నక్క బావ కథ కంచికేనా!

25 Jan, 2017 08:55 IST|Sakshi
నక్క బావ కథ కంచికేనా!

అంతరిస్తున్న నక్క, తోడేలు, మచ్చల జింక
ప్రమాదంలో 150 వృక్ష, జంతుజాతుల మనుగడ
95 జాతుల జాబితాను రూపొందించిన జీవ వైవిధ్య బోర్డు
మచ్చల కందుల జాడ లేదు.. పేలాల జొన్నల ఊసు లేదు..
పులి, ఉడుము, ఎలుకమూతి ఎలుగుబంటు, రాబందులకూ పొంచి ఉన్న ప్రమాదం.. కళ్లు తెరవకుంటే కనుమరుగే


సాక్షి, హైదరాబాద్‌:  ‘అనగనగా ఓ తోడేలు.. ఓ అడవిలో నక్క ఉండేది..’ చిన్నతనంలో బామ్మ చెప్పిన కథలన్నీ ఇలాగే మొదలయ్యేవి! చందమామ, బాలమిత్ర పుస్తకాల కథల్లోనూ చాలావరకు ఇవే కనిపించేవి. కానీ పరిస్థితులు చూస్తుంటే మున్ముందు ఈ జంతువుల ఉనికి ఇక కథలకే పరిమితమయ్యేలా ఉంది. భావి తరాలు వాటిని ప్రత్యక్షంగా చూసే అవకాశాన్ని కోల్పోవచ్చు. ఎందుకంటే రాష్ట్రంలో వీటితోపాటు అనేక జంతు, వృక్ష, పక్షి, ఉభయచర, సరీసృపాల జాతుల మనుగడ ప్రమాదంలో పడిపోయింది. అవన్నీ అంతరించిపోయే దశకు చేరుకున్నాయి. ఈ జాబితాలో సుమారు 150 జాతులున్నట్లు తెలంగాణ రాష్ట్ర జీవవైవిధ్య బోర్డు గుర్తించింది. ప్రస్తుతానికి 95 జాతుల జాబితాను రూపొందించింది. మరో 55 జాతుల జాబితాను సిద్ధం చేసే పనిలో నిమగ్నమైంది. అరుదైన వృక్ష, జంతు జాతులను పరిరక్షించుకోకుంటే భావి తరాలకు ఇవన్నీ దూరమయ్యే ప్రమాదం పొంచి ఉందని పర్యావరణ వేత్తలు, ప్రకృతి ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

రాబంధులు.. మచ్చల కందులేవీ?
వినువీధిలో రాబంధుల రెక్కల చప్పుడు క్రమేణా కనుమరుగవుతోంది. తెలంగాణ సంప్రదాయ పంట మచ్చల కందులు మాయమౌతున్నాయి. రాష్ట్రానికే తలమానికమైన అరుదైన వృక్ష, జంతుజాతులు మాయమై జీవవైవిధ్యం ప్రశ్నార్థకంగా మారుతోంది. తరతరాలుగా తెలంగాణ అస్తిత్వానికి ప్రతీకగా నిలిచిన పంటలు కూడా అంతరించిపోతున్నాయి. తాతలనాటి నుంచి వంశపారంపర్యంగా> వస్తున్న ఎర్రమచ్చల కందులు.. పేలాల జొన్నలు, వాయునౌక జొన్నలు వంటి పంటలు అంతర్ధానమవుతున్నాయి. అడవుల నరికివేత, వేటలతో మన్ననూరు గేదె వంటి అరుదైన జంతు జాతులూ అంతరించిపోయే జాబితాలో చేరాయి.

అంతరించిపోతున్న వృక్ష, జంతుజాతులివే..

పర్యావరణపరంగా అరుదు(రేర్‌), ఎన్‌డేంజర్డ్‌ (అంతరించిపోతున్న దశ), థ్రెటన్డ్‌(అంతిమ దశ) అన్న విభాగాల్లో సుమారు 150 వృక్ష, జంతు జాతులున్నట్లు రాష్ట్ర జీవ వైవిధ్య మండలి గుర్తించింది. వాటి వివరాలివీ..

