నలుగురు ఇంటర్‌ విద్యార్థుల ఆత్మహత్య

21 Apr, 2019 01:13 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌/ధర్మపురి/మాచారెడ్డి: రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాల్లో నలుగురు ఇంటర్మీడియట్‌ విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. వార్షిక పరీక్షల్లో ఫెయిల్‌కావడంతో మానసికంగా కుంగిపోయి బలవన్మరణాలకు పాల్పడ్డారు. వీరిలో ఇద్దరు విద్యార్థినులున్నారు. ఆత్మహత్యకు పాల్పడినవారిలో జగిత్యాల జిల్లాలో ఇద్దరు, హైదరాబాద్, కామారెడ్డి జిల్లాల్లో ఒక్కొక్కరు ఉన్నారు. హైదరాబాద్‌ శ్రీనగర్‌ కాలనీలోని వాసవీభువన అపార్ట్‌మెంట్స్‌లో నివసించే «ధనుంజయనాయుడు, విజయలక్ష్మి కుమారుడు ధర్మారాం(17) అమీర్‌పేట నారాయణ కాలేజీలో ఇంటర్‌ రెండో సంవత్సరం చదువుతున్నాడు. ఈ నెల 18న వెలువడిన పరీక్షాఫలితాల్లో గణితంలో ఫెయిలయ్యాడు. మొబైల్‌ఫోన్, ఐప్యాడ్‌ వాడటం వల్లే చదువులో వెనుకబడిపోయావని, ఇక నుంచి వాటిని వాడవద్దని కుటుంబసభ్యులు అతడిని హెచ్చరించారు. కొద్దిసేపటికే ధర్మారాం అపార్ట్‌మెంట్‌ ఆరో అంతస్తు నుంచి కిందకు దూకాడు. రక్తమడుగులో ఉన్న అతడిని వెంటనే సోమాజిగూడ యశోదా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. ధర్మారాం ఆంధ్రప్రదేశ్‌కి చెందిన ఎంపీ సీఎం రమేశ్‌ మేనల్లుడు.

జగిత్యాల జిల్లాలో...
జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం రాములపల్లికి చెందిన దొంతరవేని కొమురయ్య, భూదమ్మ దంపతులకు కుమారుడు ప్రశాంత్‌ (19)ను మండల కేంద్రంలోని ఓ ప్రైవేటు కళాశాలలో సీఈసీ చదువుతున్నాడు. సెకండియర్‌లో ఫెయిల్‌ కావడంతో మనస్తాపం చెందిన ప్రశాంత్‌ శుక్రవారం బైక్‌పై ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. గ్రామశివారులోని చెట్టుకు ఉరేసుకున్నాడు. కుటుంబసభ్యులు వెతకగా శనివారం మృతదేహం లభించింది. అదే జిల్లా సారంగాపూర్‌ మండలం పోచంపేటకు చెందిన ఒడ్నాల భూమారెడ్డి కుమార్తె శివాని(17) జగిత్యాల ప్రభుత్వ బాలికల జూనియర్‌ కళాశాలలో ఎంపీసీ ప్రథమ సంవత్సరం చదువుతోంది. మూడు సబ్జెక్ట్‌ల్లో ఫెయిల్‌ కావడంతో మనస్తాపం చెంది శనివారం వేకువజామున ఇంట్లో ఉరేసుకుంది.  

కామారెడ్డి జిల్లాలో...
కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండల కేంద్రంలో నివాసముంటున్న దేవాసత్‌ పంగి, రూప్లా కూతురు నీరజ(17) మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఇంటర్‌ ప్రథమ సంవత్సరం (బైపీసీ) చదువుతోంది. బాటనీ సబ్జెక్టులో ఫెయిల్‌ కావడంతో తీవ్ర మనస్తాపానికి గురై ఇంట్లో ఉరేసుకుంది.

ఇంటర్‌ బోర్డుపై సమగ్ర విచారణ జరపాలి
తెలంగాణ ఇంటర్‌ బోర్డు లీలలపై సమగ్ర విచారణ జరిపించి, నష్టపోయిన విద్యార్థులకు న్యాయం చేయాలని పీడీఎస్‌యూ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు మామిడికాయల పరశురాం ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. శనివారం పీడీఎస్‌యూ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. బోర్డు తప్పిదాల ఫలితంగా మెరిట్‌ విద్యార్థులు ఫెయిల్‌ అయ్యారని, విద్యార్థుల భవిష్యత్తుతో ఇంటర్‌ బోర్డు ఆటలాడుకోవడం తగదన్నారు. మెరిట్‌ విద్యార్థులకు సైతం సున్నా మార్కులు రావడం ఆశ్చర్యకరమన్నారు. తప్పిదాలకు పాల్పడిన వారిపై తక్షణమే చర్యలు చేపట్టి, నష్టపోయిన విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. విచారణ జరపకుండానే ఏలాంటి తప్పిదాలు జరగలేదని ఇంటర్‌ బోర్డు కార్యదర్శి ఆశోక్‌ నిర్లక్ష్య ధోరణితో సమాధానాలు చెప్పడం దురదృష్టకరమన్నారు. ఇంటర్‌ విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడవద్దని సూచించారు. 

మరిన్ని వార్తలు