రేషన్‌ బియ్యాన్ని నూకలుగా మార్చి..

28 Aug, 2019 10:53 IST|Sakshi

రేషన్‌ బియ్యం పక్కదారి

నూకలుగా మార్చి సొమ్ము చేసుకుంటున్న వ్యాపారులు 

దర్జాగా సరిహద్దులు దాటిస్తున్న వైనం 

పట్టించుకోని అధికారులు

సాక్షి, కామారెడ్డి: రేషన్‌ బియ్యం పక్కదారి పట్టకుండా సర్కారు ఎన్ని చర్యలు తీసుకుంటుందో.. తమ దందా కొనసాగించడానికి బియ్యం మాఫియా అంతకన్నా ఎక్కువే ప్రయత్నిస్తోంది. ఎప్పటికప్పుడు కొత్త దారులు వెతుకుతూ దర్జాగా అక్రమ దందా సాగిస్తోంది. తాజాగా అధికారుల కళ్లుగప్పేందుకు రేషన్‌ బియ్యాన్ని నూకలుగా మార్చి సరిహద్దులు దాటిస్తూ సొమ్ము చేసుకుంటోంది. 

బియ్యం స్మగ్లర్లు చట్టానికి చిక్కకుండా ఎప్పటికప్పుడు కొత్త దారులు వెతుకుతున్నారు. ముఖ్యంగా పేదలకు పంపిణీ చేసే రే షన్‌ బియ్యంతో సొమ్ము చేసుకోవడానికి అలవా టుపడ్డ కొందరు.. తమ దందాలో కొత్తదారులు వెతుకుతూ రెండు చేతులా సంపాదిస్తున్నారు. రేషన్‌ బియ్యాన్ని ఇతర ప్రాంతాలకు రవాణా చేయాలంటే అనేక సమస్యలు ఎదురవుతాయి. ఎక్కడో ఒక చోట లీకై లారీలకు లారీలు సీజ్‌ అవుతున్న నేపథ్యంలో స్మగ్లర్లు బియ్యాన్ని నూకలుగా మార్చి కొత్త దందా మొదలుపెట్టారు. వేరే రాష్ట్రాల్లో నూక క్వింటాలుకు రూ. 2 వేల నుంచి రూ. 2,200 వరకు ధర పలుకుతోంది. దీంతో వారు ఈ కొత్తదారి వెతుక్కున్నారు.  

నూకలుగా మార్చి.. 
బియ్యం మాఫియా రేషన్‌కార్డుదారులకు కిలోకు రూ. 10 నుంచి రూ. 12 చొప్పున ఇస్తూ రేషన్‌ బియ్యం సేకరిస్తోంది. అనంతరం రేషన్‌ బియ్యాన్ని రీ సైక్లింగ్‌ చేసి నూకలుగా మారుస్తున్నారు. నూకలను బస్తాల్లో నింపి ఏదో ఒక రైస్‌మిల్లు పేరుతో దర్జాగా ఇతర రాష్ట్రాలకు సర ఫరా చేస్తున్నారు. రేషన్‌ బియ్యం అమ్మడానికి ఎందరినో మేనేజ్‌ చేయాల్సి రావడం, అంత చే సినా ఎక్కడో ఒక చోట చిక్కుతుండడంతో ఏ ఇబ్బందీ లేకుండా నూక దందా మొదలుపెట్టారు. కామారెడ్డి, నిజామాబాద్‌ జిల్లాల నుంచి పెద్ద ఎత్తున నూక ఇతర రాష్ట్రాలకు తరలుతోంది. ముఖ్యంగా కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలతో పాటు రాయలసీమ ప్రాంతానికి పెద్ద ఎత్తున నూకలు రవాణా చేస్తున్నట్లు తెలుస్తోంది. నూకలకు సంబంధించిన అన్ని పత్రాలను వెంట తీసుకుని వెళుతుండడంతో ఎవనూ ఆపడం లేదు.  

చిక్కకుండా ఉండేందుకు.. 
రేషన్‌ బియ్యంతో సొమ్ము చేసుకోవడానికి అలవాటుపడ్డ కొందరు బియ్యాన్ని రీసైక్లింగ్‌ చేసి అనుమానం రాకుండా ఇతర బస్తాల్లో నింపి తరలించేవారు. అయితే ఎక్కడో ఒక చోట ఆ బియ్యం తనిఖీలలో చిక్కుతుండడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంతో ఎవరికీ చిక్కకుండా ఉండేందుకు బియ్యాన్ని నూకలుగా మారుస్తున్నట్టు తెలుస్తోంది. రీసైక్లింగ్‌ సమయంలో బియ్యాన్ని నూకగా మార్చి బస్తాల్లో నింపుతున్నారు. అనంతరం రైస్‌మిల్లు వేబిల్లులపై నూకను దర్జాగా తరలిస్తున్నారు. ప్రభుత్వం రైతుల నుంచి ధాన్యాన్ని సేకరించి మిల్లర్లకు అప్పగిస్తోంది. వాళ్లు మరపట్టి బియ్యాన్ని ప్రభుత్వానికి ఇస్తారు. అయితే కస్టమ్‌ మిల్లింగ్‌కు సంబంధించి బియ్యం మరపట్టినపుడు వచ్చే నూక కొంతే అయినప్పటికీ కొన్ని మిల్లుల నుంచి పెద్ద ఎత్తున నూక ఇతర రాష్ట్రాలకు తరలివెళుతోంది.

రేషన్‌ బియ్యాన్ని నూకగా రీ సైక్లింగ్‌ చేస్తుండడం వల్లే ఇది సాధ్యమవుతోందని తెలుస్తోంది. ఈ విషయం అధికారులకు తెలిసినా పట్టించుకోవడం లేదన్న ఆరోపణలున్నాయి. రైతుల నుంచి పూర్తిస్థాయిలో ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేస్తున్నపుడు ఆయా మిల్లులకు ఇచ్చిన ధాన్యానికి ఎంత బియ్యం వస్తుంది, అందుకు నూక ఎంత మిగులుతుందన్నదానిని అధికారులు పరిశీలించాల్సి ఉంది. ఆయా రైస్‌మిల్లుల్లో జరిగిన ధాన్యం మిల్లింగ్‌ ద్వారా వచ్చే నూక ఎంత? మిల్లు పేరిట వెళుతున్న నూక ఎంత? అన్నదాన్ని పరిశీలిస్తే వాస్తవాలు వెలుగు చూసే అవకాశాలుంటాయి. అధికార యంత్రాంగం నూకల రవాణా విషయంలో లోతుగా దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉంది.  

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా