దోపిడీకి గేటు తీశారు!

10 Feb, 2020 13:19 IST|Sakshi
శ్రీకర్‌ మల్టీసర్వీసెస్‌ నిజామాబాద్‌ పేరుతో తీసుకున్న చెక్కు

నర్సరీలకు గేట్ల పేరుతో నిధులు గోల్‌మాల్‌

రూ. 6 వేలకు తయారయ్యే గేట్‌కు రూ.14 వేల బిల్లు 

జిల్లాలో 553 పంచాయతీల్లోని నర్సరీలకు బిగింపు!

హైదరాబాద్, నిజామాబాద్‌లో తయారు చేయించిన వైనం

గుట్టుగా జీపీల నుంచి తీసుకున్న చెక్కుల సుమారు రూ. 70 లక్షలు

ఎంపీడీఓలతో జిల్లాస్థాయి ఉన్నతాధికారి మంత్రాంగం

ప్రతి జీపీలో వన నర్సరీ ఏర్పాటు ఆ అధికారికి వరంగా మారింది. నర్సరీల్లోని మొక్కలను జంతువుల బారినుంచి రక్షించేందుకు గేట్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం సూచించింది. స్థానికంగా మంచి నాణ్యతతో ఒక్కో గేటు రూ.6 నుంచి 7 వేలకు తయారు చేయించవచ్చు. సదరు అధికారి మాత్రం ఒక్కోగేటును రూ. 14 వేలకు తయారు చేయించినట్లు జీపీల నుంచి చెక్కులు తీసుకున్నారు. దీనికి ఎంపీడీఓలను పావులుగా వినియోగించుకున్నారు. ఇలా సగానికి సగం నిధులను బొక్కేశారు. స్థానికంగా తయారు చేయించాల్సిన గేట్లను నిజామాబాద్, హైదరాబాద్‌లో తయారు చేయించడంలో మతలబు ఊహించుకోవచ్చు. జిల్లాలోని 553 జీపీలకు సంబంధించి దాదాపు రూ.70 లక్షల మేర చెక్కులు తీసుకోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.

సాక్షి, పరిగి: పంచాయతీ నిధులు పక్కదారి పట్టాయి. 14వ ఆర్థికసంఘం నిధులను వన నర్సరీ గేట్ల పేరుతో దుర్వినియోగం చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లాస్థాయి ఉన్నతాధికారి ఒకరు లోపాయికారిగా వ్యవహరించి నిధులను బొక్కేశారని జిల్లాలోని ఆయా మండలాల సర్పంచ్‌లు గగ్గోలు పెడుతున్నారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. హరితహారం కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. పల్లెలను పచ్చని పందరిగా మార్చాలని భావించింది. ఈ నేపథ్యంలో ప్రతి గ్రామ పంచాయతీలో నర్సరీ ఏర్పాటు చేయాలని ఆదేశిస్తూ ఆ బాధ్యతలను సర్పంచ్‌లకు అప్పగించింది.

ఇందుకోసం 14వ ఆర్థిక సంఘం నిధులను వినియోగించుకోవచ్చని చెప్పింది. జంతువులు, మేకలు, గొర్రెల నుంచి నర్సరీల్లోని మొక్కలను కాపాడేందుకు గేట్లు బిగించుకోవాలని జీపీల సర్పంచ్‌లకు అధికారులు సూచించారు. అయితే, ఇందులో తన పవర్‌ను వినియోగించి ఓ జిల్లాస్థాయి అధికారి నిధులను బొక్కేసేందుకు ప్రణాళిక రచించారు. రూ. 6–7 వేలకు తయారయ్యే ఒక్కో గేట్లకు ఏకంగా రెండింతల నిధులు వెచి్చంచారు. రూ.14 వేలతో ఒక్కో గేటును కొనుగోలు చేశారు. వాటిని ఏకంగా హైదరాబాద్‌తోపాటు నిజామాబాద్‌లో తయారు చేయించారు.

సర్పంచ్‌లకు ఎలాంటి సమాచారం ఇవ్వ కుండానే గేట్లను పంపించారు. జిల్లాలోని 553 పంచాయతీల్లో ఈ గేట్ల కోసం సుమారు 70 లక్షలను వెచి్చంచారు. ఈమేరకు సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శుల నుంచి చెక్కులు తీసేసుకున్నారు. ఇందులో సగానికిపైగా సదరు ఉన్నతాధికారి కమీషన్‌ రూపంలో మింగేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాగా, ఈ గేట్ల వ్యహహారం అనుమానాస్పదంగా ఉండటంతో కుల్కచర్లలోని కొందరు సర్పంచ్‌లు తామే సొంతంగా తయారు చేయించుకున్నారు. అందుకోసం ఒక్కో గేటుకు రూ. 6–7 వేలు వెచి్చంచి అదే నాణ్యతతో స్థానికంగానే తయారు చేయించుకున్నారు.  

నిజామాబాద్‌ అడ్డాగా కుంభకోణం  
జిల్లాలో వెలుగు చూసిన అవకతవకల వ్యవహారం ఆనవాళ్లు నిజామాబాద్, హైదరాబాద్‌లో కనిపిస్తున్నాయి. నర్సరీకి బిగించే ఒక్కో గేటుకు రూ.14 వేల ఖర్చు అవుతుందని లోపాయికారిగా సదరు ఉన్నతాధికారి కొటేషన్‌ తయారు తయారు చేయించారు. స్థానికంగా సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శులకు ఏ మాత్రం తెలియకుండా సగం గేట్లను హైదరాబాద్‌లోని రాజధాని వెల్డర్స్‌ దగ్గర, మిగతా సగం గేట్లు నిజామాబాధ్‌లోని శ్రీకర్‌ మల్టీ సర్వీసెస్‌ వద్ద తయారు చేయించారు. ఈ విషయం ఎంపీడీఓలకు చెప్పి వారితో జీపీలకు సమాచారం చేరవేశారు.

ఒకేచోట గేట్లు తయారు చేయించాం.. ఒక్కో గేటుకు రూ.14 వేలు చెక్కుల రూపంలో ఇవ్వాలని సర్పంచ్‌లు, కార్యదర్శులకు ఆదేశాలు జారీ చేశారు. వారితో గుట్టుగా 14వ, ఆర్థిక సంఘం నిధుల నుంచి చెక్కులు రాయించుకుని రూ. లక్షల్లో కమీషన్లు బొక్కేశారు. ఈ గేట్లను స్థానిక వెల్డర్లకు చూయిస్తే ఒక్కో గేటు రూ. 6– 7 వేలకు తయారు చేస్తామని చెబుతుండటంతో సర్పంచ్‌లు, కార్యదర్శులు నోళ్లు వెల్లబెట్టారు. ఈ విషయంలో సమగ్ర విచారణ జరిపించి నిజాలు నిగ్గు తేల్చాలని సర్పంచ్‌లు డిమాండ్‌ చేస్తున్నారు.   

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు