బైక్‌ ట్యాక్సీలతో బెంబేలే!

16 Mar, 2020 09:45 IST|Sakshi

నగరంలో ఎడాపెడా దూసుకుపోతున్న బైక్‌ ట్యాక్సీలు

వినియోగదారులకు హెల్మెట్‌ ఇవ్వకుండానే రైడింగ్‌

రోజుకు 15 గంటలు పని చేసేలా డ్రైవర్లకు టార్గెట్లు

రిజిస్టర్‌ చేసుకునేది ఒకరు.. డ్రైవింగ్‌ చేసేది మరొకరు

దీన్ని కనిపెట్టేలా క్రాస్‌ చెకింగ్‌ మెకానిజం లేని వైనం

సాక్షి, సిటీబ్యూరో: నగర వాసులకు రెంటల్‌ బైక్స్‌ ఓ రకంగా నరకం చూపిస్తుంటే... బైక్‌ ట్యాక్సీలు మరో రకంగా ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. నగరంలోని అనేక మంది ఈ బైక్‌ ట్యాక్సీల వినియోగదారులకు  కొన్ని అనుభవాలు నిత్యం ఎదురవుతూనే ఉంటున్నాయి. వీటినిపట్టించుకునే నాథుడు లేకపోవడంతో పాటుఎవరికి ఫిర్యాదు చేయాలో తెలియక కొందరు, మనకెందుకులే అనే భావనతో మరికొందరువదిలేస్తున్నారు. ఈ తరహాఉల్లంఘనలు, నిర్లక్ష్యాలు కొన్ని సందర్భాల్లో భద్రతపై నీలినీడలు వ్యాపింపజేసే ప్రమాదం ఉందన్నది నిర్వివాదాంశం. ప్రస్తుతం సిటీలో ప్రధానంగా మూడు సంస్థలు ఈ బైక్‌ ట్యాక్సీ సర్వీసుల్ని అందిస్తున్నాయి. చిన్నాచితకా మరికొన్ని ఉన్నాయి. ఇవన్నీ స్మార్ట్‌ఫోన్లలో యాప్‌ల ఆధారంగా పని చేసే సంస్థలే. 

ప్రత్యేక అనుమతి లేకుండానే...
రాజధానిలో ఆటోలు నడపాలన్నా, ట్సాక్సీలు డ్రైవ్‌ చేయాలన్నా ఆ డ్రైవర్లకు ప్రత్యేక అనుమతులు కావాలి. ఈ వాహనాలకు ఎల్లో నెంబర్‌ ప్లేట్లు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. కమర్షియల్‌ వాహనాలు కావడంతో డ్రైవర్ల అనునిత్యం ప్రయాణికుల్ని రవాణా చేస్తుంటారు. ఈ నేపథ్యంలోనే అత్యవసర సమయాల్లో స్పందించడానికి వీరికి ప్రథమ చికిత్స నిర్వహణపై అవగాహన అవసరం. దీనికి సంబంధించిన శిక్షణ ఇచ్చిన తర్వాతే ఈ వాహనాల డ్రైవర్లకు ఆర్టీఏ విభాగం బ్యాడ్జ్‌ నెంబర్‌ ఇస్తుంది. కమర్షియల్‌ డ్రైవింగ్‌ లైసెన్స్‌తో పాటు ఈ నెంబర్‌ కూడా ఉంటేనే వాళ్లు ఆయా వాహనాలు నడపడానికి, ప్రయాణికుల్ని తీసుకుపోవడానికి అర్హులు. అయితే బైక్‌ ట్యాక్సీల విషయంలో ఇలాంటి నిబంధనలు ఏవీ అమలులో లేవు. వైట్‌ నెంబర్‌ ప్లేట్లతోనే, సాధారణ డ్రైవింగ్‌ లైసెన్సులు కలిగిన వాళ్లే ఆయా సంస్థల వద్ద రిజిస్టర్‌ చేసుకుని బైక్‌ ట్యాక్సీలు నడిపేస్తున్నారు. రహదారిపై ఉన్న ట్రాఫిక్‌ పోలీసులకు సైతం ఏది బైక్‌ ట్యాక్సీనో, ఏది సొంత బైకో అర్థం కాని పరిస్థితి. 

