కేంద్ర ప్రభుత్వ అవార్డుకు పోటీలో నాలుగు మార్కెట్‌యార్డులు 

15 Jan, 2019 10:17 IST|Sakshi
ఆన్‌లైన్‌లో ఈనామ్‌ ద్వారా టెండర్లను పర్యవేక్షిస్తూ డాక్యుమెంటరీని సిద్ధం చేస్తున్న సిబ్బంది, బాదేపల్లి ఈ–నామ్‌ యార్డు కార్యాలయం   

26న ఎక్స్‌లెన్స్‌ అవార్డుల ప్రకటన 

రెండు మార్కెట్ల నుంచి డాక్యుమెంటరీల రూపకల్పన

మరో రెండు చోట్ల సిద్ధం చేస్తున్న అధికారులు 

నారాయణపేట / జడ్చర్ల : మార్కెట్‌ యార్డుల్లో ఇష్టారాజ్యంగా కొనసాగే జీరో దందాను నివారించడానికి, రైతులకు గిట్టుబాటు ధర కల్పించడానికి  కేంద్ర ప్రభుత్వం ఈ–నామ్‌ (జాతీయ వ్యవసాయ మార్కెటింగ్‌) విధానాన్ని ప్రవేశపెట్టింది. రాష్ట్రంలో 2016 సెప్టెంబర్‌ 8న నుంచి ఈ విధానం అమల్లో ఉంది. అందులో భాగంగానే జిల్లాలోని మహబూబ్‌నగర్, దేవరకద్ర, నారాయణపేట, బాదేపల్లి (జడ్చర్ల) మార్కెట్‌ యార్డుల్లో ఈ విధానం కొనసాగుతోంది.  అయితే, ఈ–నామ్‌ విధానాన్ని పటిష్టంగా అమలు చేస్తున్న మార్కెట్లకు ఈ ఏడాది నుంచి కేంద్ర ప్రభుత్వం అవార్డులు ఇవ్వాలని నిర్ణయించింది. ఇందుకోసం జిల్లాలోని నాలుగు మార్కెట్ల నుంచి ప్రతిపాదనలు పంపించాలని కలెక్టర్‌ రొనాల్డ్‌రోస్‌ ఆదేశించారు. ఇప్పటికే మహబూబ్‌నగర్, బాదేపల్లి మార్కెట్ల నుంచి డాక్యుమెంటరీ సమర్పించగా.. నారాయణపేట, దేవరకద్ర మార్కెట్‌ యార్డు అధికారులు నివేదికలు సిద్ధం చేసే పనిలో పడ్డారు. వాటిని ఈనెల 15వ తేదీలోగా సమర్పించాల్సి ఉంటుంది. దేశంలోని అన్ని యార్డుల వివరాలను పరిశీలించి 26వ తేదీన కేంద్ర ప్రభుత్వం అవార్డులను ప్రకటిస్తుంది.
 
అమలు ఇలా... 
ఈ నామ్‌ పరిధిలోకి వచ్చిన మార్కెట్‌యార్డుల్లో కందులు, వేరుశనగ, గుర్రం శనగలు, పెసర, జొన్నలు, ఆముదాలు, వరిధాన్యం, పత్తి, చింతపండు, చింతగింజలు, తెల్ల, నల్ల కుసుమలు తదితర ధాన్యాన్ని ఆన్‌లైన్‌ విధానంలోనే కొనుగోలు చేస్తున్నారు. రైతు మార్కెట్‌కు తెచ్చిన ధాన్యాన్ని ఎంట్రెన్స్‌లోనే గేట్‌పాస్‌ తీసుకోవడం, విక్రయానికి పెట్టడం, ఆన్‌లైన్‌ ట్రేడింగ్‌ చేయడం, తూకాలు, ధరలు ప్రకటించడం, విక్రయాలు పూర్తికాగానే వ్యాపారులు రైతులకు బ్యాంకు ద్వారా లేక నేరుగా డబ్బులు చెల్లించడం, ఈ పాస్‌ను రైతు కొనుగోలు ప్రక్రియ పూర్తయ్యే వరకు భద్రపరుచుకోవాలి. ఈ ధాన్యాన్ని దేశంలోని అన్ని ప్రాంతాల వారు ఇంటర్‌నేట్‌లో చూసుకోని ఆన్‌లైన్‌ టెండర్లు వేసుకొని కొనుగోలు చేసుకోచ్చు. ధర ఎక్కువగా కోడ్‌ చేసిన వ్యాపారులకు ధాన్యం విక్రయించి రైతు లాభసాటి ధర పొందవచ్చు.  
      
