అపర బ్రహ్మలు.. ‘గాంధీ’ వైద్యులు

10 Dec, 2017 03:45 IST|Sakshi
మీడియా సమావేశంలో అరుదైన శస్త్రచికిత్స గురించి వివరిస్తున్న వైద్యులు

     పాడైన రూపాన్ని సరిచేశారు

     నాలుగు అరుదైన శస్త్రచికిత్సలు విజయవంతం

హైదరాబాద్‌: పాడైపోయిన రూపాన్ని సరిచేసి అపర బ్రహ్మలుగా నిలిచారు.. సికింద్రాబాద్‌ గాంధీ ఆస్పత్రి వైద్యులు. వివిధ ప్రమాదాల్లో తీవ్రంగా గాయపడి గుర్తు పట్టలేనంతగా మారిన ముఖాలకు అరుదైన శస్త్రచికిత్సలు నిర్వహించి కోల్పోయిన రూపాలను తిరిగి తెచ్చారు గాంధీ ఆస్పత్రి ప్లాస్టిక్‌ సర్జరీ వైద్యులు. గాంధీ ఆస్పత్రిలో శనివారం జరిగిన మీడియా సమావేశంలో సూపరింటెండెంట్‌ శ్రవణ్‌కుమార్‌తో కలసి పాస్టిక్‌ సర్జరీ విభాగాధిపతి సుబోధ్‌కుమార్, అనస్థీషి యా వైద్యులు అప్పారావు ఆరోగ్య శ్రీ ద్వారా విజయవంతంగా నిర్వహించిన 4 అరుదైన శస్త్రచికిత్సల వివరాలను వెల్లడించారు.  

తెగి ఊగిసలాడుతున్న చేతికి.. 
ఏపీలో పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండ లం కల్సిపురికి చెందిన అభినవ్‌ (21) నగరంలో బీటెక్‌ చదువుతున్నాడు. పట్టాలు దాటుతుండగా రైలు ఢీ కొట్టడంతో ఎడమచేయి తెగి ఊగిసలాడుతోంది. దీంతో గతనెల 6న గాంధీలో చేరాడు. వైద్యులు మైక్రోవాస్కులర్‌ సర్జరీ విజయవంతంగా నిర్వహించి తొడవద్ద కండను తీసి చేతికి అతికించి, రక్తనాళాలకు కనెక్షన్‌ ఇచ్చారు.  

విద్యుదాఘాతానికి గురైన మరో ఇద్దరికి.. 
విద్యుదాఘాతానికి గురై గుర్తుపట్టలేనంతగా ముఖం కాలిపోయిన మరో ఇద్దరు బాధితులకు పలుమార్లు శస్త్రచికిత్సలు నిర్వహించి కొల్పోయిన రూపాన్ని తిరిగి తెచ్చారు. నల్లగొండజిల్లా కంచనపల్లికి చెందిన శ్రీను (45), సిద్దిపేట జిల్లా కొయిడ మండలం బసవపూర్‌ జ్యోతిరాం తండాకు చెందిన నెహ్రూ (50) విద్యుదాఘాతంతో ముఖరూపాన్ని కోల్పోయారు. వీరికి మల్టిపుల్‌ ప్లాప్‌ సర్జరీలు చేసి పేషియల్‌ రీకనస్ట్రక్షన్‌ శస్త్రచికిత్స ద్వారా కోల్పోయిన రూపాన్ని తిరిగి తెచ్చారు. ఈ సమావేశంలో ప్లాస్టిక్‌ సర్జరీ వైద్యులు వెంకటేశ్వర్లు, అప్పారావు, రమేశ్, మహేందర్, చంద్రకళ, అర్జున్, సృజనలతోపాటు పీజీ వైద్యవిద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు. 

ఎముకను వంచి.. దవడగా మార్చి.. 
రంగారెడ్డి జిల్లా కొత్తగూడకు చెందిన జనార్దన్‌ (32) దవడ ఎముకకు క్యాన్సర్‌ సోకింది. ఎముక పూర్తిగా పాడైపోవడంతో గతనెలలో గాంధీ ఆస్పత్రి ప్లాస్టిక్‌ సర్జరీ విభాగంలో చేరాడు. వైద్యులు పాడైన దవడ ఎముకను తొలగించారు. ఎమలోబ్లాష్టోమా అనే అరుదైన శస్త్రచికిత్స విజయవంతంగా నిర్వహించి నిలువుగా ఉన్న కాలి ఎముకను తీసి దాన్ని యు ఆకారంలో వంచి దవడకు విజయవంతంగా అమర్చారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో సుమారు రూ.15 లక్షలు ఖర్చయ్యే ఈ సర్జరీని దివంగత నేత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఉచితంగా నిర్వహించారు. 

మరిన్ని వార్తలు