులు అదే ఏడాది నవంబర్‌లో అరెస్టు చేశారు. వారంతా నల్లగొండ జిల్లాలోని మర్రిగూడెం, చింతపల్లి మండలాలకు చెందినవారే.

మరిన్ని వార్తలు