పక్కగా అమలైతేనే..  
మార్కెట్‌యార్డుకు వచ్చే సరుకు లెక్కల్లో తప్పుడు గీతలు, సిండికెట్‌లతో ధరలను నియంత్రించడం లాంటి వాటికి తెరపడుతుంది. బుక్కచిట్టీలపై కొనుగోళ్లకు, అధిక కమిషన్లు వసూళ్లకు అవకాశం చెక్‌పడుతుంది. డబ్బుల కోసం రైతులు నెలల కొద్ది  వేచి ఉండాల్సిన పనిలేదు. తక్‌పట్టీలు ఆన్‌లైన్‌ ద్వారానే రైతులకు అందుతాయి. ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టే జీరో దందాకు చెక్‌ పెట్టినట్లే.  

డాక్యుమెంటరీ తయారీ 
ప్రధాన మంంత్రి ‘ఇనామ్‌’కు డక్యూమెంటరీని తయారు చేసేందుకు పలు ఆంశాలను పరిగణలోకి తీసుకోనున్నారు. ఏప్రిల్‌1, 2017 నుంచి 31 డిసెంబర్, 2018 వరకు ఈ నామ్‌ ద్వారా కోనుగోలు జరిగిన వాటిని పరిగణలోకి తీసుకోవాల్సి ఉంది. ఈ నామ్‌ ద్వారా ఇంత వరకు రైతులు ఎంత మంది తమ సరులకు విక్రయించారు. ఏయే ధాన్యాలను ఎంత మొత్తంలో విక్రయించారు. లాట్‌ నంబర్లు, వ్యాపారస్థులు వేసిన టెండర్లు, ధరల కోడ్‌లు, రైతులకు చెల్లింపులు, ధాన్యం తూకాలు తదితర వాటిని డక్యూమెంటరీగా తయారీ చేసి పంపించేందుకు అధికారులు శ్రీకారం చుట్టారు.
 
అవార్డుల కోసం ప్రతిపాదనలు 
జిల్లా నుంచి రెండు వ్యవసాయ మార్కెట్‌ యార్డులను ఈ–నామ్‌ ఎక్స్‌లెంట్‌ అవార్డుల కోసం కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. బాదేపల్లి వ్యవసాయ మార్కెట్‌ యార్డుతోపాటు మహబూబ్‌నగర్‌ మార్కెట్‌ యార్డులను ఈ–నామ్‌ ఎక్స్‌లెంట్‌ అవార్డుల కోసం నివేదికలను తయారు చేసి పంపారు. ఈ రెండు మార్కెట్‌లో ఈ–నామ్‌ విధానం అమలు, పంట ఉత్పత్తుల క్రయవిక్రయాలు, ఆదాయం, మౌళిక వసతులు, తదితర వనరులకు సంబంధించి ఫొటోలు, వీడియోలు తదితర వాటిని నివేదించారు. 2017–18 సంవత్సరానికి సంబంధించి బాదేపల్లి వ్యవసాయ మార్కెట్‌యార్డుకు రూ.2.34 కోట్లు, మహబూబ్‌నగర్‌ యార్డుకు రూ.1.70 కోట్ల ఆదాయం వచ్చిందని, ఆయా వివరాలను ఈనామ్‌ ఎక్స్‌లెంట్‌ అవార్డుల కోసం కేంద్రానికి నివేదించినట్లు జిల్లా మార్కెటింగ్‌ అధికారి భాస్కరయ్య తెలిపారు. ఈనెల 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్రం ఈ–నామ్‌ అవార్డులను ప్రకటించనుందని ఆయన పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు