నగరంపై కేరళ ప్రభావం! 

17 Aug, 2018 02:05 IST|Sakshi

     కొన్ని రైళ్ల పాక్షిక రద్దు, మరికొన్ని మళ్లింపు

     నాలుగు విమాన సర్వీసులు రద్దు  

సాక్షి, హైదరాబాద్‌: భారీ వర్షాలు, పోటెత్తుతున్న వరదల కారణంగా కేరళ మొత్తం అతలాకుతలంగా మారింది. హైదరాబాద్‌ నుంచి కేరళకు రాకపోకలు సాగించాల్సిన పలు రైళ్లు, విమాన సర్వీసులపై సైతం ఈ ప్రభావం పడింది. కేరళకు నడిపే పలు రైళ్లను దక్షిణ మధ్యరైల్వే పాక్షికంగా రద్దు చేయగా, కొన్నింటిని దారి మళ్లించింది. దీనికితోడు నాలుగు విమాన సర్వీసులు కూడా రద్దయ్యాయి. 

పాక్షికంగా రద్దయిన రైళ్లు 
భారీ వర్షాల కారణంగా తిరువనంతపురం డివిజన్‌లో పలు చోట్ల ట్రాక్‌లు దెబ్బతినడంతో ఇప్పటికే పలు రైళ్లు రద్దయ్యాయి. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో రద్దయిన రైళ్ల వివరాలు ఇలా ఉన్నాయి. 
- ఆగస్టు 15న హైదరాబాద్‌ నుంచి బయల్దేరిన హైదరాబాద్‌ – ఎర్నాకుళం స్పెషల్‌ రైలును, ఆగస్టు 17న ఎర్నాకుళంలో బయల్దేరాల్సిన ఎర్నాకుళం– హైదరాబాద్‌ స్పెషల్‌ రైలును పొడనూరు– ఎర్నాకుళం మధ్య పాక్షికంగా రద్దు చేశారు. 
- నేడు కాచిగూడ నుంచి ఉదయం 6 గంటలకు బయల్దేరాల్సిన కాచిగూడ– మంగళూరు సెంట్రల్‌ ఎక్స్‌ప్రెస్‌ రద్దు 

దారి మళ్లించినవి.. 
- ఆగస్టు 14న బయల్దేరిన షాలీమార్‌– త్రివేండ్రం సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ను ఈరోడ్, దిండిగల్, మధురై, తిరునల్వేలి, నాగర్‌కోలి స్టేషన్ల మీదుగా మళ్లించారు.  
-  ఆగస్టు 16న కన్యాకుమారి నుంచి బయల్దేరిన కన్యాకుమారి– సి.శివాజీ మహరాజ్‌ టెర్మినల్‌ మెయిల్‌ ఎక్స్‌ప్రెస్, ఆగస్టు 16న త్రివేండ్రం నుంచి బయల్దేరాల్సిన త్రివేండ్రం– హైదరాబాద్‌– శబరీ ఎక్స్‌ప్రెస్, త్రివేండ్రం– న్యూఢిల్లీ– కేరళ ఎక్స్‌ప్రెస్‌లను నాగర్‌కొలి, తిరునల్వేలి, మధురై, దుండిగల్, ఈరోడ్‌ స్టేషన్ల మీదుగా దారి మళ్లించారు. 

ఆలస్యంగా నడిచినవి 
నాందేడ్‌ డివిజన్‌లో కొన్ని రైళ్లను భారీ వర్షాల కారణంగా రీషెడ్యూల్‌ చేశారు. ఆదిలాబాద్‌– పూర్ణా ప్యాసింజర్‌ (3 గంటలు) , ఆదిలాబాద్‌ – తిరుపతి కృష్ణా ఎక్స్‌ప్రెస్‌ (2.15 గంటలు), పూర్ణా– అకోలా ప్యాసింజర్‌ (2.30 గంటలు) 

నాలుగు విమాన సర్వీసులు రద్దు 
కేరళలోని కొచ్చి ఎయిర్‌పోర్టు రన్‌వేపై భారీగా వరద నీరు నిలిచిపోయింది. ఈ కారణంగా హైదరాబాద్‌లోని శంషాబాద్‌ నుంచి కొచ్చి వెళ్లాల్సిన నాలుగు విమానాలు గురువారం రద్దయ్యాయి. ఈ నాలుగు విమానాలూ ఇండిగోకు చెందినవని సమాచారం. 

మరిన్ని వార్తలు