సెస్‌లో స్తంభాల కొనుగోల్‌మాల్‌

27 Jul, 2016 20:29 IST|Sakshi
  • రూ.24.33 లక్షలతో 1500 స్తంభాలు 
  • మరో 70 స్తంభాలకు పర్ఛేజ్‌ కమిటీ ఆమోదం
  • కొనుగోళ్లపై సెస్‌ డైరెక్టర్ల గుర్రు
  • ‘గోల్‌మాల్‌’పై మంత్రి పేషీ ఆరా..
  • ‘సాక్షి’ కథనంపై చర్చ
  • సిరిసిల్ల : సిరిసిల్ల సహకార విద్యుత్‌ సరఫరా సంఘం(సెస్‌)లో టెండర్లు లేకుండానే విద్యుత్‌ స్తంభాలను భారీగా కొనుగోలు చేసినట్లు వెలుగులోకి వచ్చింది. నిబంధనల ప్రకారం టెండర్లు నిర్వహించి తక్కువ రేట్‌ కోట్‌ చేసిన వారితో ఒప్పందం చేసుకుని స్తంభాలను కొనుగోలు చేయాల్సి ఉండగా.. ఆ నిబంధనలు ఏమీ పాటించకుండానే అత్యవసరం పేరుతో 1500 విద్యుత్‌ స్తంభాలను రూ. 24.33 లక్షలు వెచ్చించి అత్యవసరం పేరుతో కొనుగోలు చేసింది. 8 మీటర్ల పొడువుండే స్తంభానికి రూ.1595, 9.1 మీటర్లు పొడువుండే స్తంభానికి రూ.3100 చొప్పున చెల్లించి కొనుగోలు చేశారు. ఇవన్నీ గత నాలుగు నెలల్లో కొత్తగా సెస్‌ పాలకవర్గం వచ్చిన తరువాతనే కొనుగోలు చేశారు. స్తంభాలను అత్యవసరంగా కొనుగోలు చేయడానికి సెస్‌ బైలాలో అవకాశం ఉన్నా... టెండర్లు నిర్వహించకపోవడం చర్చనీయాంశమైంది. మరోవైపు ఇటీవల కాలంలో సిమెంట్, ఐరన్‌ రేట్లు తగ్గినా పాత రేట్ల ప్రకారమే కొనుగోలు చేయడం అనుమానాలకు తావిస్తోంది. సిరిసిల్ల మండలం మండెపల్లి, వేములవాడ మండలం అగ్రహారం వద్ద ప్రై వేటు వ్యక్తులు స్తంభాల తయారీ కేంద్రాలను నిర్వహిస్తున్నారు. వీటి ద్వారానే 1500 స్తంభాలను కొనుగోలు చేసినట్లు తెలిసింది. 
     
    మరో 70 స్తంభాలకు ఆర్డర్లు 
    ఇప్పటికే కొనుగోలు చేసిన 1500 స్తంభాలకు తోడు కొత్తగా మరో 70 స్తంభాలు కొనుగోలు చేసేందుకు సెస్‌ పర్ఛేజ్‌ కమిటీ సభ్యులు, డైరెక్టర్లు డి.తిరుపతి, కె.మల్లారెడ్డి ఆమోదం తెలిపినట్లు సమాచారం. ఇప్పటికే టెండర్లు లేకుండా స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లు కొనుగోలు చేయడంపై మెజార్టీ డైరెక్టర్లు అభ్యంతరం చెప్పగా, కొత్తగా కొనుగోలుకు పర్ఛేజ్‌ కమిటీ ఆమోదం తెలుపడం మరో వివాదానికి తెరలేపింది. గాలివానల కారణంగా సెస్‌ పరిధిలో విద్యుత్‌ స్తంభాలు కూలిపోవడం సహజం. నాణ్యమైన స్తంభాలు కొనుగోలు చేయడంలో సెస్‌ అధికారులు విఫలమవుతున్నారనే ఆరోపణలున్నాయి. స్తంభాల విషయంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ప్రజల ప్రాణాలతో చెలగాటమాడినట్లు అవుతుందని సెస్‌లోని ఉద్యోగులే పేర్కొంటున్నారు. నాసిరకం కొనుగోళ్లలో కమీషన్లు దండుకోవడం ఎలా ఉన్నా.. దీర్ఘకాలికంగా ఉండాల్సిన స్తంభాలు కూలిపోతే వినియోగదారుల ప్రాణాలకు రక్షణ లేకుండా పోతుందనే వాదన ఉంది.
     
    మంత్రి కేటీఆర్‌ దష్టికి కొనుగోళ్లు..
    ఈ విషయాన్ని రాష్ట్ర మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే కె.తారకరామారావు దష్టికి ఆయనకు సన్నిహితంగా ఉండే ఓ డైరెక్టర్‌ తీసుకెళ్లినట్లు సమాచారం. అవినీతిరహితంగా, పారదర్శకంగా సెస్‌ సేవలందించాలని మంత్రి కేటీఆర్‌ పదేపదే చెబుతుంటారు. అందుకు భిన్నంగా టెండర్లు లేకుండానే భారీ ఎత్తున ట్రాన్స్‌ఫార్మర్లు, స్తంభాలు కొనుగోలు చేయడంపై సెస్‌ డైరెక్టర్‌ మంత్రికి వివరించినట్లు సమాచారం. సెస్‌లో ట్రాన్స్‌ఫార్మర్ల కొనుగోలు వ్యవహారంపై ‘సాక్షి’లో బుధవారం ప్రచురితమైన కథనంపై మంత్రి పేషీ నుంచి ఆరా తీసినట్లు సమాచారం. దీనికి సెస్‌ కీలక అధికారులు సంబంధిత పత్రాలతో సమాధానం ఇచ్చేందుకు సిద్ధమైనట్లు తెలిసింది. ఈ విషయమై సెస్‌ ఎండీ కె.నాంపల్లిగుట్టను బుధవారం సాయంత్రం ఫోన్‌లో వివరణ కోరగా.. సంస్థ పెద్దలనే ఆ విషయం అడగండి అంటూ ఫోన్‌ కట్‌ చేయడం గమనార్హం. 
     
     
మరిన్ని వార్తలు