అయ్యా.. ఎలా మోసపోయావయ్యా..?

7 Feb, 2018 12:30 IST|Sakshi

దమ్మపేట: ఆయన పేరు శ్యాంబాబు. తాను మోసపోయానంటూ బ్యాంక్‌ అధికారి వద్దకు వెళ్లాడు. జరిగినదంతా చెప్పాడు. అంతా విన్న ఆ అధికారి.. ‘‘పేపర్లు చూడడం లేదా? టీవీ చూడడం లేదా? ఈమాత్రం తెలియదా? బ్యాంక్‌ నుంచి ఎప్పుడూ.. ఏ ఒక్కరూ ఫోన్‌ చేయరు. ఎవరైనా మీకు ఫోన్‌ చేసి, ఫలానా బ్యాంక్‌ నుంచి మాట్లాడుతున్నామని అన్నారంటే.. అతడుగానీ, ఆమెగానీ పచ్చి మోసగాళ్లన్న విషయాన్ని గుర్తుంచుకోండి. ఇది తరచుగా పత్రికల్లో, టీవీల్లో వస్తున్నది. అయినా మారు మారకపోతే ఎలాగయ్యా..! ఇలా ఇంకెన్నాళ్లు మోసపోతారయ్యా..?’’ అని, ఆ అధికారి ఆవేదనగా ప్రశ్నించారు. అసలేం జరిగిందంటే... 

దమ్మపేటకు చెందిన అతడి పేరు శ్యాంబాబు. పూర్వపు ఎస్‌బీహెచ్‌ ఖాతాదారుడు. మంగళవారం అతడికి ఎవడో ఫోన్‌ చేశాడు. ‘‘నా పేరు అమిత్‌రెడ్డి. నేను హైదరాబాద్‌ కోఠి ఎస్‌బీఐ బ్రాంచి నుంచి మాట్లాడుతున్నాను. మీ ఎస్‌బీహెచ్‌ ఖాతా, ఏటీఎం నంబర్లు బ్లాక్‌ అయ్యాయి. ఎస్‌బీహెచ్‌ను ఎస్‌బీఐలో విలీనం చేశారు. వెంటనే ఏటీఎం నంబర్, పిన్‌ చెప్పండి. లేకపోతే మీ ఖాతాలోని డబ్బు పోతుంది’’ అన్నాడు. శ్యాంబాబు భయపడ్డాడు. వెంటనే తన ఖాతా నంబర్, ఏటీఎం పిన్‌ చెప్పాడు. ‘‘మీ ఫోన్‌కు ఓటీపీ (వన్‌ టైం పాస్‌వర్డ్‌) వస్తుంది. ఆ నెంబర్‌ కూడా చెప్పాలి’’ అన్నాడు. కొద్దిసేపటి తరువాత మళ్లీ ఫోన్‌ చేశాడు. ఓటీపీ నంబర్‌ను శ్యాంబాబు చెప్పాడు. 

కొద్దిసేపటి తరువాత, శ్యాంబాబు సెల్‌కు మెసేజ్‌ వచ్చింది. ఖాతా నుంచి రూ.500 డ్రా అయిట్టుగా అందులో ఉంది. ఇంకాసేపటిలో మరో మెసేజ్‌ వచ్చింది. ఈసారి రూ.9000 డ్రా అయినట్టుగా అందులో ఉంది. శ్యాంబాబు లబోదిబోమన్నాడు. 

అతడు వెంటనే స్థానిక ఎస్‌బీఐకి పరుగెత్తాడు. అక్కడి మేనేజర్‌ రాఘవేంద్రకుమార్‌కు జరిగినదంతా వివరించాడు. 

‘‘ఇలాంటి సైబర్‌ నేరాలపై పత్రికల్లో, టీవీల్లో, సామాజిక మాధ్యమాల్లో పెద్దఎత్తున ప్రచారం జరుగుతోంది. అయినప్పటికీ ఇలాంటివి ఎలా నమ్మారు?’’ అంటూ, మేనేజర్‌ రాఘవేంద్రకుమార్‌ ప్రశ్నించారు. ఆయన సూచనతో పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసేందుకు బాధితుడు శ్యాంబాబు వెళ్లాడు. 

శ్యాంబాబు నగదు ముంబైలో డ్రా అయినట్టుగా గుర్తించినట్టు మేనేజర్‌ రాఘవేంద్రకుమార్‌ తెలిపారు. 

మరిన్ని వార్తలు