సైబర్‌ పంజా

1 May, 2020 09:31 IST|Sakshi

లాక్‌డౌన్‌లోనూ నేరగాళ్ల చేతివాటం

నిండా మునుగుతున్న బాధితులు  

ఒక్కరోజే వెలుగులోకి నాలుగు కేసులు  

సాక్షి, సిటీబ్యూరో: కరోనా టైమ్‌లోనూ సైబర్‌ నేరాలు తగ్గడం లేదు. బాధితుల అమాయకత్వం, అలసత్వం, నిర్లక్ష్యాన్ని ఆసరాగా చేసుకుని సైబర్‌ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. వివిధ రకాల  సైబర్‌ నేరాల్లో రూ.1.9 లక్షలు పోగొట్టుకున్న నలుగురు బాధితులు గురువారం సిటీ సైబర్‌ క్రైమ్‌ ఏసీపీ కేవీఎం ప్రసాద్‌ను ఆశ్రయించారు. కేసులు నమోదు చేసుకున్న అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. ఆ వివరాలు ఇవీ..

సైదాబాద్‌ ప్రాంతానికి చెందిన యువకుడు ఓ డిజిటల్‌ మార్కెటింగ్‌ సంస్థలో పని చేస్తున్నాడు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌కు పరిమితమయ్యాడు. ఇతడికి తన యజమాని మాదిరిగా నకిలీ ఈ– మెయిల్‌ పంపిన సైబర్‌ నేరగాళ్లు రూ.20 వేలు కాజేశారు. సైబర్‌ నేరగాళ్లు అతడి యజమాని పేరును డిప్‌ప్లే నేమ్‌గా వినియోగించి మరో ఈ–మెయిల్‌ ఐడీ సృష్టించారు. దీని ఆధారంగా మూడు రోజుల క్రితం ఓ మెసేజ్‌ పంపారు. ‘నేను రెండు గంటల పాటు అత్యవసర మీటింగ్‌లో ఉంటున్నా. అర్జంట్‌గా ఈ ఖాతాలోకి రూ.20 వేలు బదిలీ చెయ్‌’ అంటూ ఉంది. కేవలం డిస్‌ప్లే నేమ్‌ చూసిన యువకుడు ఇది తన యజమాని నుంచే వచ్చిందని భావించి ఆ మొత్తం బదిలీ చేశాడు. బుధవారం మళ్లీ అదే తరహాలో మెయిల్‌ పంపిన సైబర్‌ క్రిమినల్స్‌ రూ.30 వేలు పంపమన్నారు. దీంతో అనుమానం వచ్చిన బాధితుడు తన యజమానిని సంప్రదించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. నేరానికి ముందు నిందితులు బాధితుడు లేదా అతడి యజమాని మెయిల్‌ను హ్యాక్‌ చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.

నగరానికి చెందిన ఓ వ్యక్తి తన వ్యాక్యూమ్‌ క్లీనర్‌ను విక్రయించాలని భావించి వివరాలను ఓఎల్‌ఎక్స్‌లో పోస్టు చేశాడు. దీనిని చూసిన సైబర్‌ నేరగాళ్లు ఖరీదు చేయడానికి ఆసక్తి ఉందంటూ కాల్‌ చేశారు. బేరసారాల తర్వాత వ్యాక్యూమ్‌ క్లీనర్‌ కొనడానికి అంగీకరించారు. దానిని తీసుకోవడానికి తన సోదరుడు వస్తాడని చెప్పిన నేరగాడు గూగుల్‌ పే ద్వారా అడ్వాన్స్‌ చెల్లిస్తానని చెప్పారు. దీంతో బాధితుడు తన సోదరి ఫోన్‌ నంబర్‌ ఇచ్చాడు. దీనికి సైబర్‌ నేరగాడు తన గూగుల్‌ పే ఖాతా నుంచి రూ.5 వేలకు మనీ రిక్వెస్ట్‌ పంపాడు. దీన్ని ఆమె యాక్సెప్ట్‌ చేయడంతో ఖాతాలోకి వెళ్లిపోయాయి. దీంతో అతను సైబర్‌ నేరగాడిని సంప్రదించగా, మీకు ఇవ్వాల్సిన రూ.5 వేలు, పొరపాటున వచ్చిన రూ.5 వేలకు కలిపి రూ.10 వేలు పంపిస్తున్నానని చెప్పాడు. ఆపై రూ.10 వేలకు రిక్వెస్ట్‌ పంపి ఆ మొత్తం కాజేశాడు. మరో రెండుసార్లు చేసి మొత్తం రూ.75 వేలు కాజేశాడు. 

కోవిడ్‌ నేపథ్యంలో పురానాపూల్‌కు చెందిన ఓ వ్యక్తి హోల్‌సేల్‌గా మాస్కులు తయారు చేసి విక్రయిస్తున్నాడు. ఈ మేరకు జస్ట్‌ డయల్‌లో తన కుమార్తె ఫోన్‌ నంబర్‌తో వివరాలు పొందుపరిచాడు. దీని ఆధారంగా ఆమెకు కాల్‌ చేసిన సైబర్‌ నేరగాడు తనకు 25 వేల మాస్కులు కావాలని కోరాడు. అడ్వాన్స్‌ ఇవ్వాలని చెప్పడంతో గూగుల్‌ పే ద్వారా పంపిస్తున్నట్లు తెలిపాడు. ఆమెకు రూ.50 వేలకు క్యూఆర్‌ కోడ్‌ పంపిన నేరగాడు దాన్ని స్కాన్‌ చేయించి, ప్రొసీడ్‌ టు పే యాక్సెప్ట్‌ చేసేలా చేశాడు. దీంతో ఆమె ఖాతా నుంచి రూ.50 వేలు సైబర్‌ నేరగాడికి చేరిపోయాయి. ఈ విషయం అతడికి ఫోన్‌ చేసి చెప్పిన బాధితురాలు డబ్బు రిటర్న్‌ చేయాలని కోరింది. ఆ ప్రయత్నాలు చేస్తున్నానని, మీ నంబర్‌తో సాధ్యం కావట్లేదని చెప్పాడు. దీంతో ఆమె తన తండ్రి నంబర్‌ ఇచ్చింది. దానికి మరో క్యూఆర్‌ కోడ్‌ పంపాడు. దాన్నీ స్కాన్‌ చేయించి మరో రూ.5500 కాజేశాడు. మొత్తం 55,500 పోగొట్టుకున్న బాధితులు సైబర్‌ క్రైమ్‌ పోలీసులను ఆశ్రయించారు.

జూబ్లీహిల్స్‌కు చెందిన వ్యక్తి బైక్‌ ఖరీదు చేయాలని భావించాడు. ఓఎల్‌ఎక్స్‌లో ఉన్న యాక్టివా 5జీ నచ్చడంతో అందులో ఉన్న నంబర్‌లో సంప్రదించాడు. ఇతడితో బేరసారాలు చేసిన ఎదుటి వ్యక్తి అడ్వాన్స్‌తో పాటు రకరకాల పేర్లు చెప్పి రూ.78 వేలు కాజేశాడు. ఇందులో చాలా మొత్తం వాహనంతో పాటు రీఫండ్‌ వస్తుందని చెప్పి టోకరా వేశాడు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు