పుస్తకాల దొంగలు

10 Jun, 2019 10:56 IST|Sakshi

నిజామాబాద్‌నాగారం: ప్రభుత్వ పుస్తకాలను ప్రైవేట్‌గా అమ్మకానికి పెడుతున్నారు కొందరు అక్రమార్కులు. విద్యార్థులకు పంపిణీ చేయగా మిగిలిన పుస్తకాలను రాష్ట్ర కార్యాలయానికి తరలించాల్సి ఉంటుంది. అయితే, అలా వెనక్కి పంపించకుండా ఆటో నిండా పుస్తకాలను అక్రమంగా అమ్ముకున్న వైనమిది. జిల్లా కేంద్రంలోని ఎస్సీ గురుకులానికి గతేడాది వచ్చిన పుస్తకాల్లో చాలా వరకూ మిగిలి పోయాయి. నిబంధనలకు విరుద్ధంగా వీటిని విక్రయించి సొమ్ము చేసుకునేందుకు అధికారులు ప్రింటింగ్‌ప్రెస్‌కు తరలించారు. గురుకుల పాఠశాల అధికారులు గుట్టుచప్పుడు కాకుండా నడిపించిన ఈ తతంగం ‘సాక్షి’ కంట పడడంతో ప్రింటింగ్‌ప్రెస్‌ నుంచి మరో స్థలానికి మార్చారు. సుమారు రూ.3.50 లక్షలకు పైగా విలువ చేసే వెయ్యి పుస్తకాలను ఆటోలో తరలించి, అమ్మకానికి పెట్టడం గమనార్హం. ఈ విషయమైన సంబధిత అధికారులను వివరణ కోరగా తమకేమీ తెలియదని బుకాయించడం విశేషం.

నిబంధనలకు విరుద్ధంగా.. 
పేద విద్యార్థులు చదుకోవాలన్న ఉద్దేశ్యంతో ప్రభుత్వం ఉచితంగా పుస్తకాలను సరఫరా చేస్తోంది. ఐదో తరగతికి సంబంధించిన పుస్తకాల సెట్‌ ధర రూ.280 కాగా, ఆరో తరగతి రూ.363, ఏడో తరగతికి రూ.407, ఎనిమిదో తరగతికి రూ.520, తొమ్మిదో తరగతి పుస్తకాలకు రూ.584 చొప్పున ధర ఉంటుంది. అయితే, ప్రభుత్వం వీటిని ఉచితంగా సరఫరా చేస్తుంది. ఆయా పుస్తకాలపై ఫ్రీ అని కూడా ముద్రించి ఉంటుంది. ఆయా పుస్తకాలను పాఠశాలకు సరఫరా చేయగా, వాటిని విద్యార్థులకు పంపిణీ చేయాలి. ఏమైనా పుస్తకాలు మిగిలితే వాటిని నిబంధనల ప్రకారం రాష్ట్ర కార్యాలయానికి పంపించాల్సి ఉంటుంది. కానీ ఇక్కడి అధికారులు మాత్రం మిగిలిన పుస్తకాలను వెనక్కి పంపించకుండా బహిరంగ మార్కెట్‌లో అమ్మేందుకు ప్రయత్నించారు. వాస్తవానికి పుస్తకాలను బయట ఎట్టి పరిస్థితులో విక్రయించరాదు. కానీ, పాఠశాలకు సంబంధించిన పుస్తకాలు బహిరంగ మార్కెట్‌లోకి వెళ్లడం అనుమానాలకు తావిస్తోంది.

రూ.లక్షల్లో సొమ్ము చేసుకున్నారు.. రెండు, మూడు సంవత్సరాల క్రితం ఏర్పాటైన ఎస్సీ గురుకుల పాఠశాలల్లో 5వ తరగతి నుంచి 7వ తరగతి వరకు విద్యార్థులకు ప్రవేశం కల్పించారు. ఈ సంవత్సరం 10వ తరగతి ప్రారంభం కానుంది. ప్రతి గురుకుల పాఠశాలలో ఒక్కో తరగతిలో రెండు సెక్షన్లు ఉంటాయి. ఒక్కో సెక్షన్‌లో 40 మంది చొప్పున మొత్తం 80 మంది విద్యార్థులు ఉంటారు. కానీ కొన్ని స్కూళ్లలో 80 మంది విద్యార్థులు లేరు. ఈ క్రమంలో ప్రతి గురుకుల పాఠశాలకు సరఫరా చేసినట్లే ఆయా స్కూళ్లకు కూడా పుస్తకాలను సరఫరా చేశారు. ఇలా మిగిలి పోయిన పుస్తకాలను నిబంధనల ప్రకారం హైదరాబాద్‌లోని హెడ్‌ఆఫీస్‌కు తరలించాలి. చాలా చోట్ల పుస్తకాలను వెనక్కి పంపించారు. అయితే, జిల్లా కేంద్రంలో ఓ గురుకుల పాఠశాలకు సంబంధించిన పుస్తకాలను మాత్రం వెనక్కి పంపించలేదు. ఈ పుస్తకాలను విక్రయించేందుకు ఇటీవల ఆటోలో ఓ ప్రింటింగ్‌ ప్రెస్‌కు తరలించారు. వాస్తవానికి ఉచిత పుస్తకాలను అమ్మడం, కొనడం నేరం. కానీ, వాటిని విక్రయించి సొమ్ము చేసుకోవాలని కొందరు యత్నించడం విశేషం. గత రెండేళ్లకు సంబంధించి మిగిలి పోయిన పుస్తకాలను విక్రయించేందుకు తరలించినట్లు విశ్వసనీయంగా తెలిసింది.
 
విచారణ చేయిస్తా.. 
ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వ పుస్తకాలను విక్రయించరాదు. మిగిలి పోయిన పుస్తకాలను హైదరాబాద్‌కు పంపించాలి. మా గురుకులాలకు సంబంధించిన పుస్తకాలు ఎవరైనా బయటకు విక్రయించినట్లు తెలిస్తే విచారణ చేసి చర్యలు తీసుకుంటాం. క్లీన్‌ అండ్‌ గ్రీన్‌ కింద ఫర్నిచర్, ఇతర పనికి రాని వస్తువులను మాత్రమే ప్రత్యేక కమిటీ ద్వారా విక్రయించి, వచ్చిన డబ్బులు స్కూల్‌ ఖాతాలో జమా చేయాలి. పుస్తకాలు మాత్రం అమ్మరాదు. – సింధూ, రీజినల్‌ కో–ఆర్డినేటర్‌ 

మరిన్ని వార్తలు