‘ఇందిరమ్మ’ అవినీతిపై హౌసింగ్ పీడీ ఫిర్యాదు

9 Aug, 2014 03:47 IST|Sakshi
‘ఇందిరమ్మ’ అవినీతిపై హౌసింగ్ పీడీ ఫిర్యాదు

ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన అధికారులు గృహ నిర్మాణాల అక్రమాల చిట్టా విప్పుతున్నారు. 2004 నుంచి 2014 వరకు జిల్లావ్యాప్తంగా 13,605 ఇళ్లకు సంబంధించి సుమారు రూ.17.50 కోట్లు దుర్వినియోగం అయినట్లు గుర్తించారు. ఈ మేరకు జాబితాను శుక్రవారం గృహ నిర్మాణ శాఖ పీడీ నర్సింహారావు రాజధానికి చేరుకుని అడిషనల్ డీఐజీ కార్యాలయంలో సీఐడీ ఐజీపీ చారుసిన్హాకు నివేదించారు.
 
ఇందిరమ్మ ఇళ్ల మంజూరు.. అనర్హులకు బిల్లుల చెల్లింపు.. పక్కదారి పట్టిన నిధులు.. అవినీతిలో ఎవరి పాత్ర ఎంత..? వంటి అంశాలతో రూపొందించిన లెక్కలను అధికారులకు సమర్పించారు. అక్రమాలు జరిగిన ప్రాంతాల్లో మొదటిస్థానంలో మంథని డివిజన్ నిలవగా.. రెండో స్థానంలో హుజూరాబాద్‌ను పేర్కొన్నారు.
 
ముకరంపుర : ‘గృహ నిర్మాణం అక్రమాల పుట్ట. ఎక్కడా లేని అవినీతి ఈ శాఖలో జరిగింది. దీనిని తప్పకుండా ప్రక్షాళన చేయాల్సిన అవసరముంది. ఈ అవినీతి భారీగా పేరుకుపోయింది..’ అంటూ అధికారంలోకొచ్చినప్పటి నుంచీ ముఖ్యమంత్రి కల్వకుంట చంద్రశేఖర్‌రావు చేస్తున్న ప్రకటన. ఇటీవల జిల్లా పర్యటనలో భాగంగా నిర్వహించిన సమీక్ష సమావేశంలోనూ ఇదే విషయమై అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అవినీతిపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకున్నారు..? ఎంత సొమ్ము రికవరీ చేశారు..? ఇళ్లు కట్టకుండానే డ్రా అయిన బిల్లులు ఎంత..? వంటి విషయాలను వెంటనే నివేదించండి.. అంటూ సంబంధిత అధికారులను ఆదేశించారు.
 
విచారణకు  ప్రత్యేక పోలీస్ బృందం
గృహ నిర్మాణ శాఖ పీడీ నర్సింహారావు నివేదిక మేరకు సంబంధిత అధికారులపై పోలీసు ఉన్నతాధికారులు నాలుగు రకాల కేసులు నమోదు చేశారు. విచారణకు ప్రత్యేక పోలీస్‌బృందాన్ని ఏర్పాటు చేశారు. సీఐడీ డీఎస్పీ మహేందర్ ఆధ్వర్యంలో జిల్లాకు చెందిన నలుగురు సీఐలు రాజేశ్, ప్రకాశ్, వెంకటరమణ, రాములుతో కూడిన బృందం ఈ కేసు పర్వాపరాలను లోతుగా విచారించనుంది.
 
ఫిర్యాదులతో వెలుగులోకి..
తమ అక్రమాలు ఎక్కడ బయటపడతాయోనని భావిస్తున్న కొందరు అధికారులు అవినీతిని మరొకరిపై నెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో అందరి అవినీతి వెలుగులోకి వస్తోంది. వారు ఇస్తున్న సమాచారం మేరకు జిల్లాలో మూడు విడతలుగా వివిధ అంశాల్లో అక్రమాలను వెలికితీస్తున్నారు. మొదటి దఫాలో ప్రాథమిక విచారణ పేరిట నియోజకవర్గాల వారీగా థర్డ్ పార్టీ సర్వే చేపట్టారు. ఇందులో 1613 ఇళ్ల విషయంలో రూ.2.54 కోట్ల అవినీతి జరిగినట్లు గుర్తించారు. రెండో విడత గ్రామాలవారీగా విచారణ చేపట్టి 10,648 ఇళ్లకు సంబంధించి రూ.13.43 కోట్లు దుర్వినియోగమైనట్లు తెలుసుకున్నారు. మూడో దఫాలో బిల్లుల చెల్లింపులో జరిగిన అక్రమాలపై ఆరా తీసి 1294 ఇళ్లకు సంబంధించి రూ.1.53 కోట్లు అవినీతి జరిగినట్లు లెక్క తేల్చారు.
 
విచారణలో సీఐడీ
సర్కారు ఆదేశాల మేరకు ఇప్పటికే సీఐడీ అధికారులు విచారణ ప్రారంభించారు. ఇటీవల కలెక్టరేట్‌లోని హౌసింగ్ కార్యాలయంలో వివరాలు సేకరించారు. అవినీతికి పాల్పడిన 42 కేసులు, దీనికి కారణమైన ఉద్యోగుల వివరాలు సేకరించారు. పథకంలో భాగంగా ఇప్పటివరకు జిల్లాకు 3,16,538 ఇళ్లు మంజూరయ్యాయి. ఇందులో 1,78,491 ఇళ్లు పూర్తయ్యాయి. 71,188 ఇళ్లు పూర్తి కావాల్సి ఉంది. 39,336 ఇళ్లు వివిధ దశలో ఉన్నాయి. మరో 27,523 ప్రారంభం కాలేదు. అవినీతిలో హౌసింగ్ శాఖలోని రెగ్యులర్ డెప్యూటీ ఈఈలు ఆరుగురు, ఏఈలు 36 మంది, ఓ సీనియర్ అసిస్టెంట్ ఉన్నట్లు నివేదిక రూపొందించారు.
 
ఇతర శాఖల నుంచి ఆరుగురు ఎంపీడీవోలు, ఇద్దరు తహశీల్దార్లు, 12 మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, 93 మంది అనధికార సిబ్బంది కూడా ఉన్నారు. క్రిమినల్ కేసులున్న వారిలో ఆరుగురు అధికార సిబ్బంది. 33 మంది అనధికార సిబ్బంది ఉన్నారు. వీరిలో సస్పెండ్ అయిన వారిలో ముగ్గురు డెప్యూటీ ఈఈలు, 16 మంది ఏఈలు, ఇతరులు ఇద్దరున్నారు. ఇద్దరు వర్క్ ఇన్స్‌పెక్టర్లను పూర్తిస్థాయిలో తొలగించారు. సస్పెండ్ అయిన వారిలో తిరిగి 18 మంది విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ చిట్టాను సీబీసీఐడీ ఇప్పటికే సేకరించింది. ప్రత్యేక బృంద విచారణలో మరిన్ని కోణాలు బయటపడే అవకాశముంది. సొమ్ము రికవరీతో పాటు అవినీతికి పాల్పడిన వారిపై కఠిన చర్యలకు రంగం సిద్ధమైంది.

మరిన్ని వార్తలు