వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో నలుగురి మృతి

3 May, 2017 02:48 IST|Sakshi
వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో నలుగురి మృతి

చివ్వెంల(సూర్యాపేట): గుర్తు తెలియని వాహనం ఢీకొని ఒకరు మృతి చెందగా.. ఇద్దరికి తీవ్రగాయాలైన సంఘటన మండల పరిధిలోని అక్కలదేవిగూడెం గ్రామశివారులో సూర్యాపేట–ఖమ్మం రహదారిపై సోమవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం పట్టణంలోని ప్రకాశ్‌నగర్‌కు చెందిన షేక్‌ తాజుద్దీన్‌(25) లారీడ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. నెల రోజులుగా మండల పరిధిలోని కుడకుడ గ్రామంలోని అత్తగారి ఇంటి వద్ద భార్యపిల్లలతో కలిసి ఉంటున్నాడు.

సోమవారం రాత్రి భార్యతో ఘర్షణ పడి ఇద్దకు కుమారులు హయన్, రియాజ్‌లను తీసుకుని బైక్‌పై ఖమ్మం వెళ్తుండగా మార్గమధ్యంలోని అక్కలదేవిగూడెం శివారులో సూర్యాపేట నుంచి ఖమ్మం వైపు వెళ్తున్న గుర్తుతెలియని వాహనం బైక్‌ను ఢీకొట్టింది. ఈప్రమాదంలో తాజుద్దీన్‌ అక్కడిక్కడే మృతిచెందగా, కుమారులు ఇద్దరికి తీవ్రగాయలయ్యాయి. క్షతగాత్రులను 108లో సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. పెద్ద కుమారుడు హయన్‌ పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్‌కు తరలించారు. ఈ మరకు మేరకు ఎస్‌ఐ బి.ప్రవీన్‌కుమార్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
భువనగిరిఅర్బన్‌: రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందిన సంఘటన సోమవారం రాత్రి కూనూరులో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని కేసారం గ్రామానికి చెందిన రాజబోయిన అనిల్‌(25) కూలిపని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అనిల్‌ సోమవారం రాత్రి రాయగిరి నుంచి కేసారం గ్రామానికి తన బైకుపై బయల్దేరాడు. కూనూరు గ్రామశివారులో రోడ్డుపై నిలిపిఉన్న ట్రాక్టర్‌ను వెనుకనుంచి ఢీ కిట్టాడు. దీంతో అనిల్‌ అక్కడిక్కడే మృతిచెందాడు. భువనగిరి రూరల్‌ పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. అనిల్‌ భార్య శిరిష ఫిర్యాదు మేరకు ట్రాక్టర్‌ డ్రైవర్‌పై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తునట్లు రూరల్‌ ఎస్‌ఐ రాజశేఖర్‌ తెలిపారు.

వంగపల్లి వద్ద ఒకరు..
యాదగిరిగుట్ట(ఆలేర): వరంగల్‌– హైదరాబాద్‌ జాతీయ రహదారిపై సోమవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఒకరు మృతి చెందగా.. మరొకరికి గాయాలైలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. హన్మకొండఅర్బన్‌ జిల్లాకు చెందిన బొయపాటి దీక్షిత్‌రెడ్డి, బాసాని ప్రణయ్‌ వరంగల్‌ నుంచి హైదరాబాద్‌ వైపు ద్విచక్రవాహనంపై వెళ్తున్నారు. యాదగిరిగుట్ట మండలం వంగపల్లి వద్దకు రాగానే గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టింది. ఈ ఘటనలో బోయపాటి దీక్షిత్‌రెడ్డి, బాసాని ప్రణయ్‌కి తీవ్రగాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో గాంధీ ఆస్పతికి తరలిస్తుండగా దీక్షిత్‌రెడ్డి మార్గమధ్యంలో మృతిచెందాడు.

బాహుపేట వద్ద..
యాదగిరిగుట్ట మండలం బాహుపేట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. ఈస్ట్‌ మారెడ్‌పల్లికి చెందిన వల్లపు ఎల్లయ్య బైక్‌పై వరంగల్‌ వైపు వెళ్తున్నారు. బాహుపేట వద్దకు రాగానే ఎల్లయ్య వాహనాన్ని గుర్తు తెలియని కారు ఢీ కొట్టింది. ఈ ఘటనలో పుల్లయ్య అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ రెండు ప్రమాదాలు జరిగిన ప్రదేశాలను యాదగిరిగుట్ట పోలీసులు పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ–2 నాగిరెడ్డి తెలిపారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా