విద్యార్థుల సొమ్ము.. రూ.2కోట్లు హాంఫట్

20 Oct, 2014 03:01 IST|Sakshi
విద్యార్థుల సొమ్ము.. రూ.2కోట్లు హాంఫట్

సీబీసీఐడీ విచారణకు ఆదేశించిన విద్యాశాఖమంత్రి
 
కొత్తగూడెం: వేలు కాదు.. లక్షలు కాదు.. ఏకంగా రెండుకోట్ల రూపాయలను అక్రమార్కులు గుటకాయ స్వాహా చేశారు. కొత్తగూడెంలోని యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్(యూసీఈ) విద్యార్థుల ఉపకార వేతనాలు, మెస్, కాస్మొటిక్ బిల్లులకు సంబంధించిన ఈ డబ్బును అక్రమార్కులు గత ఐదేళ్లలో కాజేశారు. ఈ మొత్తం దాదాపు రెండుకోట్ల రూపాయలు ఉంటుందని అంచనా.
 
ఇలా బయటపడింది..
ఈ స్వాహాపర్వాన్ని ఇక్కడి విద్యార్థులే బయట పెట్టారు. విద్యార్థులకు సంబంధించిన ఉపకా ర వేతనాలు, మెస్ బిల్లులు, లైబ్రరీ ఫీజులకు సంబంధించిన నిధులు నేరుగా కళాశాల ఖాతాలోకి వెళతాయి. బ్యాంక్ ఖాతా లేని విద్యార్థుల కు సంబంధించిన ఉపకార వేతనాలను కూడా ప్రిన్సిపాల్‌కు ఉన్న ప్రత్యేకాధికారాలతో వేరే అ కౌంట్‌లో జమ చేసే అవకాశముంది. ఇలా గత ఐదేళ్లుగా వస్తున్న డబ్బును స్వాహా అవుతున్నట్టుగా విద్యార్థులకు అనుమానం వచ్చింది. దీ నిపై వారు ఏడాది క్రితం కాకతీయ యూనివర్సిటీ అధికారులకు సమాచారమిచ్చారు.

వారు స్పందించి కళాశాల ప్రిన్సిపాల్‌ను వివరణ కోరి నట్టు సమాచారం. ప్రిన్సిపాల్ ఏమి చెప్పారో ఏమోగానీ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇక లాభం లేదనుకున్న విద్యార్థులు.. గత ఆగస్టులో వారం రోజులపాటు నిరాహార దీక్ష చేశారు. ఎస్పీ రంగనాథ్ వెంటనే స్పందించారు. ఈ కళాశాలను ఆయన సందర్శించి, పోలీసు శాఖ నుంచి ప్రాథమిక విచారణ జరిపించగా.. నిధుల స్వాహా నిజమేనని, ఈ మొత్తం దాదాపు రెండుకోట్ల రూపాయల వరకు ఉండవచ్చని తేలినట్టుగా సమాచారం.

క్లర్కులే అక్రమార్కులా...?!
యూసీఈకి సంబంధించిన జమాఖర్చులను క్లర్కులే చూస్తుంటారు. విద్యార్థుల స్కాలర్‌షిప్‌తోపాటు మెస్, కాస్మోటిక్స్ బిల్లులు కూడా వస్తుంటాయి. ఈ కళాశాలలో మొత్తం అన్ని బ్రాంచిలలో కలిపి సుమారు 300మంది విద్యార్థినీ విద్యార్థులు ఉన్నారు. వీరికి సంబంధించి గత ఐదేళ్లలో వచ్చిన కొందరి ఉపకార వేతనాలు, బిల్లులు దాదాపు రెండుకోట్ల రూపాయలను క్లర్కులే డ్రా చేసుకున్నట్టు తెలిసింది.

సీబీ సీఐడీ విచారణకు మంత్రి ఆదేశం
ఈ స్వాహాపర్వంపై కళాశాల విద్యార్థులు ఇటీవల విద్యాశాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డిని కలిసి వినతిపత్రమిచ్చారు. ఆయన స్పందించి, ప్రాథమిక సమాచారాన్ని సేకరించారు. స్వాహా నిజమేనని తెలీడంతో పూర్తిస్థాయి విచారణ కోసం సీబీసీఐడీని ఆదేశిస్తూ శనివారం రాత్రి ఆదేశాలు జారీ చేశారు.

మరిన్ని వార్తలు