నల్లగొండలో మృతులకు పెన్షన్‌..!

22 Dec, 2019 08:23 IST|Sakshi

క్షేత్రస్థాయిలో పరిశీలనకు ఆదేశించిన ప్రభుత్వం

పంచాయతీ కార్యదర్శుల ద్వారా వివరాల సేకరణ

సాక్షి, నల్లగొండ : మృతులకు పెన్షన్లు మంజూరవుతున్నాయి. అయితే లబ్ధిదారులు చనిపోయినా ప్రభుత్వం ప్రతి నెలా మంజూరు చేస్తోంది. అయితే చనిపోయిన వారి వివరాలను ఎప్పటికప్పుడు జాబితానుంచి తొలగించని కారణంగా ప్రతినెలా ప్రభుత్వం నల్లగొండ జిల్లాలో ఉన్న పెన్షన్‌దారుల ఆధారంగా డబ్బులు విడుదల చేస్తోంది. అందులో మృతిచెందిన వారికి కూడా డబ్బులు విడుదలవుతున్నాయి. మృతుల కుటుంబాలు తీసుకోకపోయినా జిల్లా అకౌంట్‌లో డబ్బులు జమ అవుతున్నాయి. వాటిని తగ్గించేందుకు ప్రభుత్వం మృతుల వివరాలను తేల్చాలని అధికారులను ఆదేశించింది. దీంతో గ్రామస్థాయిలో పంచాయతీ కార్యదర్శులకు ఆ బాధ్యతను అప్పగించారు. గ్రామీణ ప్రాంతాల్లో 2,092 మంది పెన్షన్‌దారులు మృతి చెందినట్లుగా ఇప్పటికే గుర్తించారు.

పింఛన్‌ లబ్ధిదారులు ఇలా..
జిల్లా వ్యాప్తంగా ఆసరా లబ్ధిదారులు 1,87,962, వృద్ధాప్య 63,099, దివ్యాంగులు 30, 936, వితంతు 76,021, చేనేత 2,951, కల్లుగీత 7,578, ఒంటరి మహిళలు 7,377 పింఛన్లు పొందుతున్నారు.

మృతుల వివరాలు సేకరించని అధికారులు
ప్రతి నెలా పెన్షన్‌ లబ్ధిదారుల్లో ఎవరైనా చనిపోతే వెంటనే వారి వివరాలను జాబితా నుంచి తొలగించాలి. కానీ వివరాలను ఎప్పటికప్పుడు సేకరించడంలో జాప్యం జరుగుతోందని విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతో ప్రతి నెలా ప్రభుత్వం ఆ కోటా ప్రకారం నిధులను విడుదల చేస్తోంది. అవన్నీ సంబంధిత పెన్షన్‌ దారులు తీసుకున్నా మిగిలిన వన్నీ ప్రభుత్వ ఖాతాల్లోనే ఉండిపోతున్నాయి. కొందరు ఏటీఎం ఉన్నవారు చనిపోయినప్పటికీ వారికి సంబంధించిన వారు డ్రా చేస్తున్న సంఘటనలు ఉన్నా యి. దీంతో చనిపోయిన లబ్ధిదారులు డేటాను సేకరించాలని గ్రామ స్థాయిలో పంచాయతీ

కార్యదర్శులకు అప్పగించారు. 
మంచానికే పరిమితమైన వారి పెన్షన్‌ కార్యదర్శుల ద్వారా..
గ్రామాల్లో వేలి ముద్రలు పడని వృద్ధులకు సంబంధించి, పోస్టాఫీసులకు వచ్చి పెన్షన్‌ తీసుకోలేని వృద్ధులకు సంబంధించి పెన్షన్‌ బాధ్యతలను ఆయా గ్రామ పంచాయతీ కార్యదర్శులకు అప్పగించారు.  వేలి ముద్ర వేసి వారే వారికి పెన్షన్లు ఇవ్వాలి. 

కార్యదర్శుల ద్వారా 12,178 పెన్షన్లు
పంచాయతీ కార్యదర్శుల ద్వారా 12,178 పెన్షన్లను జిల్లా వ్యాప్తంగా ఆయా గ్రామాల్లో పంపిణీ చేస్తున్నారు. అందులో మృతిచెందిన వారి డేటాను సేకరించాలని ఆదేశాలు అందడంతో వారం రోజులుగా కార్యదర్శులు సేకరించారు. అయితే జిల్లా వ్యాప్తంగా కార్యదర్శుల ద్వారా పెన్షన్‌ పొందే లబ్ధిదారుల్లో 2,092 మంది చనిపోయినట్లు వెల్లడించారు. ఆయా గ్రామాల్లో అన్ని పరిశీలించి డీఆర్‌డీఏకు నివేదికను అప్పగించారు.

ప్రతినెలా రూ.40లక్షలు.. 
తెలంగాణ ప్రభుత్వం పెన్షన్‌ దారుల ఆధారంగా ఆయా జిల్లాలకు నిధులు చేస్తోంది. అయితే జిల్లాలో 2,092 మంది చనిపోవడం వల్ల వారికి సంబంధించి దాదాపు రూ.40లక్షలు అకౌంట్లలో ఉండిపోతున్నాయి. ప్రస్తుతం పెన్షన్‌ జాబితా నుంచి వాటిని తొలగించడం వల్ల మంజూరీ నిధుల్లో కొంత ప్రభుత్వానికి కేటాయింపులు తగ్గనున్నాయి.

గామస్థాయిలో సర్వే పూర్తయింది
గ్రామస్థాయిలో పెన్షన్‌దారుల మృతుల వివరాలు సేకరించాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందాయి. దీంతో కార్యదర్శులు ద్వారా విచారణ చేయించాం. జిల్లా వ్యాప్తంగా పంచాయతీ కార్యదర్శులు సర్వే నిర్వహించారు. ప్రస్తుతం 2,092 మంది మృతి చెందినట్లు గుర్తించారు. త్వరలో పట్టణ స్థాయిలో సర్వే నిర్వహిస్తాం. 
– డీపీఎం మోహన్‌రెడ్డి  

మరిన్ని వార్తలు