డబ్బుల్‌ దందా

24 Dec, 2019 09:47 IST|Sakshi
దుండిగల్‌లోని నిర్మాణం పూర్తయిన డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు డబుల్‌ బెడ్‌రూం నకిలీ అలాట్‌మెంట్‌ లెటర్‌

డబుల్‌ బెడ్‌ రూం లబ్ధిదారులను నమ్మించి దోచుకుంటున్న దళారులు

ఏకంగా ప్రభుత్వ మోనోగ్రామ్‌నే ముద్రించిన వైనం

ఒక్కొక్కరి నుంచి రూ.2లక్షల వరకూ వసూలు

కుత్బుల్లాపూర్‌లో వెలుగులోకి మోసాలు

కుత్బుల్లాపూర్‌: డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లు దళారులకు కాసులు కురిపిస్తున్నాయి. ఏకంగా ప్రభుత్వ మోనోగ్రామ్‌ను ముద్రించి లెటర్లు కట్టబెట్టి అందిన కాడికి దండుకుంటున్నారు. కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గ పరిధిలో కోట్లాది రూపాయలతో 13,404 డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ల నిర్మాణాలు చేపట్టి పేద ప్రజలకు అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తోంది. ఈ నేపథ్యంలో కొంత మంది దళారులు అమాయకులను మాయ మాటలతో బురడీ కొట్టింది లక్షల్లో దండుకుంటున్నారు. కొంపల్లి ప్రాంతంలో ఓ ప్రైవేట్‌ స్కూల్‌లో పనిచేసే డ్రైవర్లంతా ఓ దళారిని నమ్మి ఏకంగా పది మంది రూ.2 లక్షల చొప్పున డబ్బులు ముట్టజెప్పి ఇప్పుడు లబోదిబోమంటున్నారు. ఈ విషయంపై ‘సాక్షి’ ఆరా తీయగా ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. తన చేతికి మట్టి అంటకుండా ఆ దళారి ఏకంగా రాష్ట్ర సెక్షన్‌ ఆఫీసర్‌ అలాట్‌మెంట్‌ లెటర్‌ మోమో నెంబరు 9016/ఆర్‌హెచ్‌ అండ్‌ సీ, ఏ1/2018–12 లెటర్‌ను ఈనెల 3న అలాట్‌ మెంట్‌ చేస్తున్నట్లు ఇవ్వడం కలకలం రేపింది. అంతే కాకుండా రిఫరెన్స్‌ జిల్లా కలెక్టర్‌ మేడ్చల్‌ ఎల్‌ఆర్‌ నెంబరు 121/662/2018 (28/12/2018)న అనుమతి మంజూరు చేస్తున్నట్లు పేర్కొంటూ లేఖలో ఉన్నాయి. దుండిగల్‌–గండిమైసమ్మ మండల పరిధిలో ఓ డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లు పెన్మత్స జానికికి ఇస్తున్నట్లు అలాట్‌మెంట్‌ లేటర్‌ ఉండడం విశేషం.

దళారుల తెలివి..
కుత్బుల్లాపూర్‌ పరిధిలో మొత్తం 13,404 నిర్మాణాలు దుండిగల్, డీపోచంపల్లి, భౌరంపేట, గాగిల్లాపూర్, కైసర్‌నగర్, దేవేందర్‌నగర్, నిజాంపేట్, బాచుపల్లి ప్రాంతాల్లో నిర్మిస్తున్నారు. గతంలో ఎమ్మెల్యే వివేకానంద్‌ డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ల నిర్మాణ అధికారులతో సమావేశమై పంపిణీ విషయంపై చర్చించగా 2018, డిసెంబరులోనే మొదటి దశలో 2,664, రెండో దశ 2019, మార్చిలో 5,436, మూడో దశ జూన్‌లో 5,104 పంపిణీ చేస్తామని అప్పట్లో ప్రకటించారు. ఇదే అదనుగా భావించిన దళారులు ఆయా ఇళ్లను బూచిగా చూపిస్తూ అమాయకుల వద్ద లక్షల్లో సొమ్మును నొక్కేస్తున్నారు. చాలా తెలివిగా వ్యవహరిస్తూ దళారులు మాత్రం కేవలం ఇళ్లను చూపించే ప్రాంతంలోనే సంచరిస్తూ మిగతా మొత్తాన్ని ఇతరులను ఎరగా వాడుకుంటున్నారు. ఆయా నిర్మాణాల వద్ద వాచ్‌మెన్లుగా పని చేసే వారి నెంబర్లు సేకరించి రాత్రిపూట తాము ఎవరి వద్ద డబ్బులు తీసుకున్నామో వారిని తీసుకు వెళ్లి ఇది మీ ఫ్లాటేనంటూ నమ్మబలుకుతూ అందిన కాడికి దండుకుంటున్నారు. ఇప్పటికే పలు ముఠాలు కుత్బుల్లాపూర్‌ ప్రాంతాల్లో సంచరిస్తూ అమాయకులను మోసం చేస్తున్న విషయం సైతం ఎమ్మెల్యే వివేకానంద్‌కు తెలిసింది. వీరిపై చర్యలు తీసుకోవాలని జీడిమెట్ల పోలీసులను ఆదేశించారు.

నమ్మి మోసపోవద్దు..
దళారులు కొంత మంది నకిలీ లెటర్లు ఇస్తున్న విషయం మా దృష్టికి వచ్చింది. దీనిపై సమగ్ర విచారణ చేపడుతున్నాం. జిల్లా ఉన్నతాధికారులతో ఇప్పటికే మాట్లాడాం. తాము ఎవరికీ లెటర్లు ఇవ్వలేదని అధికారులు స్పష్టం చేశారు. డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ల కేటాయింపు మొత్తం జీహెచ్‌ఎంసీ ఆధీనంలో ఉంటుంది. తాము కేవలం దరఖాస్తుల పరిశీలన చేసి నివేదిక అందజేస్తాం. అమాయకులెవరూ మోసపోవద్దు. కొంతమంది దళారులు ఇళ్లు ఇప్పిస్తామన్నా నమ్మవద్దు. – భూపాల్,    గండిమైసమ్మ, దుండిగల్‌ తహసీల్దార్‌

మరిన్ని వార్తలు