వృక్ష జాతులు(25): ఎర్రమచ్చల కందులు, పేలాల జొన్నలు, వాయునౌక జొన్న తదితరాలు
జంతువులు(23): నక్క, తోడేలు, మన్ననూర్‌ గేదె, అడవి కుక్క, చిరుత, హైనా, మచ్చల జింక, బురద మచ్చల పిల్లి, ఉడుము, ఎలుకమూతి ఎలుగుబంటి, పులి వంటివి..
పక్షులు(27): తెల్ల రాబంధు, పొడవు ముక్క రాబంధు, ఎర్రతల రాబంధు, ఈజిప్షియన్‌ రాబందు, పెద్దమచ్చల గద్ద, కొంగ(బ్లాక్‌నెక్‌డ్‌ స్టార్క్‌) తదితరాలు
సరీసృపాలు(9): మగ్గర్‌ మొసలి, కొండచిలువ వంటివి..
చేపలు(10): క్లైంబింగ్‌ పెర్క్, దక్కన్‌ వైట్‌ కార్ప్, దక్కన్‌ నంగ్రా వంటివి..

అరుదైన పంటలు ఎందుకు కనుమరుగవుతున్నాయంటే..
– వాతావరణ మార్పులు
– సంప్రదాయ వంగడాలను పరిరక్షించుకునే దిశగా రైతులకు ప్రభుత్వపరంగా ప్రోత్సాహం లేకపోవడం
– రైతులు వాణిజ్య పంటలకే మొగుచూపడం. విత్తనాలు విరివిగా లభించకపోవడం
– మార్కెటింగ్‌ వసతులు లేకపోవడం, నిల్వచేసేందుకు స్టోరేజీ సదుపాయాలు లేకపోవడం
– విత్తనాల లభ్యత లేకపోవడం, ఆశించిన దిగుబడి రాకపోవడం
 – సాగు భూములు రియల్‌ ఎస్టేట్‌ వెంచర్లుగా మారడం
– నీటి సౌకర్యం లేకపోవడం
– చీడపీడల నివారణ, ఎరువులు, పురుగు మందులు భారమవడం
జంతుజాతుల ఎందుకు ప్రమాదంలో పడుతున్నాయి?
– వన్య మృగాల వేట
– అడవుల నరికివేత. వాస్తవానికి రాష్ట్ర విస్తీర్ణంలో 33 శాతం అడవులుండాలి. కానీ మన
రాష్ట్రంలో 23 శాతమే ఉన్నాయి
– అటవీ ప్రాంతాల్లో మైనింగ్, వ్యవసాయ, వాణిజ్య కార్యకలాపాలు
– అడవుల్లో సహజసిద్ధ వాతావరణం కనుమరుగుకావడం
– జంతు జాతుల సంతానోత్పత్తి దిశగా ప్రయోగాలు చేయకపోవడం
పరిష్కారం ఏంటి?
– అంతరించిపోతున్న జీవజాలం వీర్యం, అండాలను సేకరించి ప్రయోగశాలల్లో కృత్రిమ ఫలదీకరణ చేయడం ద్వారా ఆయా జాతులను పరిరక్షించవచ్చు
– అరుదైన పంటలు, వృక్షజాతుల విత్తనాలు సేకరించి, మరింత అభివృద్ధిపరచి రైతులకు అందజేయడం

అవగాహన కల్పిస్తున్నాం: డాక్టర్‌ సి.సువర్ణ, సభ్య కార్యదర్శి, రాష్ట్ర బయోడైవర్సిటీ బోర్డు
అరుదైన వృక్ష, జంతుజాలం పరిరక్షణకు గ్రామ, మండల, జిల్లా స్థాయిలోని బయోడైవర్సిటీ మేనేజ్‌మెంట్‌ కమిటీలకు, రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. అరుదైన పంటల పరిరక్షణ ద్వారా మన సంప్రదాయాలు, సంస్కృతిని భావితరాలకు పరిచయం చేయవచ్చని అందరూ గుర్తించాలి. సంప్రదాయ పంటల్లో ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో గుణాలున్నాయి. ఈ పంటలతో అధిక దిగుబడులు సాధించే దిశగా పరిశోధనలు జరగాల్సి ఉంది. అంతరించిపోతున్న జంతు జాతులపై అవగాహన పెంపొందించుకోవాలి. వాటి పరిరక్షణకు అందరూ చర్యలు తీసుకోవాలి.

మరిన్ని వార్తలు