నలుగురు ఐపీఎస్‌ల పదవీ విరమణ

1 Jul, 2020 02:16 IST|Sakshi

సీనియర్లకు ‘అదనపు బాధ్యతలు’ అప్పగిస్తూ ప్రభుత్వం ఆదేశాలు 

ఐపీఎస్‌ల బదిలీలపై మరికొంతకాలం వేచిచూసే ధోరణిలో ప్రభుత్వం 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో నలుగురు సీనియర్‌ ఐపీఎస్‌ ఆఫీసర్లు మంగళవారం పదవీ విరమణ పొందారు. తెలంగాణ స్టేట్‌ పోలీస్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ ఎస్పీ బి.మల్లారెడ్డి, వరంగల్‌ నగర పోలీస్‌ కమిషనర్‌ డాక్టర్‌ వీ.రవీందర్, మాదాపూర్‌ జోన్‌ డీసీపీ ఎ.వెంకటేశ్వరరావు, నిర్మల్‌ ఎస్పీ సి.శశిధర్‌రాజులు రిటైర్‌ అయ్యారు. వీరి స్థానంలో కొత్త అధికారులకు కాకుండా సీనియర్లకే పూర్తిస్థాయి బాధ్యతలను ప్రభుత్వం అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మల్లారెడ్డి స్థానంలో పీ అండ్‌ ఎల్‌ విభాగం ఐజీ సంజయ్‌కుమార్‌ జైన్‌ను, రవీందర్‌ బాధ్యతలను సీఐడీ ఐజీ ప్రమోద్‌కుమార్‌కు, వెంకటేశ్వరరావు స్థానాన్ని సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌కు, శశిధర్‌ బాధ్యతలను ఆదిలాబాద్‌ ఎస్పీ విష్ణు వారియర్‌కు అప్పగిస్తూ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది.

కాగా, మంగళవారమే మరో ఐపీఎస్‌ అధికారి, ఎస్‌ఐబీ విభాగం ఐజీ ప్రభాకర్‌రావు సైతం పదవీ విరమణ చేయాల్సి ఉంది. కానీ, ప్రభాకర్‌రావు సేవలను ప్రభుత్వం మరోసారి వినియోగించుకోవాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ఆయన పదవీకాలాన్ని పొడిగించింది. ఎస్‌ఐబీలోనే ప్రభాకర్‌ రావును ఓఎస్డీగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ప్రభాకర్‌రావు మరో మూడేళ్లపాటు పదవిలో కొనసాగుతారు.  

బదిలీలు.. మరికొంత జాప్యం 
ఐపీఎస్‌ల బదిలీలపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే.. బదిలీలకు మరికొంత సమయం పట్టవచ్చన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే పలువురు ఐపీఎస్‌ అధికారులకు డీఐజీలు, ఏడీజీలుగా పదోన్నతులు కల్పించిన ప్రభుత్వం వారిని బదిలీ చేయబోతుంద ని ప్రచారం జరిగింది. ఇక ఐదుగురు ఐపీఎస్‌ ఆఫీసర్లు పదవీ విరమణ చేయడంతో జూన్‌ ఆఖరునాటికి బదిలీలు ఉంటాయని అంతా భావించారు.

కానీ, పదవీ విరమణ పొందిన వారి బాధ్యతలను సీనియర్లకు అదనపు బాధ్యతలుగా అప్పగించడంతో బదిలీలపై మరికొంత జాçప్యం జరుగుతుందని తెలుస్తోంది. ఇటీవల బదిలీ అయిన టీఎస్‌పీఏ చైర్మన్‌ బాధ్యతలను కూడా తెలంగాణ స్టేట్‌ పోలీస్‌ స్థాయి రిక్రూట్‌మెంట్‌ బోర్డు చైర్మన్‌ వివి. శ్రీనివాసరావుకు అదనపు బాధ్యతల కింద అప్పగించిన విషయం తెలిసిందే.  

మరిన్ని వార్తలు