ఆ ‘నలుగురు’ మహిళా మంత్రులు

9 Nov, 2018 18:30 IST|Sakshi

కీలక శాఖలకు బాధ్యతలు  గెలిచిన తొలిసారే  పుష్పలీలను వరించిన అమాత్య యోగం 

సుమిత్రాదేవి, సబితా ఇంద్రారెడ్డి, ఉమా వెంకట్రాంరెడ్డికి అవకాశం

మహిళామణులు అసెంబ్లీలో అడుగుపెట్టడమేగాక ఆయా శాఖలకు మంత్రులుగా పనిచేసి రాష్ట్ర రాజకీయ యవనికపై తమదైన ముద్రవేశారు. పురుషులకు ధీటుగా కీలక పదవులు చేపట్టి ప్రజా సంక్షేమం, అభివృద్ధి పనుల్లో తమ సత్తా చాటారు. ఇప్పటివరకు ఉమ్మడి జిల్లా నుంచి మొత్తం ఏడుగురు మహిళలు ఎమ్మెల్యేలుగా గెలుపొందగా .. ఇందులో నలుగురికి మంత్రులుగా పనిచేసే అవకాశం లభించడం విశేషం. గనుల శాఖ నుంచి మొదలుకుని హోం తదితర అత్యున్నత శాఖలకు బాధ్యత వహించి భేష్‌ అనిపించారు. కాంగ్రెస్, టీడీపీలు మాత్రమే మహిళలకు మంత్రివర్గంలో చోటు కల్పించాయి. 

సాక్షి, రంగారెడ్డి జిల్లా :   కొండ్రు పుష్పలీలను లక్కీ మినిస్టర్‌గా రాజకీయ వర్గాలు పేర్కొంటాయి. ఎమ్మెల్యేగా గెలిచిన తొలిసారే ఈమెకు అమాత్య యోగం దక్కడమే ఇందుకు కారణం. ఆయా పార్టీల తరఫున పలువురు అభ్యర్థులు మూడునాలుగు సార్లు అసెంబ్లీలో అడుగుపెట్టినా మంత్రి పదవులు వరించలేదు. ఇందుకు భిన్నం పుష్పలీల. 1999 ఎన్నికల్లో ఇబ్రహీంపట్నం నుం చి టీడీపీ తరఫున బరిలోకి దిగిన ఈమె.. కాంగ్రెస్‌ అభ్యర్థి ఏ గంగారం కృష్ణపై విజయం సాధించారు. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ఈమె మహిళా, సాంఘిక సంక్షేమశాఖ మంత్రిగా పనిచేశారు. 1994 ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎంఫిల్‌ పట్టా పొం దిన పుష్పలీల.. ఎస్సీ వర్గీకరణ కోసం పోరాడారు.  


మంత్రిగా సుమిత్రాదేవి 
ఇబ్రహీంపట్నం నియోజకవర్గం నుంచి 1978 ఎన్నికల్లో ఇందిరా కాంగ్రెస్‌ తరఫున బరిలోకి దిగి విజయఢంకా మోగించిన దళిత నాయకురాలు, స్వాతంత్య్ర సమరయోధురాలు సుమిత్రాదేవి మంత్రిగా పనిచేశారు. వరుసగా ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి సంచలనం సృష్టించారు. ఈ ఘనత మరే మహిళా నాయకురాలు సాధించలేదు. 1957, 62 ఎన్నికల్లో హైదరాబాద్‌ నుంచి గెలుపొందగా.. ఆ తర్వాతి మూడుసార్లు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి శాసనసభ సభ్యురాలిగా ఎన్నికయ్యారు. రెండుసార్లు మేడ్చల్‌ నుంచి గెలుపొందారు. ఇబ్రహీంపట్నం నుంచి బరిలోకి దిగిన ఆమె.. జనతా పార్టీ అభ్యర్థి కేఆర్‌ కృష్ణస్వామిని ఓటమి రుచిచూపించి మంత్రి పదవిని దక్కించుకున్నారు.

  
సబితారెడ్డికి పెద్దపీట.. 
చేవెళ్ల చెల్లెమ్మగా పేరుగాంచిన పట్లోళ్ల సబితా ఇంద్రారెడ్డి రెండుసార్లు మంత్రిగా పనిచేశారు. 2004లో తొలిసారిగా డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర రెడ్డి మంత్రివర్గంలో ఈమెకు చోటుదక్కింది. చేవెళ్ల సెగ్మెంట్‌ నుంచి బరిలో కి దిగిన ఆమెకు వైఎస్సార్‌ మంచి ప్రాధాన్యత ఇచ్చా రు. ఆ తర్వాత 2009లో చేవెళ్ల నియోజకవర్గం రిజర్వ్‌డ్‌ కావడంతో.. మహేశ్వరం నుంచి పోటీచేసి.. మాజీ మేయర్, టీడీపీ అభ్యర్థి తీగల కృష్ణారెడ్డిపై గెలుపొందారు. ఈ దఫా వైఎస్సార్‌ తన క్యాబినెట్‌లో రాష్ట్ర హోం, జైళ్లు, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రిగా అవకాశం కల్పించారు. వైఎస్సార్‌ మరణం తర్వాత రో శయ్య హయాంలోనూ సబితా హోంమంత్రిగా కొనసాగారు. ఈమె భర్త పట్లోళ్ల ఇంద్రారెడ్డి 2000లో రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందడంతో రాజకీయ ప్రవే శం చేసిన ఈమె.. మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 1963 మే నెలలో తాండూరులో జన్మించిన సబితా.. 41 ఏళ్ల వయసులో తొలిసారిగా మంత్రి అయ్యారు. 


ఉమా వెంకట్రాంరెడ్డికి కీలక బాధ్యతలు 
మేడ్చల్‌ అసెంబ్లీ నుంచి రెండు పర్యాయాలు విజయం సాధించిన ఉమా వెంకట్రాంరెడ్డి పలు శాఖలకు మంత్రిగా వ్యవహరించారు. 1983 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి టీపీ రెడ్డిపై గెలిచి తొలిసారి శాసనసభలో అడుగుపెట్టారు ఈమె. ఆ తర్వాత మరోసారి 1989లో విజయం సాధించారు. ఆ సమయంలో ముఖ్యమంత్రి డాక్టర్‌ మర్రి చెన్నారెడ్డి. ఆయన మంత్రివర్గంలో మొదటగా మంత్రి పదవి వరించలేదు. 1990 డిసెంబర్‌ 3న చేపట్టిన మంత్రి వర్గ విస్తరణలో ఆమెకు చోటు దక్కింది. గృహనిర్మాణం, సూక్ష్మ నీటిపారుదల, గనుల శాఖ మంత్రిగా అవకాశం దక్కింది. గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా 1990 వరకు పనిచేశారు. ఆ తర్వాత నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి కేబినెట్‌లోనూ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. 1991 ఆగస్టు 5 నుంచి 1992 వరకు గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రిగా సేవలందించారు.  

మరిన్ని వార్తలు