రెండో హెల్మెట్‌ అత్యంత అరుదే...
దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు గతంలో ఇచ్చిన తీర్పును అనుసరించి ద్విచక్ర వాహనంపై ప్రయాణించే డ్రైవర్‌తో పాటు వెనుక కూర్చున్న వ్యక్తి (పిలియన్‌ రైడర్‌) సైతం కచ్చితంగా హెల్మెట్‌ ధరించాల్సిందే. ఈ నిబంధనను ఇప్పుడిప్పుడే రాజధానిలోని మూడు కమిషనరేట్లకు చెందిన అధికారులు అమలు చేస్తున్నారు. దీని ప్రకారం చూస్తే బైక్‌ ట్యాక్సీని నడిపే డ్రైవర్‌ కచ్చితంగా తన వద్ద రెండు హెల్మెట్లు కలిగి ఉండాలి. ఒకటి తాను ధరించినా రెండోది తనను బుక్‌ చేసుకున్న ప్రయాణికుడికి అందించాలి. కమర్షియల్‌ వాహనం కావడంతో ఈ బాధ్యత డ్రైవర్‌ పైనే ఉంటుంది. అయితే నగరంలో సంచరిస్తున్న బైక్‌ ట్యాక్సీ డ్రైవర్‌ కమ్‌ ఓనర్ల వద్ద ఒక హెల్మెట్‌ మాత్రమే కనిపిస్తుంటుంది. తన కస్టమర్‌కు కూడా అందించడానికి రెండో హెల్మెట్‌ కలిగి ఉండటం అనేది అత్యంత అరుదైన సందర్భంలోనే కనిపిస్తోంది. రెండు హెల్మెట్లు కలిగి ఉండాలంటూ ఈ డ్రైవర్లకు రిజిస్ట్రేషన్‌ చేసే సంస్థలు చెప్తున్నా అమలు చేస్తున్న వారు మాత్రం ఐదు శాతం కూడా ఉండట్లేదు. కొన్ని సంస్థలు అందించినవి సైతం తక్కువ సమయంలోనే ‘మాయం’ అవుతున్నాయి. 

పని వేళల అమలులో ఆమడ దూరం...
ఆ కేటగిరీలో రిజిస్టర్‌ చేస్తున్నా, లేకున్నా కిరాయికి సంచరించే బైక్‌లు సైతం కమర్షియల్‌ వాహనాల కిందికే వస్తాయి. మోటారు వాహన చట్టం (ఎంవీ యాక్ట్‌) ప్రకారం ఈ వాహనాల డ్రైవర్లకు కచ్చితంగా పని గంటలు అమలు కావాల్సిందే.  వీటి డ్రైవర్లు రోజుకు గరిష్టంగా పది గంటల (విశ్రాంతితో కలిపి) చొప్పున వారానికి గరిష్టంగా 48 గంటలు మాత్రమే పని చేయాల్సి ఉంటుంది. డ్రైవర్‌ విధులు నిర్వర్తించే కనీస కాలం ఎనిమిది గంటల్లో కచ్చితంగా రెండు గంటలు విశ్రాంతి తీసుకోవాలి. అయితే బైక్‌ ట్యాక్సీ నిర్వాహక సంస్థలు పక్కాగా ఇన్ని ట్రిప్పులు వేయాలంటూ డ్రైవర్లకు పరోక్షంగా టార్గెట్లు విధిస్తున్నాయి. దీన్ని పూర్తి చేసిన వారికే ఇన్సెంటివ్స్‌ ఇస్తున్నాయి. దీంతో ఒక్కో డ్రైవర్‌ కనిష్టంగా 15 గంటల నుంచి గరిష్టంగా 18 గంటల వరకు పరుగులు పెట్టాల్సి వస్తోంది. ఇది కొన్ని సందర్భాల్లో ఉల్లంఘనలకు, ప్రమాదాలకు కారణం అవుతోంది. ఫలితంగా ఇతర వాహనచోదకులు, పాదచారులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. 

