ఇంకెవరు?

14 Dec, 2018 10:29 IST|Sakshi

గత మంత్రివర్గంలో సిటీ నుంచి నలుగురు

కేబినెట్‌లో చోటు కోసం క్యూ

రేసులో కొత్త నేతలు మల్లారెడ్డి, ప్రకాష్‌గౌడ్‌!

నాయిని, తలసాని, పద్మారావు కూడా..

మరికొన్ని రోజులు తప్పని సస్పెన్స్‌

సాక్షి,సిటీబ్యూరో: సీఎం కేసీఆర్‌ నూతన కేబినెట్‌లో నగరం నుంచి నలుగురికి చోటు కల్పించనున్నట్టు సమాచారం. అయితే, ప్రస్తుతం వారెవరు అన్నది సస్పెన్స్‌ థ్రిల్లర్‌ను తలపిస్తోంది. గురువారం సీనియర్‌ నేత మహమూద్‌ అలీతో  మంత్రిగా ప్రమాణం చేయించి పూర్తి స్థాయి మంత్రిమండలి ఏర్పాటుకు మరో నాలుగు రోజులుందని కేసీఆర్‌ సంకేతాలిచ్చారు. దీంతో కేబినెట్‌లో చోటు కోసం నేతలు ఎవరికి వారుగా తీవ్రస్థాయిలో ప్రయత్నాలు మొదలుపెట్టారు. రద్దయిన కేబినెట్‌లో నగరం నుంచి మహమూద్‌ అలీ, నాయిని నర్సింహారెడ్డి, పద్మారావు, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌తో పాటు రంగారెడ్డి జిల్లా నుంచి పట్నం మహేందర్‌రెడ్డికి స్థానం కల్పించారు. తాజా కేబినెట్‌లో రంగారెడ్డితో కలుపుకుని ఇంకా నాలుగు బెర్తులు ఖాళీగా ఉన్నాయి. దీంతో రంగారెడ్డిఉమ్మడి జిల్లా కోటాలో మేడ్చల్‌ నుంచి భారీ మెజారిటీతో విజయం సాధించిన చామకూర మల్లారెడ్డికి అవకాశం కల్పించే అంశంపై చర్చ సాగుతోంది.

ఎంపీగా ఉన్న ఆయనతో ఎమ్మెల్యేగా పోటీ చేయించడం కూడా సీఎం కేసీఆర్‌ ముందస్తు నిర్ణయమేనని ప్రచారం జరగుతోంది. మల్లారెడ్డికి సీఎం కేసీఆర్‌తో పాటు యువనాయుడు కేటీఆర్‌తోనూ సన్నిహిత సంబంధాలు ఉండడం కలిసివచ్చే అంశం. ఇక సిటీకి చెందిన నాయిని నర్సింహారెడ్డిని మళ్లీ క్యాబినెట్‌లో కొనసాగించే అంశం సస్పెన్స్‌గా ఉంది. నాయినికి ఎమ్మెల్సీ కాలపరిమితి ఇంకా రెండేళ్లు ఉంది. కొత్త క్యాబినెట్‌లోనూ స్థానం దక్కుతుందన్న నమ్మకంతో ఆయన ఉన్నారు. ఒకవేళ నాయినిని తప్పిస్తే పార్టీ బాధ్యతలు లేదా శాసనమండలిలో ఏదైనా కీలక పదవి ఆయనకు అప్పగించే అవకాశం లేకపోలేదని సన్నిహితులు భావిస్తున్నారు. మరోపక్క సికింద్రాబాద్, సనత్‌నగర్‌ల నుంచి విజయం సాధించిన పద్మారావు, తలసాని సైతం తమకు క్యాబినెట్‌లో చోటు ఉంటుందన్న నమ్మకంతో ఉన్నారు. వీరిలో ఒకరిని వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో సికింద్రాబాద్‌ నుంచి పోటీ చేయించే ఆలోచన అధినేతకు ఉంటే క్యాబినెట్‌లో చోటు దక్కకపోవచ్చు. ఒకవేళ సీనియర్లు అందరినీ తప్పించి కొత్తవారికి అవకాశం కల్పించాలన్న ప్రతిపాదన వస్తే సామాజిక అంశాలను పరిగణలోకి తీసుకోనున్నారు. ఆమేరకు ఖైరతాబాద్, రాజేంద్రనగర్, కుత్బుల్లాపూర్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యేలు దానం నాగేందర్, ప్రకాష్‌గౌడ్, వివేకానంద్‌గౌడ్, అరికెపూడి గాంధీ పేర్లను కూడా పరిశీలించే అవకాశాలు మెండుగా ఉన్నాయని పరిశీలకులు భావిస్తున్నారు.

మరిన్ని వార్తలు