వికారాబాద్‌తో ఎమ్మెస్‌కు అనుబంధం

24 Jan, 2015 06:55 IST|Sakshi
వికారాబాద్‌తో ఎమ్మెస్‌కు అనుబంధం

ఇక్కడి వాతావరణం చాలా బాగుంటుంది..
జీవన చరమాంకంలో ఇక్కడే గడపాలనుందనేవారు
ఎమ్మెస్ నారాయణ మాటలను నెమరువేసుకున్న అభిమానులు


వికారాబాద్: ప్రముఖ హాస్యనటుడు ఎమ్మెస్ నారాయణకు వికారాబాద్‌తో నాలుగేళ్ల అనుబంధముంది. పట్టణానికి చెందిన పలువురితో ఆయనకు మంచి పరిచయాలు ఉన్నాయి. శుక్రవారం ఉదయం ఆయన మరణించారనే వార్త తెలుసుకున్న పట్టణవాసులు విషాదంలో మునిగారు. ఆయన 2011లో వికారాబాద్‌లోని పర్యాటక కేంద్రానికి వచ్చారు. ఇక్కడి వాతావరణం చాలా బాగుందని.. తన చరమాంకంలో జీవితాన్ని ఇక్కడే గడపాలని కలలు కన్నారని స్థానిక అభిమానులు గుర్తు చేసుకున్నారు. ముఖ్యంగా కొత్తగడికి చెందిన ధవళగారి ప్రభాకర్‌రెడ్ది (చిన్నబాబు)తో ఎమ్మెస్ నారాయణకు కొన్నేళ్లుగా పరిచయం ఉంది.

ఈ నేపథ్యంలో 2012లో వికారాబాద్ శివారు మోత్కుపల్లి సమీపంలో 20 ఎకరాల భూమిని ఎమ్మెస్ నారాయణకు ఇప్పించారు. దీంతో వీరిరువురి కుటుంబాలకు మంచి సాన్నిహిత్యం ఏర్పడింది. ఈ క్రమంలోనే ఎమ్మెస్ నారాయణతో తమకు వీడదీయరాని అనుబంధం ఏర్పడిందని ప్రభాకర్‌రెడ్డి, ఆయన కుటుంబసభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. ఎమ్మెస్ నారాయణ మంచి నటుడే కాకుండా గొప్ప మానవతావాది అని.. సహృదయుడని ప్రభాకర్‌రెడ్డి పేర్కొన్నారు. ‘చనిపోయింతర్వాత కేవలం మంచి పేరు తప్ప మన వెంట ఏమీ తీసుకుపోం’ అనేవారని గత స్మృతులను గద్గదస్వరంతో వెలిబుచ్చారు.

మరిన్ని వార్తలు