పేరొకరిది... వచ్చేది ఇంకొకరు...
బైక్‌ ట్యాక్సీల నిర్వహణ సంస్థలు భద్రత ప్రమాణాల్లో భాగంగా తమ డ్రైవర్ల రిజిస్ట్రేషన్‌ను పక్కా చేశాయి. ఇలా చేసుకున్న వారి వివరాలన్నీ ఆ సంస్థ వద్ద ఉంటాయి. యాప్స్‌ను వినియోగించి బైక్‌ ట్యాక్సీని బుక్‌ చేసుకున్నప్పుడు ప్రయాణికుడికి తాను ఎక్కబోతున్న వాహనం డ్రైవర్‌ పేరు, నెంబర్‌తో పాటు అతడి రేటింగ్‌ సైతం అందులో కనిపిస్తుంది. ఏ సమయంలో ఎక్కడకు ప్రయాణం చేసినా భద్రంగా గమ్యం చేర్చడానికి ఈ ఏర్పాటు ఉంది. అయితే ఇటీవల కాలంలో నగరంలో బైక్‌ ట్యాక్సీలుగా రిజిస్ట్రేషన్‌ చేసుకున్న వారు ఒకరు ఉంటే... డ్రైవింగ్‌ చేస్తూ వస్తున్న వారు మరొకరు ఉంటున్నారు. ఇలా ‘మార్పిడి’ చేసుకుంటున్న వారిలో కుటుంబీకులే ఉంటే ఫర్వాలేదు కాని కొన్ని సందర్భాల్లో బయటి వారూ ఉంటున్నారు. వేరే వ్యాపకాలు, వ్యాపారాలు, ఉద్యోగాల్లో ఉన్న వారు, గతంలో అనివార్య కారణాలతో నిర్వాహకులు ‘బ్లాక్‌’ చేసిన డ్రైవర్లు ఈ మార్గం అనుసరిస్తున్నారు. దీన్ని కనిపెట్టడానికి అనువైన క్రాస్‌ చెకింగ్‌ మెకానిజం నిర్వాహకుల వద్ద ఉండట్లేదు. ఇటు ట్రాఫిక్‌ పోలీసులు, అటు ఆర్టీఏ అధికారులు... వీరిలో ఎవరికీ ఈ విషయాలు పట్టట్లేదు. 

పార్ట్‌టైమర్లతో ఇబ్బంది లేదు
నగరంలో సంచరిస్తున్న బైక్‌ ట్యాక్సీ డ్రైవర్లలో రెండు రకాలైన వాళ్లు ఉంటున్నారు. దీన్నే వృత్తిగా చేసుకుని జీవనం సాగిస్తున్న వాళ్లు మొదటి రకమైతే... పార్ట్‌టైమ్‌గా పని చేస్తున్న వాళ్లు ఇంకో రకం. రెండో కేటగిరీకి చెందిన వారిలో స్టూడెంట్లు, ఉద్యోగులు ఉంటున్నారు. వీరు తమ విధులకు వెళ్లేప్పుడు, తిరిగి వచ్చేప్పుడు యాత్రమే ఈ యాప్స్‌ను ఆన్‌ చేసుకుని, ఆయా మార్గాల్లో ప్రయాణించే వారిని మాత్రమే తరలిస్తుంటారు. వీరి వల్ల పెద్దగా ఇబ్బందులు రావట్లేదు. మొదటి కేటగిరీకి చెందిన వారే ఎక్కువ ట్రిప్పులు వేస్తే అధిక మొత్తం సంపాదించుకోవచ్చనే ఉద్దేశంతో,  నిర్వాహకులు అందించే ఇన్సెంటివ్స్‌ కోసం టార్గెట్స్‌ పూర్తి చేయడానికో ఎడాపెడా నడిపేస్తూ ఇబ్బందులు కలిగించడంతో పాటు ప్రమాదాలకు కారణం అవుతున్నారు. ఈ బైక్‌ ట్యాక్సీలకు అనుమతులు ఇచ్చేది  ఆర్టీఏ విభాగమే.– ట్రాఫిక్‌ విభాగం ఉన్నతాధికారి 

మరిన్ని వార్తలు